Friday, July 24, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుదేవాదుల ప్రాజెక్టు 9 మోటార్లు రన్‌

దేవాదుల ప్రాజెక్టు 9 మోటార్లు రన్‌

- Advertisement -

ఎగువకు 2,306 క్యూసెక్కులు ..మరో మోటారుకు మరమ్మతులు
ఇన్‌టేక్ వెల్ వద్ద లీకేజీలు ఇన్‌‌ఫ్లో కొనసాగితేనే అన్ని రిజర్వాయర్లు నింపే ఛాన్స్

నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టేక్ వెల్ వద్ద ప్రస్తుతం 9 మోటర్లతో రోజుకు 2,306 క్యూసెక్కుల గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. మరో మోటరు మరమ్మతులు పూర్తి కాలేదు. గురువారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టేక్‌వెల్ వద్ద 83 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవల్ (ఎఫ్‌ఆర్‌ఎల్)కు గాను 75.80 మీటర్లతో గోదావరి నది ప్రవహిస్తుంది. 46,300 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా 43,994 క్యూసెక్కులు అవుట్‌ఫ్లో వుంది. రెండ్రోజుల కింద ఇన్‌టేక్ వెల్ వద్ద 7 మోటర్లు మాత్రమే పనిచేయగా, తాజాగా మరో రెండు మోటర్లు పనిచేస్తుండడంతో మొత్తం 9 మోటర్లతో గోదావరి జలాలను ఎత్తిపోస్తున్నారు. ఇన్‌టేక్‌వెల్ వద్ద వున్న 10 మోటర్లు రన్ అయితే రోజుకు 2,596 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోయనున్నాయి. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. దేవాదుల ప్రాజెక్టు నుంచి వచ్చే నీరే ఉమ్మడి వరంగల్‌కు తాగునీరు, సాగునీరుకు ఉపయోగించాలి. దీంతో ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టేక్‌వెల్‌ను సందర్శించి మోటర్ల పనితీరు, గోదావరి జల మట్టం పరిశీలించి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలను ఆదుకునేలా కార్యచరణ రూపొందించారు. ఈ మేరకు ఇన్‌ఫ్లో భాగుండడంతో మోటర్లను అధికారులు మంత్రుల సందర్శన కంటే ముందు నుంచే రన్ చేస్తున్నారు. మరో రెండు, మూడ్రోజుల్లో 10వ మోటర్‌ను కూడా రన్ చేయడానికి అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేవాదుల ప్రాజెక్టు మూడు దశల్లో 22 రిజర్వాయర్లను నిర్మించారు.

​ఇన్‌టేక్‌వెల్ సమీపంలో లీకేజీలు
దేవాదుల ప్రాజెక్టు ఇన్‌టేక్‌వెల్ నుంచి భూపాలపల్లి జిల్లాలోని భీంఘన్‌పూర్‌కు వెళ్లే పైప్‌లైన్ ఎయిర్‌వాల్వ్‌లు పలు ప్రాంతాల్లో లీకై పెద్ద ఎత్తున నీరు వృధాగా పోతుంది. కన్నాయిగూడెం మండలంలోని ముకునూరు, పలిమెల మండలంలోని కునుకునూరు మధ్య మెయిన్ పైప్‌లైన్‌పైనున్న ఐదారు ప్రాంతాల్లో ఎయిర్ వాల్వులు లీకయ్యాయి. దీంతో పెద్ద ఎత్తున నీరు ఫౌంటెయిన్‌లా పోతుంది. ఈ లీకేజీలను మరమ్మతులు చేయాలంటే మోటర్లను ఆఫ్ చేయాల్సి వుంటుంది.

​10 మోటర్లు రన్నయితే..
జూలై 1వ తేదీ నుంచి ఇన్‌టేక్‌వెల్ వద్ద మోటర్లను రన్ చేయడం ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు 2.389 టీఎంసీల నీటిని ఎత్తిపోశారు. ఇన్‌టేక్‌వెల్ వద్దవున్న 10 మోటర్లు నిరంతరంగా రన్ చేస్తే రోజుకు 2,596 క్యూసెక్కుల గోదావరి జలాలను ఎత్తిపోసే అవకాశముంది. ఈ ప్రాజెక్టు పరిధిలో 10 జిల్లాల్లో సుమారు 6 లక్షల ఎకరాకుల సాగునీరందించాల్సి వుంది. గోదావరి నదిలో ఇదే ఇన్‌ఫ్లో కొనసాగితే రెండు నెలలపాటు మోటర్లను రన్ చేసే అవకాశముంటుంది. ఇన్‌ఫ్లో తగ్గితే కొన్ని మోటర్లను ఆఫ్ చేయాలి. ఇన్‌‌ఫ్లో తగ్గితే రిజర్వాయర్లకు గోదావరి జలాలను తరలించడం ఇబ్బందిగా మారనుంది.

​సమన్వయంతో పనిచేయాలి
దేవాదుల ఇన్‌టేక్‌వెల్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసే విషయంలో నీటిపారుదల శాఖ ఇంజినీర్లు, ట్రాన్స్‌కో ఇంజినీర్లు సమన్వయంతో పనిచేస్తేనే మోటర్లను సక్రమంగా నడపడానికి వీలుంటది. దేవాదుల ప్రాజెక్టు పరిధిలోని అన్ని పంప్‌హౌజ్‌లను ఇరిగేషన్‌, ట్రాన్స్‌కో ఇంజినీర్ల బృందాలు సమన్వయం చేసుకోవాలి. ఇదిలావుంటే మోటర్లు ట్రిప్ అయితే హైద్రాబాద్, బెంగుళూరు నుంచి నిపుణులు వచ్చి మోటర్లను భాగు చేయాల్సిందే తప్పా వరంగల్‌లో ఈ మోటర్లను మరమ్మతులు చేసే నిపుణులు లేకపోవడం గమనార్హం. గోదావరి జలాల ఇన్‌ఫ్లో భారీగా వుంటే ప్రాజెక్టు పరిధిలోని అన్ని రిజర్వాయర్లను నింపే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -