విద్యార్థుల ఉద్యమాన్ని అణచివేతతో అడ్డుకోలేరు..
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి : సీపీఐ రాష్ట్ర నేతల డిమాండ్
ట్యాంక్ బండ్ వరకు సీపీఐ శ్రేణుల భారీ నిరసన ప్రదర్శన
నవతెలంగాణ-హిమాయత్ నగర్
అధికారం, డబ్బు బలంతో రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలను చీల్చుతూ ప్రజాప్రతినిధులను కొనుగోలు చేసి అధికారంలోకి వస్తున్న బీజేపీని ప్రజలు భవిష్యత్‌లో క్షమించరని సీపీఐ రాష్ట్ర నేతలు హెచ్చరించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులపై లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తూ గురువారం సీపీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లిబర్టీ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులపై ఢిల్లీలో అమానుషంగా లాఠీచార్జి చేయడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమన్నారు. ఈ ఘటనలపై న్యాయవ్యవస్థ స్పందించి విచారణ చేపట్టాలని కోరారు. అణచివేతతో ఉద్యమాలను ఆపలేరని, విద్యార్థులతో ఘర్షణకు దిగిన ప్రభుత్వాలు చరిత్రలో నిలువలేదని హెచ్చరించారు. ఢిల్లీ ఘటనలపై సుప్రీంకోర్టు, హైకోర్టులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వెంటనే విచారణ చేపట్టాలని ఒకరు ఢిల్లీ హైకోర్టుకి వెళ్తే.. ఆ ఘటనలతో తమకు సంబంధం లేదని, ఇందులో తమను భాగస్వాములను చేయొద్దని చెప్పడం, సుప్రీంకోర్టేమో.. ఇటువంటి వాటితో సమయం వృథా చేయొద్దని పేర్కొనడం విచారకరమన్నారు. తొలుత సుప్రీంకోర్టు ప్రధాన నాయమూర్తి యువకులను బొద్దింకలు అని సంబోధించారని గుర్తు చేస్తూ, ఇప్పుడు ఆ బొద్దింకల ఆధ్వర్యంలోనే పెద్దఎత్తున పోరాటాలు కొనసాగిస్తున్నారన్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. నీట్ పేపర్ లీకేజీ పునరావృతం కావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమన్నారు. నీట్ పరీక్షలను రాష్ట్రాలకు అప్పగిస్తే ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ గతంలో విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు ఇలాగే పేపర్ లీక్ అయితే పెద్ద ఉద్యమం నిర్వహించారని, మరి నేడు ఆయన విద్యా మంత్రిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వహించనందుకు బాధ్యత వహించి రాజీనామా చేయాలని అన్నారు. గతంలో రైతు ఉద్యమం ఎలా కొనసాగిందో అంతకంటే రెండింతలు రెట్టింపుగా నేడు విద్యార్థుల ఉద్యమం జరుగుతోందన్నారు. సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మెన్ కె.నారాయణ మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టిన కేంద్ర ప్రభుత్వ విధానాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు సహా పలు రాజకీయ పార్టీలు తమ తమ విధానాల్లో ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నాయన్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని రాజకీయ కోణంలో చూపే ప్రయత్నాలను ఖండించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, లేకుంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఈటి.నరసింహ, తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర సమితి సభ్యులు బి. స్టాలిన్, విజయలక్ష్మి, ముత్యాల యాదిరెడ్డి, ఎం. అనిల్, కె. ధర్మేంద్ర, రామకృష్ణ పాల్గొన్నారు.



