Wednesday, July 29, 2026
E-PAPER
Homeజాతీయంమరో ప్రశ్నాపత్రం లీక్

మరో ప్రశ్నాపత్రం లీక్

- Advertisement -

అంగట్లో మిషన్ లెర్నింగ్ ఫర్ ఐఓటీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్
థియరీ ప్రశ్నాపత్రాలు రెండు పరీక్షలు రద్దు వేలాది మంది విద్యార్థులపై ప్రభావం!
సంబంధిత ప్రొఫెసర్‌పై వేటు

​డెహ్రాడూన్ : దేశంలో వరుసగా వెలుగుచూస్తున్న పేపర్ లీక్ ఘటనలు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్న వేళ.. ఉత్తరాఖండ్‌లో మరో పేపర్‌ ‌లీక్‌ ఉదంతం బయటపడింది. పరీక్షలకు నెల రోజుల ముందే ప్రశ్నాపత్రాలు లీక్ కావడం, పరీక్షలో అవే ప్రశ్నలు వచ్చినట్టు తెలియడంతో ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు ఇంజినీరింగ్ సెమిస్టర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. డెహ్రాడూన్‌లోని వీర్ మాధో సింగ్ భండారీ ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ (యూటీయూ) పరిధిలోని ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు రాసిన సెమిస్టర్ పరీక్షల్లో రెండు సబ్జెక్టుల ప్రశ్నాపత్రాలు ముందుగానే బయటకు వచ్చినట్టు తేలింది. దీంతో యూనివర్సిటీ అధికారులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. మిషన్ లెర్నింగ్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఎంఎల్ టీ), ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకైనట్టు గుర్తించారు. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్ విద్యార్థుల వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నాపత్రానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలను షేర్ చేసినట్టు తేల్చారు. పరీక్షలోనూ అవే ప్రశ్నలు వచ్చినట్టు గుర్తించారు. ఈ క్రమంలోనే గుర్తు తెలియని వ్యక్తి నుంచి యూనివర్సిటీకి, ఇంజినీరింగ్ కళాశాలల డైరెక్టర్లకు ఫిర్యాదు మెయిల్ వచ్చింది. ఆ ఫిర్యాదు ఆధారంగా యూనివర్సిటీ అధికారులు అంతర్గత విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ తృప్తా ఠాకూర్ ఆదేశాలతో ప్రత్యేక విచారణ కమిటీ ఏర్పాటు చేశారు.వారు సంబంధిత వ్యక్తులను విచారించడంతో పాటు ప్రశ్నాపత్రాల తయారీ, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. ఓ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ పరీక్షకు ముందే ప్రశ్నాపత్రాన్ని కొంతమంది విద్యార్థులకు చేరవేసినట్టు నిర్ధారణకు వచ్చారు. విచారణ నివేదిక ఆధారంగా యూనివర్సిటీ కఠిన చర్యలు తీసుకుంది. ముందుగా లీకైనట్టు నిర్ధారణ అయిన పరీక్షలను రద్దు చేసింది. ఈ నిర్ణయంతో యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సుమారు 12 ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులపై ప్రభావం పడింది.

ఆగస్టు మూడో వారంలో పరీక్షలు
ఈ ఘటనపై యూటీయూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ వీకే పటేల్ మాట్లాడుతూ… రెండు సబ్జెక్టుల ప్రశ్నపత్రాలు లీకైనట్టు నిర్ధారణ అయ్యిందని తెలిపారు. రద్దు చేసిన పరీక్షలను మళ్లీ నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు మూడో వారంలో ఈ పరీక్షలను నిర్వహించే అవకాశం ఉందని వెల్లడించారు. మరోవైపు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ తృప్తా ఠాకూర్ కీలక విషయాలను వెల్లడించారు. ఓ పరీక్షా పేపర్ లీక్‌పై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టామని, అందులో నిజాలు బయటపడిన తర్వాత చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఆ పరీక్షకు హాజరైన 22 మంది విద్యార్థుల పేపర్లను రద్దు చేసినట్టు చెప్పారు.అయితే విచారణలో అదే ప్రొఫెసర్ మరో ప్రశ్నాపత్రం తయారీ ప్రక్రియలో కూడా భాగస్వామిగా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఆ పరీక్షపై ఫిర్యాదు లేకపోయినా ముందస్తు జాగ్రత్తగా రద్దు చేసినట్టు వెల్లడించారు. పేపర్ లీక్‌కు కారణమైన ప్రొఫెసర్‌పై కఠిన చర్యలు తీసుకున్నట్టు యూనివర్సిటీ తెలిపింది. పరీక్షలకు సంబంధించిన అన్ని విధుల నుంచి ఏడేండ్ల పాటు ఆయనపై నిషేధం విధించింది. అలాగే సంబంధిత కళాశాలకు కూడా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై తీవ్రంగా స్పందించిన యూనివర్సిటీ పరీక్షల పారదర్శకత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -