Friday, July 24, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా పాస్‌పోర్ట్…వెరీ పూర్ !

అమెరికా పాస్‌పోర్ట్…వెరీ పూర్ !

- Advertisement -

విలువ కోల్పోతున్న ప్రయాణ పత్రాలు
తాజా ర్యాంకింగ్స్‌లో పదో స్థానానికి పరిమితం


వాషింగ్టన్ : 2006లో అమెరికా పాస్‌పోర్ట్ ప్రపంచానికి ఓ అత్యున్నత టిక్కెట్‌గా ఉండేది. కానీ ఆ తర్వాత గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఇప్పుడు అమెరికా ప్రయాణ పత్రాలకు పెద్దగా విలువ లేకుండా పోయింది. ప్రయాణ స్వేచ్ఛకు సంబంధించిన ర్యాంకింగ్స్‌లో అమెరికా బాగా వెనుకబడిపోయింది. వీసా లేకుండా లేదా వీసా ‘ఆన్’ డిమాండ్ పైన సందర్శించగలిగిన ప్రదేశాల సంఖ్య ఆధారంగా హెన్లీ పాస్‌పోర్ట్ సూచిక విడుదల చేసిన తన 20వ వార్షికోత్సవ నివేదిక ప్రకారం ఇప్పుడు అమెరికా పదో స్థానంలో ఉంది. హెన్లీ తన ర్యాంకింగ్స్‌లో ఒకే స్కోరు పొందిన దేశాలన్నింటికీ ఒకే స్థానాన్ని ఇస్తుంది. దీనిని బట్టి చూస్తే అమెరికా కంటే 36 దేశాలు ముందంజలో ఉన్నాయి. డెన్మార్క్, ఫిన్లండ్ దేశాలు నాలుగో స్థానంలో నిలిచాయి.

నెంబర్ 1 స్థానంలో సింగపూర్
ఈ ఏడాది జూలైలో ‘అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌’గా సింగపూర్ నిలిచింది. ఈ పాస్‌పోర్టు ఉన్నవారు ప్రపంచంలోని 192 గమ్యస్థానాలకు వీసా లేకుండానే ప్రయాణించవచ్చు. 2006లో సింగపూర్ పాస్‌పోర్టు ఉన్న వారు 122 దేశాలలో వీసా లేకుండానే ప్రయాణించారు. తాజాగా ఈ జాబితాలో మరో 70 దేశాలు చేరాయి. తాజా ర్యాంకింగ్స్‌లో అద్భుతమైన పురోగతిని సాధించిన దేశం యూఏఈ. ఆర్థిక, పర్యాటక కేంద్రమైన యూఏఈ ఈ ఏడాది ర్యాంకింగ్స్‌లో పైకి ఎగబాకి రెండో స్థానాన్ని దక్కించుకుని జపాన్, దక్షిణ కొరియా సరసన నిలిచింది. ఈ మూడు దేశాల పౌరులు వీసా లేకుండా 188 గమ్యస్థానాలకు ప్రయాణించవచ్చు. రెండు దశాబ్దాల క్రితం నాటి ర్యాంకింగ్స్‌తో పోలిస్తే జపాన్‌కు అదనంగా 60 గమ్యస్థానాలు, దక్షిణ కొరియాకు 73, యూఏఈకి ఏకంగా 153 గమ్యస్థానాలు పెరిగాయి. ఫ్రాన్స్‌తో సహా అనేక ఐరోపా దేశాలు నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి.

ఎవరు ఏ స్థానంలో ?
2006లో 129 స్కోరుతో ప్రపంచం లోనే రెండో స్థానంలో నిలిచిన స్వీడన్ తాజాగా 187 స్కోరుతో మూడో స్థానానికి పరిమితమైంది. జూలై ర్యాంకింగ్స్‌లో 186 స్కోరుతో బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, ఇటలీ, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్ దేశాలు నాలుగో స్థానాన్ని పంచుకున్నాయి. మాల్టా తన స్కోరును 185కి పెంచుకొని ఆస్ట్రియా, గ్రీస్, పోర్చుగల్, స్విట్జర్లాండ్‌లతో కలిసి ఐదో స్థానంలో నిలిచింది. 2006లో మాల్టా టాప్ -10 జాబితాలోనే లేదు. అమెరికా ఇప్పుడు పదో స్థానంలో నిలిచి ఐస్‌లాండ్ సరసన చేరింది. అమెరికా పాస్‌పోర్టు ఉన్న వారు 180 గమ్యస్థానాలకు వీసాలు లేకుండా ప్రయాణించవచ్చు. 184 స్కోరుతో హంగరీ, పోలండ్, బ్రిటన్ ఆరో స్థానంలోనూ, 183 స్కోరుతో ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, లాత్వియా, మలేసియా, న్యూజిలాండ్ ఏడో స్థానంలోనూ, 182 గమ్యస్థానాలతో క్రొయేషియా, ఎస్టోనియా ఎనిమిదో స్థానంలోనూ, 181 స్కోరుతో లిచ్‌స్టెన్‌స్టీన్, లిథుయేనియా తొమ్మిదో స్థానంలోనూ, 180 స్కోరుతో ఐస్‌లాండ్, అమెరికా పదో స్థానంలోనూ నిలిచాయి.

శాంతి సూచికలో…
హెన్లీ పాస్‌పోర్ట్ సూచికలో పదో స్థానంలో నిలిచిన అమెరికా ప్రపంచ శాంతి సూచికలో 134వ స్థానంలో సరిపెట్టుకుంది. ఈ సూచికలో ఇజ్రాయిల్ స్థానం 149.

పెరిగిన అంతరం
గత రెండు దశాబ్దాల కాలంలో ప్రపంచంలో అత్యధికంగా, అతి తక్కువగా ప్రయాణించే పౌరుల సంఖ్య మధ్య అంతరం గణనీయంగా పెరిగిందని నివేదిక తెలిపింది. సూచికలో అగ్ర స్థానంలో ఉన్న సింగపూర్‌కు, చివరి స్థానంలో ఉన్న ఆప్ఘనిస్తాన్‌కు మధ్య 118 గమ్యస్థానాల అంతరం ఉంది. 2006-2026 మధ్యకాలంలో వీసా రహిత ప్రవేశంలో నికర నష్టాన్ని నమోదు చేసిన ఏకైక పాస్‌పోర్ట్ బొలీవియాదే. ప్రస్తుతం దీని స్థానం 77. ఇది ఆరు గమ్య స్థానాలను కోల్పోయింది. మిగిలిన అన్ని పాస్‌పోర్టులు ప్రపంచవ్యాప్త ప్రయాణాలలో మెరుగదలను కనబరచాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -