నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో ఉన్నత చదువులు చదివి ఉద్యోగంలో స్థిరపడిన తెలంగాణ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. నిర్మల్ జిల్లాకు చెందిన నిత్యానంద రెడ్డి (26) చికిత్స పొందుతూ కన్నుమూశాడు. బ్రెయిన్ డెడ్ కారణంగా అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి, అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. అనంతరం మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్లో నివాసం ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. గత శనివారం తన బైక్పై బయటకు వెళ్లగా, వేగంగా వచ్చిన ఓ కారు బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో నిత్యానంద రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్నేహితులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే అతని పరిస్థితి విషమించింది. నిన్న బ్రెయిన్ డెడ్ కావడంతో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఒక్కగానొక్క కొడుకు మరణవార్త విని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.



