మద్యం తాగడం మంచిది కాదని తెలిసినా చాలామంది దానికి బానిసలవుతుంటారు. తాగి వారిలోని మనిషి తనాన్ని మర్చిపోతారు. భార్యాపిల్లల్ని, తల్లిదండ్రులను కూడా హింసిస్తూ ఉంటారు. అలాంటి వారికి సమాజంలో, కుటుంబంలో విలువంటూ ఉండదు. అందరూ చీదరించుకుంటున్నా వారిలో మార్పు మాత్రం ఉండదు. అలా బాధపడుతున్న ఓ కుటుంబం గురించి ఈరోజు ఐద్వా అదాలత్(ఐలమ్మ ట్రస్ట్)లో చదువుదాం…
సునీతకు దాదాపుగా 40 ఏండ్లు ఉంటాయి. చిన్నవయసులోనే నరేష్‌ని ప్రేమించి పెండ్లి చేసుకుంది. వీరికి ముగ్గురు పిల్లలు. ఇటీవలె ఇద్దరూ కలిసి ఐద్వా అదాలత్‌కు వచ్చారు. సునీత వస్తూనే ‘నా భర్తతో నేను ఉండలేకపోతున్నాను. పాతికేండ్ల నుండి అతనితో వేగుతున్నాను. ఇక నా ఓపిక నశించింది. అందుకే పిల్లల్ని తీసుకొని దూరంగా ఉంటున్నాను. మా మామయ్య చనిపోయాడని తెలిసి మళ్లీ వచ్చాను. ఆయన పెద్ద దినం అయిపోయిన తర్వాత వెళ్లిపోదామనుకుంటున్నా. నేనూ పిల్లలు దూరంగా ఉంటేనన్నా ఆయనలో మార్పు వస్తుందనుకున్నా. కానీ అదేం లేదు. హాయిగా తాగి తిరుగుతున్నాడు. మామయ్య చనిపోయి మూడు రోజులు కూడా కాలేదు, నాతో గొడవ పెట్టుకున్నాడు. నన్ను ఇక్కడే ఉండమంటున్నాడు’ అంటూ ఏడుస్తూ చెప్పింది. ఆమెను కూర్చోబెట్టి అసలు విషయం ఏంటో ప్రశాంతంగా చెప్పమన్నాం. ‘నరేష్‌కు ముందు నుండి మందు తాగే అలవాటు ఉంది. అయితే పదేండ్ల నుండి దానికి బానిసైపోయాడు. తాగొచ్చి నన్నూ, పిల్లల్ని విపరీతంగా కొట్టేవాడు. మమల్ని వెళ్లిపొమ్మని ఇంట్లో నుండి బయటకు గెంటేసేవాడు. పిల్లలతో రాత్రంతా బయటే కూర్చునేదాన్ని. వర్షం పడుతున్నా తడుస్తూ నిలబడేవాళ్లం. అయినా ఇంట్లోకి రమ్మనేవాడు కాదు. మేము వెళ్లినా మళ్లీ నెట్టేసి ఇంటికి తాళం వేసుకునేవాడు.
కొన్ని సార్లు మా పుట్టింటికి, బంధువుల ఇంటికి వెళ్లేదాన్ని. పెద్దమనుషులతో ఎన్నిసార్లు మాట్లాడించినా ప్రయోజనం లేదు. అక్కడ అందరి ముందు ‘నేను బాగానే ఉంటాను. ఎలాంటి పొరపాటు చేయను, ఇకపై తాగను’ అంటాడు. ఇంటికి వచ్చిన తర్వాత తిరిగి అలాగే ప్రవర్తిస్తాడు. తాగుడే కాకుండా ఇతర మహిళలతో సంబంధాలు కూడా పెట్టుకున్నాడు. పైగా నన్ను అనుమానిస్తాడు. ఐదేండ్ల నుండి ఇలాగే వేధిస్తున్నాడు. ఒకసారైతే నాపై అనుమానంతో నా బట్టలన్నీ కాల్చేశాడు. నా ఒంటిపై చీరతప్ప ఏమీ మిగలలేదు. మా బంధువులు ఇచ్చిన బట్టలు వేసుకున్నాను. నావే కాదు పిల్లల బట్టలు కూడా కాల్చేశాడు. పెద్ద పాప కాలేజీకి వెళుతుంది. బాబు కూడా కాలేజీలో చదువుతున్నాడు. చిన్న పాప స్కూల్‌కి వెళుతుంది. బట్టలు లేక పిల్లలు ఎంత ఇబ్బంది పడ్డారో గుర్తుకొస్తే ఏడుపొస్తుంది.ఎదిగిన పిల్లలతో ‘మీ అమ్మ నన్ను దగ్గరకు రానీయడం లేదు, అందుకే వేరే వాళ్లతో సంబంధం పెట్టుకున్నాను’ అంటాడు. అతనికి చెప్పీ చెప్పీ పెద్దమనుషులకు కూడా చిరాకు వచ్చింది. దాంతో అందరూ నన్ను ‘అలాంటి వాడితో బతకడం ఎందుకు, నీ బతుకు నువ్వు చూసుకోవచ్చు కదా! పిల్లలతో ఎక్కడైనా దూరంగా ఉండూ’ అనేవారు. నాకు అమ్మ లేదు. నాన్న పెద్దవాడైపోయాడు. అన్నలు ఉన్నారు.
కానీ అందరూ వేరువేరుగా ఉంటున్నారు. అక్కడికి వెళ్లి రెండు రోజులు ఉండగలను కానీ పిల్లతో ఎప్పటికీ ఉండలేను కదా! అందుకే ఎంత కష్టం వచ్చినా అన్నేండ్లు అతనితోనే బతికాను. పాప ఉద్యోగంలో చేరింది. పిల్లలు అతనితో ఉండటానికి ఇష్టపడడం లేదు. అందుకే వేరే ఇల్లు తీసుకొని పిల్లతో అక్కడే ఉంటున్నాను. ఇప్పుడు బాబు కూడా ఉద్యోగం చేస్తున్నాడు. నేనూ కూడా ఉద్యోగం చూసుకున్నాను. ప్రస్తుతం చిన్నపాప ఒక్కతే చదువుకుంటుంది. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో మా మామయ్య చనిపోవడంతో ఇక్కడికి వచ్చాను. కార్యక్రమాలన్నీ అయిపోయాక వెళ్లిపోదామనుకున్నా. కానీ నన్ను వెళ్లనీయనంటూ గొడవ చేస్తున్నాడు’ అని చెప్పింది. సునీత చెప్పింది మొత్తం విన్న తర్వాత నరేష్‌ను అడిగితే ‘అవును మేడం, ఆమె చెప్పింది నిజమే కానీ ప్రస్తుతం నాకు నా భార్యా పిల్లలు కావాలి’ అన్నాడు. దానికి మేము భార్యాపిల్లలు కావాలంటే ముందు నీ ప్రవర్తన మార్చుకోవాలి. ఇలా తాగి గొడవ చేస్తుంటే ఎవరు మాత్రం ఎన్నిరోజులని భరిస్తారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లయ్యారు. అయినా ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు. నీ పిల్లలే నిన్ను అసహ్యించుకుంటున్నారు. నీ దగ్గర ఉండటానికి ఇష్టపడడం లేదు. నువ్వు మారతావనే నమ్మకం వాళ్లకు లేదు. కాబట్టి నీ బతుకు నువ్వు బతుకు.
వాళ్ల బతుకు వాళ్లు బతుకుతారు. ఒకవేళ నువ్వు నిజంగా మారితే ముందు నీ భార్య, పిల్లలు నిన్ను నమ్మాలి. అప్పుడే మేము ఏమైనా చేయగలం. తాగి గొడవ పడుతూ నా భార్య పిల్లలు కావాలంటే కుదరదు. అయినా మీరు ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నావు. ఆమెకు తల్లి లేదు. ఎక్కడా ఉండే పరిస్థితి లేదు. అయినా కట్టుకున్న భార్యను, పిల్లలను నడిరోడ్డుపై నిలబెడుతున్నావు. అందుకే నీపై వాళ్లకు నమ్మకం పోయింది. మళ్లీ వాళ్ల మనసులో స్థానం సంపాదించుకుంటే అప్పుడు ఆలోచిస్తాం. నీకు నిజంగా భార్యాపిల్లలు కావాలంటే తాగడం మానుకో. ఏదైనా ఉద్యోగం చేసుకో. నీలో మార్పు వస్తే మేమే సునీతతో, పిల్లలతో మాట్లాడి అందరూ కలిసి ఉండేలా చూస్తాం’ అని చెప్పాము. సునీతతో ‘అతనికి కొన్ని రోజులు సమయం ఇద్దాం. నీ భర్త మారాడని నీకు నమ్మకం వస్తే అప్పుడు పిల్లలతో కలిసి ఓ నిర్ణయం తీసుకో. అప్పటి వరకు అతను నీ జోలికి రాకుండా అవసరమైతే పోలీసుల సాయం తీసుకుందాం’ అని ధైర్యం చెప్పి పంపించాము.



