ఆయిల్ పామ్ సాగును
మరింత విస్తరించండి: ఆయిల్‌ఫెడ్ అధికారుల సమావేశంలో మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైతుల ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంలోనూ అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలనీ, ఎల్‌నినో నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయిల్ ఫెడ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణ, నర్సరీల నిర్వహణ, మొక్కల లభ్యత, రైతులకు అందుతున్న సేవలు, డ్రిప్ ఇరిగేషన్ అమలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ…వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులకు ప్రత్యామ్నాయంగా నిలబడగల పంటలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఆయిల్‌పామ్ సాగు విస్తరణను వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోందన్నారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ తాజా గెలలకు మార్కెట్లో మంచి ధర లభిస్తోందనీ, ఈ కారణంగా పెద్ద సంఖ్యలో రైతులు ఆయిల్‌పామ్ సాగు వైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు.. రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదనీ, ఒకే చోట అవసరమైన సేవలు అందేలా వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లా కల్లూరు గూడెంలో నిర్మాణంలో ఉన్న ఆయిల్‌పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌కు సంబంధించిన మిగిలిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. “విజయ హైదరాబాద్” బ్రాండ్ వంటనూనెల విక్రయాలను పెంపొందించే దిశగా మార్కెట్ విస్తరణ, విస్తృత ప్రచార కార్యక్రమాలు, విక్రయ ప్రోత్సాహక చర్యలు చేపట్టాలని సూచించారు. ఆన్ లైన్ పోర్టల్ ద్వారానే అమ్మకాలు, కొనుగోలు నిర్వహించాలనీ, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినేస్ వారితో సంప్రదించి మార్కెటింగ్ విభాగాన్ని బలోపేతం చేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో ఏపీసీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. సురేందర్ మోహన్, ఉద్యాన శాఖ డైరెక్టర్, టీజీ ఆయిల్‌ఫెడ్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ యాస్మీన్ బాషా తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



