Sunday, July 26, 2026
E-PAPER
Homeహెల్త్కాలేయం జాగ్రత్త

కాలేయం జాగ్రత్త

- Advertisement -

కాలేయం (Liver) మన శరీరంలో రక్తాన్ని వడబోస్తూ, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పించే కీలకమైన అవయవం. కలుషితమైన ఆహారం, నీరు, సంక్రమిత రక్తం లేదా శారీరక స్రావాల (వీర్యం, లాలాజలం మొదలైనవి) ద్వారా కాలేయానికి సోకే ప్రమాదకరమైన వైరల్‌ ఇన్ఫెక్షన్ల సమాహారమే ‘హెపటైటిస్‌’. అయితే అవగాహన లోపం వల్ల ప్రపంచవ్యాప్తంగా , టిబి లేదా మలేరియా కంటే ఈ వ్యాధి వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

హెపటైటిస్‌ రకాలు – వ్యాప్తి
హెపటైటిస్‌ A & E (స్వల్పకాలికం):
ఇవి ఎక్కువగా అపరిశుభ్ర వాతావరణం, కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాపిస్తాయి. సాధారణంగా ఇవి ప్రాణాంతకం కావు.
హెపటైటిస్‌ A, B & D (దీర్ఘకాలికం – క్రానిక్‌): ఇవి అత్యంత ప్రమాదకరమైనవి. శరీరంలోకి చేరిన కొత్తలో ఎలాంటి లక్షణాలు చూపించవు. సకాలంలో గుర్తించకపోతే కాలేయం గట్టిపడటం (సిర్రోసిస్‌) లేదా లివర్‌ క్యాన్సర్‌కు దారితీస్తాయి. రక్షణ లేని లైంగిక సంబంధాలు, ఒకరికి వాడిన సూదులు/ బ్లేడ్లను వాడటం, సరైన స్క్రీనింగ్‌ లేని రక్త మార్పిడి, కాన్పు సమయంలో తల్లి నుండి బిడ్డకు ఇవి సంక్రమిస్తాయి.
ముఖ్యమైన లక్షణాలు: తీవ్రమైన అలసట, ఆకలి మందగించడం, అకస్మాత్తుగా బరువు తగ్గడం. పొత్తికడుపు నొప్పి, కండరాల నొప్పులు, వికారం లేదా వాంతులు. బ చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం (కామెర్లు), ముదురు పసుపు రంగులో మూత్రం, లేత రంగులో మలం రావడం. వ్యాధి ప్రారంభ దశలో ఫ్లూ (Flu) లేదా సాధారణ జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

నివారణ చర్యలు (Preventive & Legal Measures) :
తప్పనిసరి వ్యాక్సినేషన్‌: హెపటైటిస్‌ A, B లకు సమర్థవంతమైన టీకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా హెపటైటిస్‌ దీ వ్యాక్సిన్‌ కోర్సును ప్రతి ఒక్కరూ పూర్తి చేయడం ద్వారా కాలేయ క్యాన్సర్‌ నుండి జీవితకాల రక్షణ పొందవచ్చు.
సురక్షిత రక్త మార్పిడి: చట్టపరమైన నిబంధనల ప్రకారం బ్లడ్‌ బ్యాంకులు పూర్తిగా పరీక్షించిన రక్తాన్ని మాత్రమే రోగులకు అందించాలి. రక్తం తీసుకునే ముందు రోగుల బంధువులు కూడా క్రాస్‌-చెక్‌ చేసుకోవడం మంచిది.
సురక్షిత ప్రసవ సంరక్షణ: గర్భిణీలకు ముందే పరీక్షలు నిర్వహించి, ఒకవేళ ఇన్ఫెక్షన్‌ ఉంటే పుట్టిన వెంటనే శిశువుకు వ్యాక్సిన్‌, ఇమ్యునోగ్లోబులిన్‌ అందించడం ద్వారా వ్యాధిని అరికట్టవచ్చు.

సెలూన్లు & బ్యూటీ పార్లర్లలో జాగ్రత్త
– షేవింగ్‌ కోసం ప్రతిసారీ కొత్త బ్లేడు వాడుతున్నారో లేదో గమనించాలి.
– టాటూలు వేయించుకునేటప్పుడు స్టెరిలైజ్డ్‌ నీడిల్స్‌ మాత్రమే వాడాలి.
వ్యక్తిగత పరిశుభ్రత : నిరంతరం పరిశుభ్రమైన తాగునీరు, వేడి ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం, ఇతరులు వాడిన టూత్‌ బ్రష్‌లు, రేజర్లను ఎట్టిపరిస్థితుల్లోనూ పంచుకోకపోవడం.
తీసుకోవాల్సిన ఆహారం
– కాలేయం (లివర్‌) ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలను వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది.
– పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి.
– స్వీట్లు, బేకరీ పదార్థాలు, కార్బోనేటెడ్‌ (సాఫ్ట్‌) డ్రింక్స్‌ తీసుకోకూడదు.
– నూనె తక్కువగా ఉపయోగించిన ఆహారం తీసుకోవాలి.
– కొంతమంది రోగుల్లో ఉప్పును పూర్తిగా తగ్గించాల్సి లేదా మానేయాల్సి రావచ్చు. ఇది రక్త పరీక్షలు, స్కాన్‌ రిపోర్టుల ఆధారంగా వైద్యులు నిర్ణయిస్తారు.
– పొట్టలో నీరు (Ascitic Fluid) ఉన్న రోగులకు నీరు ఎంత తాగాలో కూడా వైద్యులు నిర్ణయిస్తారు.
-SGPT, SGOT వంటి లివర్‌ పరీక్షల ఫలితాలు, రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి ప్రోటీన్‌ పరిమాణాన్ని వైద్యులు నిర్ణయిస్తారు. అవసరమైన మోతాదులో వెజిటేబుల్‌ ప్రోటీన్‌ తీసుకోవచ్చు.
చివరగా : హెపటైటిస్‌ అనేది సైలెంట్‌ కిల్లర్‌ వంటిది. అయితే సరైన అవగాహన, వ్యాక్సినేషన్‌, పరిశుభ్రత ద్వారా దీన్ని వందశాతం నివారించవచ్చు.

వాణి అయోధ్య
క్లినికల్‌ డైట్‌ కన్సల్టంట్‌
9959361180

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -