ఇందిరా పార్క్‌లో ఉదయం నడుచుకుంటూ వెళుతున్నప్పుడు విద్యార్థుల మాటలు చెవిన పడ్డాయి. నిజానికి చెవులకు కూడా మనసు ఉంటుంది! ‘చాలా ట్రై చేస్తున్నాను.. అయినా చిన్న చిన్న మిస్టేక్స్‌తో పోతున్నాయి, అవును రా, నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏం చేయాలో, ఏం చేయకూడదో అర్థం కావడం లేదు.. విరక్తి కలుగుతోంది.’ నా అడుగులు ముందుకు వెళుతున్నా.. మనసు మాత్రం ఆ మాటల దగ్గరే ఆగిపోయింది. ఎందుకంటే వాళ్లు చెప్పిన ‘చిన్న చిన్న మిస్టేక్స్’ కంటే, ఆ మిస్టేక్స్‌కి వాళ్లు ఇచ్చుకుంటున్న అర్థమే నాకు ముఖ్యంగా అనిపించింది.
ఎంత ప్రయత్నించినా ఫలితం మారదని అనిపిస్తే, చివరికి ప్రయత్నించడమే మానేస్తారు. అంటే అసహాయతను మనసు ‘నేర్చుకోవడం’. ఒక విద్యార్థి రెండు మూడు పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడనుకుందాం. మొదట ‘ఈసారి నా preparation సరిగ్గా లేదు’ అంటాడు. రెండోసారి ‘పేపర్ కష్టంగా వచ్చింది’ అంటాడు. మూడోసారి ‘నాకు ఈ చదువు రాదేమో’ అంటాడు. నాలుగోసారి అసలు పరీక్షకు కూర్చోవడమే మానేస్తాడు. ఇక్కడ సమస్య పరీక్షలో ఉండకపోవచ్చు.. తన సామర్థ్యంపై అతను తీసుకున్న నిర్ణయంలో ఉంటుంది.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మనకు భవిష్యత్తు తెలియకపోతే దాన్ని తెలుసుకోవాలని చాలా ఆసక్తి ఉంటుంది. అందుకే ఒకసారి వరుసగా ఎదురుదెబ్బలు తగిలితే కొందరు ‘ఇక నా పరిస్థితి ఏంటి?’ అని జ్యోతిష్యం, న్యూమరాలజీ, టారో.. ఇలా ఎన్నో మార్గాల్లో సమాధానం వెతుకుతారు. కానీ మన నిర్ణయాల బాధ్యతను పూర్తిగా ఎవరో ఒకరి మాటలకు అప్పగించడం ప్రమాదకరం. ఎందుకంటే అప్పుడు మనం ప్రయత్నం చేయకముందే ఫలితాన్ని నిర్ణయించుకుంటాం.
విజయ్ ప్రభుత్వ ఉద్యోగం కోసం రెండు సార్లు పరీక్ష రాసినా రాలేదు. ఆ సమయంలో ఎవరో ‘నీకు ప్రభుత్వ ఉద్యోగ యోగం లేదు.. నీకు దేనిలో కూడా అవకాశం రాదు’ అని చెప్పారు. ఆ మాట అతని మనసులో బలంగా నాటుకుంది. పుస్తకాలు తెరిచి చదవాల్సిన సమయంలోనే ‘నాకు ఉద్యోగం రాదట కదా..’ అని ఆలోచించడం మొదలుపెట్టాడు. పరీక్ష రాయకముందే ఓటమిని ఊహించాడు. చివరికి preparation ఆపేశాడు. ఇప్పుడు ప్రశ్న ఏమిటి? అతన్ని ఆపింది పరీక్షా వ్యవస్థా? అదృష్టమా? లేక ఒక మాటను నిజమని నమ్మిన అతని మనసా? మన జీవితంలో జరిగే విషయాలకు కారణం మనలో ఉందని భావిస్తే దాన్ని Internal Locus of Control అంటారు. ‘నా ప్రయత్నం, నా నిర్ణయాలు, నా అలవాట్లు నా ఫలితాన్ని ప్రభావితం చేస్తాయి’ అనే నమ్మకం ఇందులో ఉంటుంది. మరోవైపు ‘నా జీవితాన్ని అదృష్టం, పరిస్థితులు, ఇతరులు నిర్ణయిస్తాయి’ అని పూర్తిగా బయట కారణాలపై ఆధారపడితే External Locus of Control పెరుగుతుంది. జీవితంలో పరిస్థితుల ప్రభావం తప్పకుండా ఉంటుంది.
మనిషికి తన గురించి ఎవరో చెప్పడం ఎందుకు అంత ఆసక్తికరంగా ఉంటుంది? ఎందుకంటే మనల్ని మనం పూర్తిగా అర్థం చేసుకోవడం కష్టం. అందుకే బయట నుంచి వచ్చే వివరణ మనకు ఒక అద్దంలా అనిపిస్తుంది. ముఖ్యంగా మనం అయోమయంలో ఉన్నప్పుడు, ఆ మాటల ప్రభావం మరింత పెరుగుతుంది. ‘నువ్వు చేయలేవు’ అని ఎవరో ఒకరు చెప్పినప్పుడు మనలో ముందే ఉన్న భయం దానికి బలం ఇస్తుంది. ‘నువ్వు చేయగలవు’ అని సరైన సమయంలో ఎవరైనా చెప్పినా అదే మనసుకు కొత్త శక్తిని ఇవ్వగలదు.
ఒక పరీక్షలో మార్కులు తగ్గితే.. ‘నేను పనికిరాను’ అనడం కాదు. ‘నా preparation strategy పనిచేయలేదు’ అనాలి. ఒక ఇంటర్వ్యూలో ఉద్యోగం రాకపోతే ‘నాకు ఉద్యోగయోగం లేదు’ అనడం కాదు. ‘నా communication లేదా technical preparationలో ఏం మెరుగుపరచాలి?’ అని అడగాలి. ఒక సంబంధంలో సమస్య వస్తే ‘నా జీవితమే ఇలా ఉంది’ అనడం కాదు. ‘నా communicationలో, boundariesలో, choicesలో ఏం మార్చాలి?’ అని ఆలోచించాలి. ఇక్కడే అసలు విషయం ఉంది. మన జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం మన దగ్గరే ఉంటుందని కాదు. కానీ పరిష్కారం కోసం మనం చేయగల మొదటి అడుగు మాత్రం చాలాసార్లు మన దగ్గరే ఉంటుంది. అవసరమైతే నిపుణుడి సలహా తీసుకోవాలి, కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.
జీవితంలో చిన్న తప్పులు జరుగుతూనే ఉంటాయి. కానీ చిన్న తప్పును పెద్ద తీర్పుగా మార్చుకోవద్దు. ఒక తప్పు మీ గురించి చెప్పదు. ఒక ఓటమి మీ భవిష్యత్తును నిర్ణయించదు. ఒకరి మాట మీ సామర్థ్యానికి కొలమానం కాదు. ఎందుకంటే మన జీవితంలో అత్యంత ప్రమాదకరమైన “మిస్టేక్” పరీక్షలో ఫెయిల్ అవ్వడం కాదు, ‘నేను చేయలేను’ అని ప్రయత్నించకముందే మనమే మన మీద తీర్పు చెప్పుకోవడం. అందుకే యువతకు చెప్పాల్సింది ఒక్కటే.. ‘మీ భవిష్యత్తు గురించి ఎవరో చెప్పిన మాటను నమ్మే ముందు, మీ సామర్థ్యం గురించి మీకు మీరే ఆలోచించండి’.
డా.హిప్నో పద్మా కమలాకర్
9390044031
కౌన్సెలింగ్ సైకో థెరపిస్ట్,
హిప్నో థెరపిస్ట్


