వికలాంగ ఉద్యోగుల కృతజ్ఞతా
సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వికలాంగుల కోసం సంక్షేమ భవన్ నిర్మిస్తామనీ, అందుకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మాట్లాడుతానని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. టీపీసీసీ వికలాంగుల విభాగం చైర్మెన్ ముత్తినేని వీరయ్య నేతృత్వంలో ఆదివారం హైదరాబాద్ గాంధీభవన్ లోని ప్రకాశం హాలులో వికలాంగ ఉద్యోగుల కృతజ్ఞతా సభ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వికలాంగుల పెండింగ్ సమస్యలను సీఎంతో చర్చించి పరిష్కరిస్తానని తెలిపారు. వికలాంగుల శాఖ తనకు అప్పగించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఒక మనిషి తోడుంటే తప్ప ముందుకెళ్లలేని స్థితిలో కూడా తనపై నమ్మకంతో వినతిపత్రాలు సమర్పించారనీ, వాటన్నింటిని కచ్చితంగా నెరవేరుస్తానని తెలిపారు. వికలాంగుల సంఘాలన్ని తన దగ్గరకు రావాలనీ, వారి సమస్యలు తీర్చడమే తన బాధ్యత అని తెలిపారు. వికలాంగులకు స్థానిక సంస్థల్లో, మున్సిపాల్టీల్లో కో అప్షన్ మెంబర్లుగా తీసుకు నేందుకు, ఇందిరమ్మ ఇండ్లలో రిజర్వేషన్ల కోసం క్యాబినెట్ లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.
ముత్తినేని వీరయ్య మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి వికలాంగుల పెద్దన్నగా, ఆత్మబంధువుగా వికలాంగ ఉద్యోగుల సంక్షేమంలో ముందడుగు వేశారని కొనియాడారు. జీవో నెంబర్ 34 జారీ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని తెలిపారు. దీంతో 70 శాతంపైనా వైకల్యమున్న వారికి బదిలీ ఉండదనీ, ప్రమోషన్ పొందే సమయం లో ఉన్న చోటనే లేదా దగ్గర స్థానంలో ప్రమోషన్ పొందగలుగుతారని వివరించారు. తీవ్ర వైకల్యం ఉన్నవారి తల్లితండ్రులకూ దీన్ని వర్తింపజేశారని చెప్పారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించి వికలాంగుల ఆత్మ గౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టారని ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ డిమాండ్ల కోసం ఉద్యోగులు తీవ్ర ప్రయత్నం చేసిన నిరాశే మిగిలిందని గుర్తుచేశారు. ఆ ప్రయత్నాలు ప్రజా ప్రభుత్వంలో నెరవేరాయని సంతోషం వ్యక్తం చేశారు. వికలాంగ ఉద్యోగుల కోసం వికలాంగుల కార్పొరేషన్ లో నెలలో రెండు రోజులు ప్రత్యేక గ్రీవెన్స్ లు ఏర్పాటు చేసి వారి సమస్యలను సంబంధిత అధికారులతో పరిష్కరించామని తెలిపారు. తన చివరి శ్వాస వరకు వికలాంగుల కోసం, వికలాంగుల ఉద్యోగుల కోసం పని చేస్తానని వీరయ్య ప్రకటించారు. వికలాంగుల కార్పొరేషన్ లో పని చేసే ఉద్యోగులు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి తర్వాత మళ్లీ సీఎం రేవంత్ రెడ్డి మూడు పీఆర్సీలు ఇవ్వడం, అదీ తాను చైర్మెన్ గా ఉన్న కాలంలో నెరవేరడం తన జీవితం ధన్యమైందన్నారు. వికలాంగుల సమస్యలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. వికలాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ అభిబ్ మియా, చీరబోయిన లక్ష్మయ్య మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో వికలాంగులను తీవ్ర నిర్ల౭్యం చేశారని విమర్శించారు. తమ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ గా తమకు అండగా నిలబడ్డ ముత్తినేని వీరయ్య కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వికలాంగులకు వీరయ్య ప్రతి నిత్యం అందుబాటులో ఉన్నారని తెలిపారు. త్వరలోనే సంఘానికి గుర్తింపు, బదిలీల్లో మినహాయింపు కోసం వైకల్యాన్ని 70 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలనీ, ఈహెచ్ఎస్ ప్రీమియం చెల్లింపులో మినహాయింపు, ఉన్నత విద్య అభ్యసించే వారికి ఆన్ డ్యూటీ సౌకర్యం కల్పించాలని కోరారు. వికలాంగుల బాధ్యతలు మోస్తూ, తమ సమస్యలపై అవగాహన ఉన్న విద్యవేత్త ముత్తినేని వీరయ్యకు మరోసారి వికలాంగుల చైర్మెన్ గా అవకాశం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు నుంచి అధ్యక్షులు, కార్యవర్గం సభ్యులు దాదాపు 500 మంది పాల్గొన్నారు.
వికలాంగులకు సంక్షేమ భవన్ సీఎంతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



