Tuesday, July 28, 2026
E-PAPER
Homeఎడిట్ పేజినేటి పరిస్థితులను…నాడే హెచ్చరించిన నాగిరెడ్డి

నేటి పరిస్థితులను…నాడే హెచ్చరించిన నాగిరెడ్డి

- Advertisement -

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 1947 ఆగష్టు 15వ తేదీన సుప్రసిద్ధ కమ్యూనిస్టు నాయకుడు ఏ.కె. గోపాలన్ మద్రాస్ సెంట్రల్ జైల్లో వున్నాడు. స్వాతంత్ర్యం వచ్చిన సంతోషంలో జైల్లోనే జాతీయ జెండా ఎగురవేసి తోటి ఖైదీలనుద్దేశించి ప్రసంగించాడు. కానీ, స్వతంత్రం వచ్చిన విషయం ఏ మాత్రం గుర్తించని జైలు అధికారులు “చట్టబద్ధంగా ఏర్పడిన బ్రిటిష్ చక్రవర్తి పరిపాలన”ను కూలదోసేందుకు ప్రయత్నించాడని, రాజద్రోహం నేరం అపాదించి శిక్షాస్మృతిలోని 124 ఎ కింద ఆయన్ను విచారించారు. గోపాలన్ స్వాతంత్య్రం తర్వాత కూడా జైల్లో గడపాల్సి రావటం మనచరిత్ర. అలానే తరిమెల నాగిరెడ్డిని కూడా “యుద్ధమూ-దాని ఆర్ధిక ప్రభావం” అన్న పుస్తకం ప్రచురించినందుకు 1940లో శిక్షాస్మృతిలోని 121 ఎ, 120 బి సెక్షన్‌ల కింద నేరారోపణ చేసి ఏడాది జైలుశిక్ష విధించారు. మళ్లీ అదే సెక్షన్‌ల కింద 1967లో నేరారోపణ చేసి మూ డేండ్లపాటు జైల్లో నిర్భందించారు. మధ్యలో మరో ఎనిమిదిసార్లు ఈ వలసవాద చట్టాల కిందే వివిధ సందర్భాల్లో అరెస్టు చేసారు. తరిమెల నాగిరెడ్డి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నాయకులు. అప్పుడు ముఖ్యమంత్రి రాజగోపాలాచారి. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ, కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా 1953లో కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ముఖ్యమంత్రి ప్రకాశం పంతులు కాగా ప్రతి పక్షనేతగా నాగిరెడ్డి కొనసాగాడు.

1954 చివర్లో మధ్యపాన నిషేధం బిల్లుపై ఓటింగ్‌లో అధికారపక్ష సభ్యులైన శంకరరెడ్డి, సుబ్రమణ్యేశ్వర రావులు వ్యతిరేకంగా ఓటు వేయటంతో ప్రభుత్వం ఓడిపోయి ప్రకాశం పంతులు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌ తో సమాన బలమున్న సింగిల్ లార్జెస్టు పార్టీగా వున్న కమ్యూనిస్టు పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకై ఆహ్వానించాలి. అంటే దాని నాయకుడైన తరిమెల నాగిరెడ్డిని ముఖ్యమంత్రి పదవి చేపట్టమని ఆహ్వానించాలి. కాని పచ్చి కమ్యూనిస్టు వ్యతిరేకి అయిన ఆనాటి గవర్నర్ త్రివేది ఆపని చేయలేదు. ప్రధానిగా ఉన్న నెహ్రూ కూడా దానికి సుముఖంగా లేడు.
1957 రెండవ సార్వత్రిక ఎన్నికల్లో నుండి పార్లమెంటుకి, 1962, 1967లలో శాసనసభకి ఎన్నికయ్యారు. 1962లో తిరిగి అదే పుట్లూరులో అదే అభ్యర్ధిపై పోటీ చేసి గెలిచాడు. పార్లమెంటులోనూ, ఆంధ్రప్రదేశ్ శాసన సభలోనూ పబ్లిక్ ఎకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు. ఋషివ్యాలీ, మద్రాసు లయోలా కాలేజీల్లో విద్యా భ్యాసం తర్వాత బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంకి వెళ్లారు. అనేకమంది జాతీయ నాయకులకు ఆల వాలమైన ఆ విశ్వవిద్యాలయం విద్యార్ధి యూనియన్‌కి అధ్యక్షునిగా ఎన్నికై, ఆ పదవికి ఎన్నికైన తొలి దక్షిణ భారతీయునిగా గుర్తింపు పొందాడు. విశ్వవిద్యాలయంలో చేరేనాటికి గాంధీవాదిగా వున్న నాగిరెడ్డి విద్య పూర్తయ్యే నాటికి కమ్యూనిస్టుగా మారాడు. శ్రీకాకుళం గిరిజనులపై భూస్వాములు, ప్రభుత్వ తాబేదార్లు చేస్తున్న దోపిడీని, దౌర్జన్యాల్ని భరించలేక పోయాడు. శాసనసభ్యుడిగా వుండి ఏ మాత్రం వాళ్లకి సహాయపడలేదని తన అశక్తతని నిందించుకుని, శాసనసభ సభ్యాత్వానికి రాజీనామా చేశాడు. 1969 మార్చిలో రాజీనామా చేసి “ప్రజల్ని విప్లవ కార్యాచరణకు కదిలించటమే తన కర్తవ్యంగా” ప్రకటించాడు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో కృష్ణా జిల్లా అట్ల ప్రగడలో తన సహచరులతో సమావేశమై ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకున్నందుకు అక్టోబరులో మద్రాసులో అరెస్టుచేసి “కుట్రకేసు” బనాయించారు. “నాగిరెడ్డి కుట్రకేసు”గా ప్రఖ్యాతిగాంచిన ఈ కేసు ‘స్వతంత్ర భారతదేశం’లో పెట్టడిన తొలి కుట్రకేసు. సుదీర్ఘ విచారణ అనంతరం మూడేండ్ల జైలు శిక్ష విధించబడింది.

ఈ కేసు సందర్భంగా కోర్టులో ఇచ్చిన ప్రకటనే “తాకట్టులో భారతదేశం” అనే ప్రసిద్ధ గ్రంథంగా ప్రాచుర్యంలోకొచ్చింది. ప్రపంచీకరణ, ప్రయివేటీకరణల నేపథ్యంలో జరుగుతున్న సామ్రాజ్యవాద నయావలస దోపిడీ గురించి ఈనాడు చాలామంది మేధావులు మాట్లాడుతున్నారు. వేలసంఖ్యలో వ్యాసాలు రాస్తున్నారు. పుస్తకాలూ వస్తున్నాయి. కాని దోపిడీ గురించి, సంపద తరలింపు గురించి, ప్రపంచ బ్యాంకు-దాని స్వరూప స్వభావాల గురించి అయిదు దశాబ్దాల పూర్వమే నాగిరెడ్డి తన ప్రకటనలో విపులీకరించి ప్రజల్ని హెచ్చ రించారు. ఆనాడు దాన్ని “కమ్యూనిస్టుల గోల”గా భావించిన అనేకమంది ఆర్థిక నిపుణులు దానిలో అక్షరం సత్యంగా ఇప్పుడు నిర్ధారిస్తున్నారు. దేశ, రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్రవేసిన నాగిరెడ్డి ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతవాసం చేస్తూ 1976 జూలై 28న ఉస్మానియా ఆస్పత్రిలో కన్నుమూశాడు.
(నేడు తరిమెల నాగిరెడ్డి 50వ వర్ధంతి)
చెరుకూరి సత్యనారాయణ, 9848664587

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -