Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం

- Advertisement -

నిర్ణీత గడువులోగా రీ-సర్వే పూర్తి చేయాలి
గ్రామసభల ద్వారా ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలి
జిల్లాల కలెక్టర్లు అత్యంత ప్రాధాన్య‌తనివ్వాలి : అధికారుల‌కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు ప్రతి భూమికీ స్పష్టమైన హద్దులు, ప్రతి సర్వే నెంబర్‌కు భూదార్ గుర్తింపు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌‌ సచివాలయంలోని త‌న కార్యాల‌యంలో రీ-సర్వే జరుగుతున్న గ్రామాల్లో పురోగతి, ప్రజల స్పందన, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై రెవెన్యూ, స‌ర్వే అధికారులతో మంత్రి స‌మీక్షించారు.
ఈ సంద‌ర్భంగా పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో జిల్లాకు 70 గ్రామాల చొప్పున ఎంపిక చేసిన 2,240 గ్రామాల్లో రీ-సర్వే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈ రీస‌ర్వేపై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహించాలనీ, రీ-సర్వే వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు, భూ యజమానులకు వివరించాలని అధికారులకు సూచించారు. ప్రజల సహకారంతోనే ఈ కార్యక్రమం విజయవంత మవుతుందని అన్నారు. రీ-సర్వే జరుగుతున్న ప్రతి గ్రామంలో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలనీ, ప్రజలు వ్యక్తం చేసే సందేహాలను వెంటనే నివృత్తి చేయాలని ఆదేశించారు. భూముల హద్దుల నిర్ధారణలో పారదర్శకత పాటిస్తూ ప్రతి దశలో ప్రజలను భాగ‌స్వాములుగా చేయాల‌ని సూచించారు.

రీ-సర్వే పనులను జిల్లాల కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలనీ, వారానికోసారి పురోగతిని సమీక్షించాలని మంత్రి ఆదేశించారు. రెవెన్యూ, సర్వే శాఖ అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేసి నిర్ణీత లక్ష్యాలను సాధించాలని చెప్పారు. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. భూమి రైతుకు కేవలం ఆస్తి మాత్రమే కాదనీ, అది కుటుంబ జీవనాధారమని వివరించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకే ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ-సర్వే చేపట్టిందన్నారు. డీజీపీఎస్, రోవర్స్, జీఐఎస్ వంటి ఆధునిక సాంకేతికతతో శాస్త్రీయ పద్ధతిలో సర్వే నిర్వహించడం వల్ల ప్రతి కమతానికి ఖచ్చితమైన హద్దులు నిర్ణయించబడతాయని చెప్పారు.
రీ-సర్వే పూర్తయిన అనంతరం ప్రతి సర్వే నెంబర్‌కూ ప్రత్యేక భూదార్ నెంబర్ కేటాయించి, భూ భారతి పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా భూముల యాజమాన్యంపై శాశ్వత స్పష్టత ఏర్పడుతుందని మంత్రి అన్నారు. దీనివల్ల భూ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు మరింత పారదర్శకంగా, వేగవంతంగా జరుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని అధికారులు కేవలం ప్రభుత్వ విధిగా కాకుండా ప్రజల జీవితాలను ప్రభావితం చేసే కీలక బాధ్యతగా భావించి అంకితభావంతో పనిచేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రీ-సర్వేను విజయవంతంగా పూర్తి చేసి, భూ వివాదాల్లేని తెలంగాణ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. న‌క్షా లేని 373 గ్రామాల్లో కూడా రీస‌ర్వే చురుకుగా సాగుతోంద‌నీ, వీలైనంత త్వ‌రగా స‌ర్వేను పూర్తి చేయాల‌ని అధికారుల‌కు సూచించారు. ఆయా గ్రామాల్లో అధికారులు స‌ర్వేకు వెళ్లిన‌ప్పుడు ముందుగానే ప‌ట్టాదారుల‌కు విధిగా నోటీసులు ఇవ్వాల‌నీ, ఆ గ్రామంలో ప్ర‌భుత్వ భూముల‌కు మార్కింగ్ చేయాల‌ని గ్రామ‌కంఠం హ‌ద్దుల‌ను నిర్ణ‌యించిన త‌ర్వాతే స‌ర్వే చేప‌ట్టాల‌ని కోరారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారు సంతృప్తి చేందేలా స‌ర్వే చేప‌ట్టాల‌నీ, ఏది చేసినా ప్ర‌జా కోణంలోనే చేయాల‌ని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -