Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంప్రభుత్వాస్పత్రుల్లో నేత్ర వైద్య సేవలు

ప్రభుత్వాస్పత్రుల్లో నేత్ర వైద్య సేవలు

- Advertisement -

ఎల్వీప్రసాద్‌ ఆస్పత్రితో భాగస్వామ్యం : మంత్రి దామోదర్‌ రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ప్రజలకు నాణ్యమైన కంటి వైద్య సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్‌ ‌రాజనర్సింహ తెలిపారు. రాష్ట్రంలోని 35 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నేత్ర వైద్య విభాగాలు ప్రజలకు ప్రత్యేక వైద్య సేవలను అందిస్తున్నాయన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో కంటి పరీక్షలు, ఆప్టోమెట్రీ సేవలు, శుక్లాల (క్యాటరాక్ట్) శస్త్రచికిత్సలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో నేత్ర వైద్య సేవల బలోపేతానికి ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌ భాగస్వామ్యంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో అమలు చేస్తున్న నవజాత శిశువుల కంటి పరీక్షల పైలట్ కార్యక్రమాన్ని దశలవారీగా ఇతర జిల్లాలకు విస్తరించడంపై హైదరాబాద్‌‌లో మంగళవారం చర్చించారు. ఈ సందర్భంగా ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ అందిస్తున్న సేవలను మంత్రి అభినందించారు. హైదరాబాద్‌లోని సరోజిని దేవి కంటి ఆస్పత్రి రాష్ట్రంలో నేత్ర వైద్యానికి అత్యున్నత కేంద్రంగా సేవలందిస్తోందన్నారు. రెటీనా శస్త్రచికిత్సలు, లేజర్ చికిత్సలు, మెల్లకన్ను (స్క్వింట్) శస్త్రచికిత్సలు, కార్నియా మార్పిడి, కంటి క్యాన్సర్‌కు సంబంధించిన చికిత్సలు, ప్లాస్టిక్ సర్జరీలు, గ్లాకోమా చికిత్సలు వంటి అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. కార్నియా దానాలను ప్రోత్సహించేందుకు ప్రాంతీయ కార్నియా సేకరణ కేంద్రాలు (ఐ బ్యాంకులు) ఏర్పాటు చేసే అంశాన్ని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి పరిశీలిస్తున్నామన్నారు. ఆర్‌బీఎస్‌కే సిబ్బందికి శిక్షణ అందించడం ద్వారా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన కంటి పరీక్షలు, ఆప్టోమెట్రీ సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బోధనాస్పత్రులు, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ మధ్య భాగస్వామ్య అవకాశాలను గుర్తించేందుకు ఆగస్టు నెలలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా జెడ్ చొంగ్తు, ‌డీఎమ్‌ఈ డాక్టర్ నరేంద్ర కుమార్, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ డా రవీందర్ నాయక్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -