Wednesday, July 29, 2026
E-PAPER
Homeతాజా వార్తలురాష్ట్రం మెడపై ఉపాధి కత్తి

రాష్ట్రం మెడపై ఉపాధి కత్తి

- Advertisement -

గుదిబండగా మారిన వీబీ గ్రామ్‌ జీ కొత్త చట్టం
60:40 శాతం వాటాతో రూ.1,500 కోట్లకు పైగా అదనపు భారం
వర్క్ హాలీడేతో పట్టణాలకు 
పెరగనున్న గ్రామీణ వలసలు
పరిమితులను మించిన 
ఏ వ్యయమైనా రాష్ట్రమే భరించాలి
అటకెక్కిన రాష్ట్ర ప్రభుత్వం 
కొత్త చట్టం ప్రతిపాదన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

 మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్ఈజీఎస్) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ గ్రామ్ జీ చట్టం తెలంగాణకు గుదిబండగా మారనుంది. ఏటా దాదాపు రూ.1,500 కోట్ల వరకు అదనపు భారాన్ని మోపనుంది. గతంలో ఉన్న 90:10 శాతం ఆర్థిక వాటాను 60:40 శాతానికి తగ్గించడం, డిమాండ్ ఆధారంగా కాకుండా నార్మేటివ్ విధానంలో పనిదినాల కేటాయింపు వల్ల రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. అలాగే వ్యవసాయ సీజన్‌లో 60 రోజులపాటు పనులు నిలిపి వేయాలనే నిర్ణయంతో పట్టణాలకు గ్రామీణ కూలీల వలస మరింత పెరిగే అవకాశం ఉంది.

​గ్రామీణ పేదల జీవనోపాధికి వెన్నెముకగా నిలిచిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ రాష్ట్రాల అధికారాలను కేంద్రం హరిస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఉపాధి హామీ చట్ట సవరణ మాత్రమే కాదనీ, భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిపైనే జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను క్రమంగా తగ్గించి, గ్రామీణాభివృద్ధిపై రాష్ట్రాల పాత్రను నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వ్యవసాయ సీజన్‌లో ఉపాధి పనులకు విరామం ఇవ్వాలనే నిబంధన గ్రామీణ పేదలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆదివాసీ, కొండ ప్రాంతాల్లో పంటల సీజన్ 60 రోజుల పాటు కొనసాగదు. ఆ ప్రాంతాల్లో ఈ నిబంధన అమలు చేయడం ఆచరణ సాధ్యం కాకపోవచ్చిని భావిస్తున్నారు. పనులు ప్రారంభమైన తర్వాత మధ్యలో విరామం ఇవ్వడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. పంటల సీజన్‌లోనే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో వనమహోత్సవం, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తోంది. రెండు నెలల వర్క్‌ ‌హలిడే వల్ల గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలకు వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది దీర్ఘ కాలంలో రాష్ర్టాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వీబీ గ్రామ్‌ ‌జీ చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం ప్రకటించినప్పటికి ఇప్పటి వరకు దానిపై ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ ప్రతిపాదనను పట్టాలెక్కిస్తే కేంద్రం రాష్ర్టానికి నయా పైసా ఇవ్వదు. ఫలితంగా ఏటా రూ.5 వేల కోట్ల వరకు రాష్ర్టం భరించాల్సి ఉంటుంది. దాంతో సర్కార్‌ ‌వెనకడుగు వేసిందని తెలుస్తోంది.

​​నార్మెటివ్ విధానంలో .…
వీబీ గ్రామ్ జీ పథకంలో డిమాండ్ ఆధారితంగా కాకుండా సమగ్ర ఆర్థిక విధానంలో నిధులను, పని దినాలను కేటాయిస్తారు. రాష్ట్రాలు నిధులను గ్రామ పంచాయతీలకు, జిల్లాలకు పారదర్శకంగా పంపిణీ చేసేలా చూడాలి. ఒకవేళ ఏదైనా రాష్ట్రం తన నిర్దేశిత కేటాయింపుకు మించి ఖర్చు చేస్తే, ఆ అదనపు వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. రాష్ట్రాల వారీ కేటాయింపులు 16వ ఆర్థిక సంఘం యొక్క వికేంద్రీకరణ సూత్రం ఆధారంగా లెక్కిస్తారు. తలసరి జీఎస్‌‌డీపీ, జనాభా, భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా నిర్దారిస్తారు. ఈ విధానం నిధులను సమానంగా పంపిణీ చేయడం, ఆర్థికంగా వెనుకబడిన రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేందుకు ఉద్దేశించిందని కేంద్రం అంటోంది. కొత్త విధానాల వల్ల నష్టపోతామని దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్రాలపై ఆర్థిక భారం
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో కార్మికుల వేతన భారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ వీబీ- గ్రామ్‌ జీ పథకం కేంద్ర ప్రాయోజిత పథకంగా మారింది. ఇందులో కేంద్రం-రాష్ట్రాల మధ్య వ్యయభారం 60:40 నిష్పత్తిలో ఉంది. మోడీ సర్కారు తీసుకొచ్చిన ఈ మార్పుతో రాష్ట్రాలపై ఆర్థిక భారం పడనుంది.
పాత విధానంలో ఉపాధి హామీకి కేంద్రం 90 శాతం వరకు నిధులు సమకూర్చేది. కానీ కొత్త చట్టం ప్రకారం కేంద్రం 60 శాతం మాత్రమే ఇస్తుంది. మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. 2022-23 ఆర్ధిక సంవత్సరం నుంచి తెలంగాణలో ఏటా దాదాపు రూ.4,500 కోట్ల వరకు పనులు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. పాత లెక్కల ప్రకారం చూస్తే ఏటా దాదాపు రూ.500 కోట్ల వరకు మాత్రమే రాష్ర్ట ప్రభుత్వం చెల్లించింది. కాని కొత్త చట్టం వల్ల ఏటా సుమారు రూ. 1,500 కోట్ల నుంచి రూ.2 వేల కోట్ల వరకు ఆదనపు భారం పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త పథకం అమలు రాష్ట్రంలో ఎలా సాగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది.
పాత చట్టంలో 260కి పైగా పనులకు అవకాశం ఉండగా, కొత్త చట్టంలో భూ అభివృద్ధి (ల్యాండ్ డెవలప్‌మెంట్) వంటి శ్రమతో కూడిన పనులను తొలగించారు. దీనివల్ల సన్న, చిన్నకారు రైతులు, దళితులు, గిరిజనులు తీవ్రంగా నష్టపోతారు. వీబీ గ్రామ్ జీ పథకం కింద అయ్యే ఖర్చులన్నింటినీ అధికారిక మేనేజ్ మెంట్ ఇన్పర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్ ) ద్వారా కచ్చితంగా నమోదు చేయాలి. ఇది కూడా రాష్ట్రాలకు ఇబ్బందిగా మారనుంది.

2021-22 నుంచి ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల కేటాయింపులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -