ఉపాధ్యాయుల పనితీరుపై కలెక్టర్ క్ష్రేతస్థాయి పరిశీలన
జెడ్పీ బాలుర పాఠశాలలో ఆకస్మిక తనిఖీ
ఉపాధ్యాయులు వృత్తి విలువలు పాటించాలి:
సిద్దిపేట కలెక్టర్ హైమావతి
నవతెలంగాణ-సిద్దిపేట
టీచర్ డైరీ రాయకుండా డ్యూటీ చేస్తున్నారా? ఉపాధ్యాయుల విధుల్లో అశ్రద్ధ అంటే.. విద్యార్థుల విద్య, భద్రత, పాఠశాల నిర్వహణను దెబ్బతీయడమే అవుతుందని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలను మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయుల పని తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉపాధ్యాయులు పాఠాలు సక్రమంగా బోధిస్తున్నారా అని తరగతి గదిలోకి వెళ్ళి విద్యార్థులతో మాట్లాడి ఆరా తీశారు. అటెండెన్స్ రిజిస్టర్ వెరిఫై చేస్తూ రిజిస్టర్లో సంతకం చేయకుండా మధ్యాహ్న సమయంలో పలువురు ఉపాధ్యాయులు ఇంటికి వెళ్ళడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. రోజూ ఇలాగే చేస్తున్నారా అంటూ ప్రిన్సిపల్‌తో ఆరా తీశారు. ప్రిన్సిపల్‌కు ఉపాధ్యాయులు, మిగతా సిబ్బంది వినకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందని గ్రహించిన కలెక్టర్ డీఈవో రమేష్‌కి ఫోన్ చేసి మాట్లాడారు. పాఠశాలపై, ఉపాద్యాయుల పనితీరు, విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాల గురించి విచారణ జరపాలని ఆదేశించారు. డీఈవో సూచన మేరకు పాఠశాలకు వెళ్లిన సెక్టోరియల్ అధికారి రామస్వామితో.. విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యాంశ బోధనా, ఉపాద్యాయుల పని తీరు, టీచర్ డైరీ, లెస్సన్ ప్లాన్ ప్రతిదీ ఇంకో ఇద్దరు అధికారులను పిలుచుకుని పూర్తి విచారణ జరిపి సాయంత్రంలోగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాద్యాయులు తమ వృత్తి విలువలు, వృత్తి ధర్మాన్ని కాపాడాలన్నారు. ఉపాధ్యాయుల విధుల్లో అశ్రద్ధ అంటే, విద్యార్థుల విద్య, భద్రత, పాఠశాల నిర్వహణను దెబ్బతీయడమే అవుతుందన్నారు. అలాగే తమ అధికారిక బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం అవుతుందన్నారు. సమయ పాలన పాటించి, క్రమం తప్పకుండా పాఠాలు బోధించాలన్నారు. పాఠాలను నాణ్యంగా బోధించి విద్యార్థుల్లో జ్ఞానం, నైపుణ్యాలు, మంచి విలువలను పెంపొందించాలని సూచించారు. విద్యార్థులకు ఆదర్శప్రాయమైన ప్రవర్తనను చూపాలనీ, విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి ప్రోత్సాహం ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యంతో సమన్వయంగా పనిచేయాలని కోరారు. నిరంతరం కొత్త బోధనా పద్ధతులు నేర్చుకుంటూ తన వృత్తి నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టీచర్ డైరీ రాయకుండా డ్యూటీ చేస్తున్నారా?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



