Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభూపోరాట ఫలితమే ఇందిరమ్మ ఇండ్లు

భూపోరాట ఫలితమే ఇందిరమ్మ ఇండ్లు

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు 
నున్నా నాగేశ్వరరావు
ముదిగొండ అమరవీరుల 19వ వర్ధంతి సభ
నవతెలంగాణ-ముదిగొండ

రాష్ట్రంలో చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ముదిగొండ భూపోరాటం ఫలితమేనని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నున్నా నాగేశ్వరరావు అన్నారు. ముదిగొండ భూ పోరాట అమరవీరుల 19వ వర్ధంతి సభ, ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని ముదిగొండ అమరవీరుల స్థూపం వద్ద సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం అధ్యక్షతన మంగళవారం జరిగింది. ముందుగా అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛాలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో నున్నా మాట్లాడుతూ.. 2007 జులై 28న ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భూపోరాటాలు, కూలి పోరాటాలు, ఇండ్ల స్థలాల సాధనకై జరుగుతున్న దశలవారీ ఆందోళనలో భాగంగా ముదిగొండలోనూ నిరసనలు చేపట్టినట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అప్పటి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి ప్రజలపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపి ఏడుగురు నిండి ప్రాణాలు బలి తీసుకున్నదని, 18 మంది గాయాలపాలయినట్టు గుర్తుచేశారు. ఈ పోరాట ఫలితంగానే ఇందిరమ్మ పేరుతో, పేద ప్రజలకు ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారన్నారు. 12 సంవత్సరాలుగా దేశంలో నియంత పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వంపై ప్రజల తిరుగుబాటు మొదలైందని, దానికి ప్రతిఫలంగా దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో ఆందోళన జరిగిందన్నారు. విద్యార్థుల ఉద్యమం ఫలితమే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని తెలిపారు. దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగం, మత రాజకీయాలపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు. అభివృద్ధి లేనిచోట, మత విశ్వాసాలతో ప్రజలను అంధకారంలో నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్బంధం ఉన్న చోట ప్రతిఘటన ద్వారా, విద్యుత్ చార్జీల పెంపు ప్రభుత్వం నిలిపి వేసిందన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రజా ఉద్యమాలే ప్రధానమన్నారు. ప్రజా సమస్యలు ఎక్కడున్నా, ఎర్రజెండా అక్కడ నిలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు బండి రమేష్, సీనియర్‌ ‌నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -