Wednesday, July 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబలమైన శ్రామిక వర్గ పోరాటాలు నిర్మించాలి

బలమైన శ్రామిక వర్గ పోరాటాలు నిర్మించాలి

- Advertisement -

ప్రజాస్వామ్యం, లౌకిక వ్వవస్థను ధ్వంసం చేసే కుట్ర
ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్న కేంద్రం
పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చుతున్న రాష్ట్ర సర్కార్‌ : 
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు
చేర్యాలలో ఏసిరెడ్డి నర్సింహారెడ్డి
 వర్ధంతి సభ ఏసిరెడ్డి పాటల సీడీ ఆవిష్కరణ
నవతెలంగాణ-చేర్యాల

ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రభుత్వాలపై బలమైన శ్రామిక వర్గ పోరాటాలను నిర్మించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని వాసవి గార్డెన్‌లో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఏసిరెడ్డి నర్సింహారెడ్డి 35వ వర్ధంతి సభను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి అధ్యక్షతన మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సభకు హాజరైన చుక్క రాములు మాట్లాడుతూ.. నాడు భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన నిరాడంబరజీవి, త్యాగధనుడు, ఆదర్శ కమ్యూనిస్టు, మాజీ ఎమ్మెల్యే ఏసిరెడ్డి నరసింహారెడ్డి అని కొనియాడారు. ఏసిరెడ్డి నర్సింహారెడ్డి పీడిత ప్రజల విముక్తి కోసం, నైజాం రజాకార్ సైన్యాలను, భూస్వాములను ఎదిరించి పోరాడిన వీరుడన్నారు. ఆ పోరాటంలో తుపాకీ తూటాలకు గురైనా వెనుదిరిగి చూడకుండా ఉద్యమ కెరటంలా ముందుకు సాగాడని గుర్తు చేశారు. ఏసిరెడ్డి ఆశయ సాధన కోసం బలమైన శ్రామిక వర్గ ప్రజా ఉద్యమాలు నిర్మించాలని.. అవే ఆయనకు ఘన నివాళ్లు అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలపై దాడులు చేస్తూ కార్మికులు, ప్రజల హక్కులను హరించి వేస్తుందన్నారు. కార్మిక చట్టాలను రద్దుచేసి, కార్మికులు శ్రమ దోపిడీకి గురయ్యే విధంగా లేబర్ కోడ్లను రూపొందించారని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని పేదలకు దూరం చేసేలా చట్టాన్ని మార్చారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే విధంగా విధానాలు చేపడుతూ పేదలపై భారాల మోపుతున్నార‌ని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి పేదలపై భారాలు వేస్తున్నారన్నారు. కుల, మతం, ప్రాంతం పేరుతో ప్రజలను విభజించి అనైక్యతను సృష్టిస్తున్నారన్నారు. దేశ ఐక్యతకు విఘాతం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థను ధ్వంసం చేస్తూ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారన్నారు. నిరుద్యోగం, పేదరికం రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత భవిష్యత్‌ అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కేంద్రం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే కారణమన్నారు. పాలకులు పెట్టుబడుదారులు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఉద్యమం యువత ఆగ్రహాన్ని చూస్తే కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్ధత అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తూ మాటల గారడి చేస్తుంది తప్ప ప్రజలకు ఓరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
పేదలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వకుండా పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేసి నిలువ నీడ లేకుండా చేస్తున్నారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గ్రామ గ్రామాన ఏసిరెడ్డి నర్సింహారెడ్డి స్ఫూర్తితో ఆనాటి పోరాట ఫలాలు పేదలకు దక్కే విధంగా బలమైన ప్రజా పోరాటాలు నిర్మించాలన్నారు. అనంతరం చేర్యాల రూరల్, చేర్యాల పట్టణం, కొమరవెల్లి, మద్దూరు, దూల్మిట్ట మండలాల పార్టీ సభ్యుల రాజకీయ శిక్షణా తరగతులు జరిగాయి. భారత కమ్యూనిస్టు ఉద్యమ విశిష్టత పాఠ్యాంశాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు బండారు రమేష్ బోధించారు.
ఈ సభలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాముని గోపాల స్వామి, రాళ్ళబండి శశిధర్, శెట్టిపల్లి సత్తిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు కొంగరి వెంకట మావో, ఆలేటి యాదగిరి, బండ కింది అరుణ్ కుమార్, తాడూరి రవీందర్, అత్తిని శారద, చొప్పరి రవికుమార్, జాలిగపు శిరీష, బద్దిపడగ కృష్ణారెడ్డి, చేర్యాల పట్టణ కార్యదర్శి రాళ్ల బండి నాగరాజు, మద్దూరు, దూలిమిట్ట మండలాల పార్టీ కార్యదర్సులు ఎండి. షఫీ, పోతిరెడ్డి రాజు, చుంచనకోట సర్పంచ్ గొర్రె శ్రీనివాస్, చేర్యాల మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఇబ్రహీం, ఇప్పకాయల శోభ, నక్కల లావణ్య, పోలోజు శ్రీహరి, ఆముదాల రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -