ఫొటోలు మార్ఫింగ్ చేసి రూ.6.70 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
బాధితురాలికి పోలీసుల అండ
ఖాతాల్లోని రూ.3.20 లక్షలు
హోల్డ్ చేయించిన వైనం
నవతెలంగాణ- బూర్గంపాడు
సులభంగా రుణం ఇప్పిస్తామంటూ నమ్మించి, వ్యక్తిగత వివరాలు సేకరించి ఓ మహిళ నుంచి లక్షలాది రూపాయలు కాజేసిన సైబర్ మోసం మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాబు మండల పరిధిలోని గౌతాపురం కాలనీకి చెందిన ఓ మహిళకు ఇటీవల గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది. తక్కువ వడ్డీకే లోన్ ఇప్పిస్తామని నమ్మబలికిన సైబర్ నేరగాళ్లు, ఆమె నుంచి ఆధార్, పాన్ కార్డుతో పాటు ఇతర వ్యక్తిగత వివరాలను సేకరించారు. ఆ తర్వాత అసలు స్కెచ్ అమలు చేశారు. సేకరించిన సమాచారంతో సదరు మహిళ ఫొటోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, వాట్సాప్‌లో ఆమెకే పంపారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ఈ మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. సైబర్ నేరగాళ్ల బెదిరింపులతో తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు, సమాజంలో పరువు పోతుందనే భయంతో విడుతల వారీగా మొత్తం రూ.6.70 లక్షలు వాళ్ల ఖాతాల్లోకి వేసింది. బాధితురాలి వద్ద ఇంకా డబ్బులు లాగేందుకు నేరగాళ్లు ఒత్తిడి పెంచడంతో, ఇక తట్టుకోలేక ఆమె బూర్గంపాడు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదుతో వెంటనే స్పందించిన బూర్గంపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సైబర్ క్రైమ్ విభాగం సహాయంతో నేరగాళ్ల బ్యాంక్ ఖాతాల సమాచారాన్ని సేకరించి, ట్రాన్సాక్షన్లను తక్షణమే నిలిపివేశారు. దీంతో సైబర్ మోసగాళ్ల ఖాతాల్లోకి వెళ్లిన మొత్తం సొమ్ములో రూ.3.20 లక్షలను హోల్డ్ చేయించడంలో పోలీసులు సఫలమయ్యారు. నిందితుల ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేశామని, త్వరలోనే నేరగాళ్లను అరెస్టు చేస్తామని ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. తక్కువ వడ్డీకి రుణాలంటూ అపరిచితులు చేసే ఫోన్ కాల్స్, మెసేజ్‌లను అస్సలు నమ్మవద్దని, మీ ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, ఓటీపీలను ఎవరితోనూ పంచుకోవద్దని ఎస్ఐ చెప్పారు. ఒకవేళ ఆన్లైన్ మోసాలు, ఫొటో మార్ఫింగ్ లేదా సైబర్ బెదిరింపులకు గురైతే భయపడకుండా వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌ను గానీ, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా www.cybercrime. gov.in వైబ్‌సైట్ ద్వారా కంప్లైంట్ నమోదు చేయాలని ఎస్ఐ తెలిపారు.
లోన్ ఆశ చూపి లూటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


