నవతెలంగాణ – మిడ్జిల్
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని సర్పంచ్ రాజు నాయక్ అన్నారు. బుధవారం మండలంలోని పెద్దగుండ్ల తండా గ్రామ పంచాయతీ పరిధిలోని మర్లబాయి తండాలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ శ్రీను నాయక్ తో కలిసి మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నాటిన ప్రతి మొక్కను పెంచే బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పారు. చెట్లును పెంచడం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించి, భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న హరితహారం లక్ష్యాలను విజయవంతం చేయడంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు.
ఉప సర్పంచ్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని పెంచే బాధ్యత కూడా తీసుకోవాలని చెప్పారు. గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు గ్రామ పంచాయతీ తరఫున నిరంతరం చర్యలు చేపడుతున్నామని, ప్రతి ఇంటి ఆవరణలో, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి పచ్చని వాతావరణాన్ని నెలకొల్పాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో యువత, మహిళలు, విద్యార్థులు చురుకుగా పాల్గొనాలని కోరారు. అనంతరం సర్పంచ్ రాజు నాయక్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి శైలజ, అంగన్వాడి టీచర్ మాధవి, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.



