Wednesday, July 29, 2026
E-PAPER
Homeఖమ్మంప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

ప్రభుత్వ నర్సింగ్ కళాశాలల్లోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

- Advertisement -

– ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి 
– నర్సింగ్ కళాశాలలో ఐద్వా బృందం సర్వే
నవతెలంగాణ-సత్తుపల్లి

సత్తుపల్లిలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో నెలకొని ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి తన్నీరు కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ​ఐద్వా నాయకురాళ్ల బృందం నర్సింగ్ కళాశాలలోని మౌలిక వసతులు, స్థితిగతులపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. అనంతరం ప్రిన్సిపాల్ కేవీ జోత్స్నను కలిసి విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆమెతో  చర్చించారు. ఈ సందర్భంగా భారతి,  కృష్ణవేణి మాట్లాడుతూ… కళాశాల అభివృద్ధికి ప్రభుత్వం అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరారు.

​ప్రస్తుతం కళాశాలలో మూడు బ్యాచ్‌లు కొనసాగుతుండగా, హాస్టల్‌లో 120 మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారన్నారు. అయితే హాస్టల్ నిర్వహణకు సరిపడా సిబ్బంది లేకపోవడంతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సులభతర నిర్వహణ కోసం కనీసం 16 నుంచి 20 మంది సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందన్నారు. ​అలాగే కళాశాలలో ఇద్దరు మాత్రమే రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉండటం విచారకరమని, నాణ్యమైన విద్యనందించేందుకు 16 మంది లెక్చరర్లను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెం. 8ను పూర్తిస్థాయిలో అమలు చేసి ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేయాలన్నారు. 

​హాస్టల్‌కు శాశ్వత వార్డెన్‌ను నియమించడంతో పాటు తెలంగాణ స్టేట్ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్  డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఎంఎస్ఐడీసీ) ద్వారా ల్యాబ్ పరికరాలు, ఫర్నిచర్, విద్యా సామగ్రి, మ్యాట్రెస్‌లను సమకూర్చాలని కోరారు. పరిశుభ్రత లోపించి పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉన్నందున నలుగురు పారిశుద్ధ్య కార్మికులను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. 

​విద్యార్థినుల రాకపోకల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని, నిర్మాణం పూర్తయిన నర్సింగ్ కళాశాల నూతన భవనాన్ని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ సర్వే కార్యక్రమంలో ఐద్వా సత్తుపల్లి, పెనుబల్లి మండలాల అధ్యక్షులు జాజిరి జ్యోతి, మిట్టపల్లి నాగమణి, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -