నవతెలంగాణ-టేకుమట్ల
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించాలని సీఐ వై సతీష్ సూచించారు. మంగళవారం టేకుమట్ల పోలీస్ స్టేషన్ ఎస్సై అమూల్య ఆధ్వర్యంలో మండలంలోని సర్పంచులు, ప్రజలు, గణేష్ మండపాల నిర్వాహకులతో ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గణేష్ మండపాల ఏర్పాటు, నిర్వహణతో పాటు ఉత్సవాల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై నిర్వాహకులకు అవగాహన కల్పించారు.
గణేష్ మండపాలను ఏర్పాటు చేసుకునే ముందు సంబంధిత అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు. మండపాల వల్ల ప్రజల రాకపోకలకు, ట్రాఫిక్‌కు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్ కనెక్షన్లు, వైరింగ్, మండపాల నిర్మాణంలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. లౌడ్స్పీకర్లు, డీజేలు, ఇతర సౌండ్ సిస్టమ్‌లను నిర్దేశిత నిబంధనలు, సమయ పరిమితులకు లోబడి మాత్రమే వినియోగించాలని తెలిపారు. మండపాల వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వాహకులు బాధ్యత వహించాలని, ఎలాంటి వివాదాస్పద, రెచ్చగొట్టే లేదా చట్టవిరుద్ధ కార్యక్రమాలకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. పోలీస్ అధికారులకు సహకరించాలని కోరారు.



