– రాత్రికి రాత్రే మరమ్మతులు పూర్తి చేసిన సిబ్బంది
– పర్యవేక్షించిన డీఈ, ఏడీఈ లు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గురువారం సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో బలంగా వీచిన ఈదురు గాలులకు అశ్వారావుపేట 132/33 కెవి సబ్ స్టేషన్ నుంచి వినాయకపురం, నారాయణపురం, గంగారం 33/11 కెవి సబ్ స్టేషన్లకు వెళ్లే 33 కెవి వినాయకపురం లైన్ పై వినాయకపురం అడవి ప్రాంతంలో భారీ చెట్లు కూలిపోయాయి. దీంతో పలుచోట్ల 33 కెవి విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఈ ఘటన కారణంగా మూడు సబ్ స్టేషన్ల పరిధిలోని సుమారు 45 గ్రామాలకు విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది.
విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ డివిజనల్ ఇంజినీర్ పి. నందయ్య, అశ్వారావుపేట ఏడీఈ బి. వెంకటరత్నం, వినాయకపురం సెక్షన్ ఏఈ కె. విజయకృష్ణ, అశ్వారావుపేట ఏఈ కె. వెంకటేశ్వర్లు ఇతర సిబ్బంది వెంటనే స్పందించారు. ఎమర్జెన్సీ బ్రేక్డౌన్ టీం సహాయంతో అడవిలో పడిపోయిన చెట్లను తొలగించి విరిగిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరణ చేసారు. చీకటిని కూడా లెక్కచేయకుండా రాత్రికి రాత్రే విరిగిన పోల్స్,తెగిపోయిన లైన్లను సరిచేసి 45 గ్రామాలకు తిరిగి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. విద్యుత్ శాఖ అధికారులు చూపిన తక్షణ స్పందనను గండ్లగూడెం,వినాయకపురం సర్పంచ్ లు మాలోత్ ఆలీ బాబు,కొవ్వాసి రాజు,ఆయా గ్రామాల పెద్దలు సిబ్బంది ని అభినందించారు.



