షర్మిలా ధన్‌ఖడ్… యువతరం మాత్రమే క్రీడల్లో రాణించి పతకాలు సాధించగలదనే అపోహను పటాపంచలు చేసింది. క్రీడల్లో సత్తా చాటడానికి వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపించింది. తనను శారీరకంగా కుంగదీసిన పోలియో మహమ్మారిని ఎదిరించి గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని ముద్దాడింది. నలభై ఏండ్ల వయసులో షాట్‌పుట్ ఎఫ్57 విభాగం ఫైనల్లో ఏకంగా 9.81 మీటర్ల దూరం గుండును విసిరి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించింది. కామన్వెల్త్ క్రీడల పారా అథ్లెటిక్స్‌లో భారత దేశం రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న పసిడి కలను సాకారం చేసింది. అయితే, ఈ పతకం వెనుక ఉన్నది కేవలం క్రీడా నైపుణ్యం మాత్రమే కాదు. గుండెల్ని పిండేసే ఎన్నో కన్నీటి గాథలు ఆమె గెలుపు ప్రయాణంలో దాగి ఉన్నాయి.
చిన్నతనంలోనే పోలియోతో ఒక కాలు పూర్తిగా దెబ్బతింది. కట్నం తేలేదని, ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందని కట్టుకున్న భర్త విచక్షణారహితంగా కొట్టి నడివీధిలో గెంటేశాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న ఆ మహిళ ఇప్పుడు నలభై రెండేండ్ల వయసులో గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. దేశం గర్వించేలా విశ్వవేదికపై జాతీయ జెండాను రెపరెపలాడించిన పారా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది.
తీవ్రమైన ఆర్థిక సమస్యలు
హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలోని చిత్రౌలి అనే ఓ చిన్న గ్రామంలో షర్మిల పుట్టింది. అక్కడి నుంచి ఇప్పుడు గ్లాస్గో వేదికగా దేశ ప్రతిష్టను నలుదిశలా చాటే స్థాయికి ఎదగడం వెనుక మాటల్లో చెప్పలేనన్ని కష్టాలు ఉన్నాయి. షర్మిల తండ్రి ఓ పేద సన్నకారు రైతు. తల్లికి కంటిచూపు లేదు. నలుగురు సంతానంలో షర్మిల రెండో బిడ్డ. ఇంట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు. దానికి తోడు సరైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో రెండేండ్ల పసిప్రాయంలోనే ఆమె పోలియో బారిన పడింది. ఆ మహమ్మారి దెబ్బకు ఎడమకాలు పూర్తిగా చచ్చుబడిపోయింది. ఆ శారీరక లోపంతోనే ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని పదో తరగతి వరకు చదువుకుంది. ఆ వెంటనే తల్లిదండ్రులు ఆమెకు పెండ్లి చేసి పంపించారు. అక్కడితో ఆమె కష్టాలు తీరతాయని అనుకుంటే, అసలు నరకం అప్పుడే మొదలైంది.
అంతులేని మానసిక క్షోభ
పెండ్లితో షర్మిల జీవితంలో శారీరక ఇబ్బందులకు అంతులేని మానసిక క్షోభ కూడా తోడైంది. కట్టుకున్న భర్త నిత్యం మద్యం, మాదకద్రవ్యాల మత్తులో మునిగితేలేవాడు. కుటుంబ భారాన్నంతా ఆమె ఒంటరిగా మోయాల్సి వచ్చింది. అది చాలదన్నట్టు పుట్టింటి నుంచి అదనపు కట్నం తీసుకురా లేదని రోజూ చిత్రహింసలు పెట్టేవాడు. వరుసగా ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చిందన్న నెపంతో మరింత దారుణంగా కొట్టేవాడు. ఇరవై ఆరేండ్ల వయసులో ఓ రోజు ఆ కిరాతకుడు మరీ వికృతంగా ప్రవర్తించాడు. విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా, దుస్తులు చించి అందరూ చూస్తుండగానే ఇరుగుపొరుగు ముందు నిలబెట్టాడు. ఇద్దరు పసిపిల్లలతో సహా ఆమెను ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా గెంటేశాడు. దిక్కుతోచని స్థితిలో ఒకనొక దశలో ఆత్మహత్య చేసుకోవాలను కుంది. కానీ పిల్లలు గుర్తుకొచ్చి విరమించు కుంది. పుట్టింటికి చేరుకున్న ఆమె, బతకడానికి కాయకష్టం చేసింది. దొరికిన ప్రతి పనీ చేస్తూ పిల్లలను సాకింది. ఇండ్లలో పనులతో పాటు సెక్యూరిటీ గార్డుగా, స్వీపర్‌గా పనిచేసింది. పనిలో బిజీగా ఉండటం వల్లే తన బుర్రలోకి ఎలాంటి చెడు ఆలోచనలు రాలేదని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది.
ఓ వెలుగు రేఖ
చీకటి కమ్మిన ఆమె జీవితంలో ఇరవై ఎనిమి దేండ్ల వయసులో ఓ వెలుగు రేఖ కనిపిం చింది. అజిత్ సింగ్ అనే వ్యక్తితో ఆమెకు రెండో వివాహం జరిగింది. ఆ పెండ్లి ఆమె పాత జీవితాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. అజిత్ సింగ్ ఆమెను తన ప్రాణంగా చూసుకోవడమే కాకుండా, ఆ ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా ప్రేమతో స్వీకరించాడు. కుటుంబాన్ని రెవాఢీకి మార్చిన అతను, షర్మిలలో అద్భుతమైన స్ఫూర్తిని రగిలిం చాడు. ఆటల్లో ఆమె ఆసక్తిని గమనించి పారా స్పోర్ట్స్‌లో చేర్పించి నిరంతరం ప్రోత్స హించా డు. సాధారణంగా క్రీడాకారులు రిటైర్మెంట్ ప్రకటించే వయసులో షర్మిల తొలిసారి చేతిలోకి షాట్‌పుట్ గుండును పట్టింది.
అత్యుత్తమ ప్రదర్శనతో
కోచ్‌లు టెక్ చంద్, దేవేంద్ర పర్యవేక్షణలో కఠిన సాధన చేసింది. ఆమె శిక్షణ, డైట్ ఖర్చుల కోసం కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు తట్టుకుంటూ 2023లో తమ సొంతింటిని కూడా అమ్మేసి అద్దె ఇంట్లోకి మారింది. 2022 కామన్వెల్త్ గేమ్స్, 2023 ఆసియా పారా గేమ్స్‌లో నాలుగో స్థానంతో తృటిలో పతకాలు చేజారినా షర్మిల వెనకడుగు వేయలేదు. పట్టువదలకుండా శ్రమించి, గ్లాస్గో వేదికగా తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. కష్టాలు వచ్చినా జీవితం అక్కడితో ముగిసిపోదని షర్మిల ఈ విజయంతో నిరూపించింది. విధిరాతను ఎదిరిస్తూ.. జీవితానికి రెండో అవకాశం ఇస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో ప్రపంచానికి చాటిచెప్పింది. ఏ చేతులైతే కష్టాలతో కాయలు కాశాయో, అదే చేతులతో గుండును విసిరి నేడు ప్రపంచ వేదికపై విశ్వవిజేతగా నిలిచింది. గ్లాస్గో క్రీడల్లో తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి దేశానికి బంగారు పతకాన్ని అందించింది.
మళ్లీ ఇదే తొలిసారి
గతంలో 2006 కామన్వెల్త్ క్రీడల్లో పారా అథ్లెట్ రంజిత్ కుమార్ జయశీలన్ డిస్కస్ త్రోలో రజత పతకం సాధించాడు. ఆ తర్వాత పారా అథ్లెటిక్స్‌లో మన దేశానికి పతకం రావడం మళ్లీ ఇదే తొలిసారి. అన్ని అడ్డంకు లను బద్దలుకొట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన 42 ఏండ్ల షర్మిల విజయంపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేస్తోంది. ముఖాన ఉమ్మివేసిన చోటే పూల వర్షం కురిసేలా చేసుకున్న షర్మిల జీవితం ప్రతి మహిళకు ఒక ఆదర్శం. శారీరక లోపం, సామాజిక కట్టుబాట్లు ఏవీ కూడా సాధించాలనే పట్టుదలను ఆపలేవని ఆమె తన విజయంతో నిరూపించింది. రాబోయే పారా ఒలింపిక్స్‌లో కూడా ఆమె ఇదే స్ఫూర్తితో మరిన్ని పతకాలు కొల్లగొట్టాలని యావత్ దేశం కోరుకుంటోంది.



