Thursday, July 30, 2026
E-PAPER
Homeబీజినెస్బ్రిటన్‌ ఏబీపీపై అదానీ పోర్ట్స్‌ కన్ను

బ్రిటన్‌ ఏబీపీపై అదానీ పోర్ట్స్‌ కన్ను

- Advertisement -

64 శాతం వాటాల కొనుగోలుకు ప్రయత్నం
21 నౌకాశ్రయాల నిర్వహణపై దృష్టి..!
న్యూఢిల్లీ :
బ్రిటన్ లోని అతిపెద్ద పోర్టుల ఆపరేటర్ అయిన అసోసియేటెడ్ బ్రిటిష్ పోర్ట్స్ (ఎబిపి)లో 63.9 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఎపిసెజ్‌) తీవ్రంగా ప్రయత్నిస్తోందని సమాచారం. 2031 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాన్స్‌పోర్ట్ యూటిలిటీ కంపెనీగా ఎదగాలన్న దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే కెనడాకు చెందిన పెన్షన్ ఫండ్ల ఆధీనంలో ఉన్న ఈ వాటాల కొనుగోలుకు ఆసక్తి చూపుతోందని రిపోర్టులు వస్తున్నాయి. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ వ్యాప్తంగా 21 వ్యూహాత్మక పోర్టులను నిర్వహిస్తున్న ఎబిపి.. యుకె సముద్ర వాణిజ్యంలో దాదాపు 25 శాతం వాటాను కలిగి ఉంది. దేశంలోనే అతిపెద్దదైన ఇమ్మింగ్‌హామ్ పోర్ట్, కీలక ఎగుమతి కేంద్రమైన సౌతాంప్టన్‌లు దీని పరిధిలోనే ఉన్నాయి. అదే విధంగా యుకె ఆఫ్‌షోర్ విండ్ ఇండస్ట్రీలో 50 శాతానికి పైగా ఆపరేషన్స్, మెయింటెనెన్స్ పనులను ఎబిపి చూస్తోంది. ఈ వ్యూహాత్మక ఒప్పందం ద్వారా ఐరోపాలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన బ్రిటన్‌లో అదానీ పోర్ట్స్‌‌కు తిరుగులేని వేదిక లభించనుంది. అయితే ఎబిపి గ్లోబల్ కంపెనీ వాటాల కొనుగోలు రేసులో కెకెఆర్, బ్లాక్‌రాక్ జిఐపి, బ్రూక్‌ఫీల్డ్, డిపి వరల్డ్, ఎడిఐఎ వంటి దిగ్గజ సంస్థల నుంచి తీవ్ర పోటీ నెలకొంది. ఇజ్రాయెల్‌లోని హైఫా పోర్ట్ కొనుగోలు తర్వాత అదానీ పోర్ట్స్‌‌కు ఇది రెండో అతిపెద్ద అంతర్జాతీయ ప్రాజెక్ట్ కానుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -