మోడీని
నిలదీస్తున్న యువత
న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన భారీ నిరసన ప్రదర్శనలో కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నిఘా వ్యవస్థను వినియోగించడంపై ప్రధాని నరేంద్ర మోడీని విద్యార్థులు, యువత నిలదీస్తోంది. నీట్ పరీక్షా పత్రాల లీకేజీకి వ్యతిరేకంగా నిర్వహించిన ప్రదర్శన సందర్భంగా నిఘా ఉదంతం తెర పైకి వచ్చింది. ఓ టెలిస్కోపిక్ మాస్ట్‌పై అమర్చిన కెమేరాలతో కూడిన పోలీస్ నిఘా వ్యాన్‌కు సంబంధించిన చిత్రాలను నిరసనకారులు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేశారు. ఈ వ్యాన్ నిరసనకారులను 360 డిగ్రీల కోణంలో చూపించింది. విద్యార్థులపై సామూహిక నిఘా వేసి ఉంచడాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని, నిరసనల సమయంలో సేకరించిన వ్యక్తిగత డేటాను ధ్వంసం చేయాలని, నిఘా సాంకేతికత వినియోగంపై మార్గదర్శకాలు రూపొందించాలని కోరుతూ ఐషే ఘోష్ అనే విద్యార్థిని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అవసరానికి మించిన చర్య :
పిటిషనర్ వాదన
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో నిరసనలు ముగిసినప్పటికీ ఘోష్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకోలేదు. దేశ రాజధానిలోని ప్రధాన నిరసన ప్రాంతంలో నిఘా చర్యలు చేపట్టడం చట్ట ఉల్లంఘనే అవుతుందని పలువురు కార్యకర్తలు స్పష్టం చేశారు. ప్రభుత్వం మాత్రం అలాంటి తనిఖీలు చట్టబద్ధమైనవేనని, ప్రభుత్వ ప్రయోజనాల పరిరక్షణకు అవి అవసరమని వాదిస్తోంది. శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పోలీసుల చర్యను సమర్ధించారు. బహిరంగ సభలో ‘గోప్యత’ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నదని, తనిఖీలు అత్యంత అవసరమైనవని, చట్టబద్ధమైన ప్రభుత్వ ప్రయోజనాల కోసం జరిగా యని వాదించారు. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ ఘోష్ తన వాదనను వినిపిస్తూ నిఘా అనేది అవసరానికి మించిన చర్య అని చెప్పారు. నిరసనల సమయంలో ప్రభుత్వ నిఘా విధానాలపై మరింత సమాచారాన్ని వెల్లడించాలని ఆమె కోరారు.
ఆ డేటాను తొలగించండి
న్యూఢిల్లీకి చెందిన ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ఈ నెల 24న ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఓ లేఖ రాస్తూ నిరసన ప్రదేశంలో సేకరించిన బయోమెట్రిక్ డేటాను తొలగించాలని కోరింది. దీనిపై సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో ఢిల్లీ పోలీసులు ఓ పోస్ట్ పెడుతూ ముఖ గుర్తింపు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా తాము ఎవరి స్వేచ్ఛనూ పరిమితం చేయలేదని తెలిపారు. నిరసనకారులను గుర్తించడానికి ముఖ గుర్తింపును ఉపయోగిస్తే అణచివేతల సమయంలో నేమ్ బ్యాడ్జీలు లేకుండా చర్యలకు పూనుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులను గుర్తించడానికి కూడా దానినే ఉపయోగించాలని ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్‌కు చెందిన ఆకాష్ కర్మాకర్ డిమాండ్ చేశారు. కాగా నిరసన ప్రాంతానికి వస్తున్న వారి ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్స్‌ను కూడా పోలీసులు నమోదు చేసుకున్నారని తెలుస్తోంది. నేర చరిత్ర కలిగిన వారు నిరసనలో ప్రవేశించకుండా నిరోధించేందుకే తనిఖీలు జరిపామని ఇన్స్‌పెక్టర్ సునీల్ కుమార్ చెప్పారు.
ఏమిటీ ‘ఇక్షణ’ ?
నిరసన ప్రదేశంలో నిలిపి ఉంచిన నిఘా వ్యాన్‌పై ఢిల్లీ పోలీసుల చిహ్నం, ‘ఇక్షణ’ (తెలుగులో దృష్టి) అనే బ్రాండింగ్ స్పష్టంగా కన్పిస్తున్నాయి. తమ వద్ద అధునాతన ఏఐ ఆధారిత కెమేరాలు, మొబైల్ కెమేరాలు, సర్దుబాటు చేయగల లెన్సులతో కూడిన వేరిఫోకల్ బులెట్ కెమేరాలు ఉన్నాయని ‘ఇక్షణ’ అభివృద్ధిలో భాగస్వామి అయిన భారతీయ సీసీటీవీ కంపెనీ సీపీ ప్లస్ చెబుతోంది. అయితే సీపీ ప్లస్ వెబ్‌సైటులో ఉన్న ఈ వివరాలను గత వారాంతంలోనే తొలగించారు. భద్రతకు సంబంధించి ఢిల్లీ పోలీసులు వినియోగించిన మౌలిక సదుపాయాలలో భాగమైన నిఘా హార్డ్‌వేర్‌ను తాము సరఫరా చేశామని, అయితే దాని వినియోగానికి సంబంధించిన వ్యవహారాలను పోలీసులే చూసుకున్నారని ఆ సంస్థ తెలిపింది.
నిరసనలో నిఘా నేత్రమా?
- Advertisement -
- Advertisement -



