దక్షిణాది రాష్ర్టాల వ్యవసాయ మంత్రులతో సమావేశానికి సమయమివ్వాలని విన్నపం
ఆయిల్‌పామ్ రైతుల సమస్యలు, విధానపర నిర్ణయాలపై చర్చకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఆయిల్‌పామ్ రైతుల ప్రయోజనాల పరిరక్షణతో పాటు దేశంలో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు అవసరమైన విధానపరమైన నిర్ణయాలపై చర్చించేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం వేర్వేరుగా లేఖలు రాశారు. ప్రధానమంత్రి ప్రారంభించిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్–ఆయిల్‌పామ్ దేశాన్ని వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి దిశగా తీసుకెళ్తున్న కీలక కార్యక్రమమని తుమ్మల పేర్కొన్నారు. ఈ మిషన్ అమలులో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయనీ, దేశవ్యాప్తంగా ఇప్పటివరకు సాగులోకి వచ్చిన ఆయిల్‌పామ్ విస్తీర్ణంలో 75 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాలదేనని తెలిపారు. తెలంగాణకు కేంద్రం నిర్దేశించిన 1.45 లక్షల హెక్టార్ల లక్ష్యానికి గాను ఇప్పటికే 0.98 లక్షల హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగు చేపట్టి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని వివరించారు. అయితే, కనీస హామీ ధర(ఎమ్‌జీపీ) దిగుమతి సుంకాల స్థిర విధానం, నాణ్యమైన మొలకల లభ్యత, ఎన్‌ఎమ్‌ఈఓ-ఓపీ కింద ఆర్థిక సహాయాలు వంటి అంశాల్లో విధానపరమైన నిర్ణయాలు అవసరమని పేర్కొన్నారు. రైతులకు స్థిరమైన విధాన భరోసా కల్పిస్తేనే ఆయిల్‌పామ్ సాగు విస్తరణ వేగవంతమై, దేశం వంటనూనెల దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాలలోనే దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో కూడిన బృందానికి ప్రధానమంత్రిని కలిసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్రాల ఉమ్మడి సమస్యలను, రైతుల అభిప్రాయాలను, ఆయిల్‌పామ్ రంగ అభివృద్ధికి అవసరమైన విధాన సూచనలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రధానమంత్రితో సమావేశం ఏర్పాటు చేయడంలో సహకరించాలని కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కోరారు.
ప్రధాని అపాయింట్‌మెంట్ కోరుతూ మంత్రి తుమ్మల లేఖ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



