Thursday, July 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై 
సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం

తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై 
సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం

- Advertisement -

పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్‌, గౌరెల్లి రిజర్వాయర్లకు
 లైన్‌ క్లియర్‌ : మంత్రి తుమ్మల
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణలోని పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మసాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ వంటి కీలక సాగునీటి ప్రాజెక్టులకు ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు పూర్తిగా చెల్లుబాటులోనే ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు తెలంగాణ సాగునీటి రంగానికి ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల పర్యావరణ అనుమతుల అంశంలో ప్రత్యేక చొరవ చూపిన ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి, సంబంధిత అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో అత్యంత ప్రాధాన్యమున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని పేర్కొన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టు తెలంగాణ జలవనరుల చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు ద్వారా 36.57 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఏర్పడుతుందని తెలిపారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి భద్రత లభిస్తుందని వివరించారు. అందులో 3.28 లక్షల ఎకరాలకు కొత్తగా సాగునీరు అందే అవకాశముందని తెలిపారు. కరువు పరిస్థితుల్లో 3.45 లక్షల ఎకరాల నాగార్జునసాగర్ ఆయకట్టును స్థిరీకరించేందుకు ఈ నీటిని వినియోగించుకోవచ్చని పేర్కొన్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టు ద్వారా 282.80 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నదికి ఇరువైపులా సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయనీ, బోర్లు, బావుల్లో నీటి లభ్యత మెరుగుపడుతుందని వివరించారు. అలాగే గోదావరి వెంట కరకట్టల నిర్మాణం ద్వారా అశ్వాపురం, మణుగూరు, దుమ్ముగూడెం, చర్ల మండలాల్లోని పంటలు, గ్రామాలు వరద ముప్పు నుంచి రక్షణ పొందుతాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -