Thursday, July 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెద్దల జోలికి హైడ్రా ఎందుకెళ్లడం లేదు?

పెద్దల జోలికి హైడ్రా ఎందుకెళ్లడం లేదు?

- Advertisement -

నెక్టర్‌ గార్డెన్స్‌, ఫాతిమా కాలేజీ 
కనిపించడం లేదా: ఎమ్మెల్యే సుధీర్‌‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

‌పేదల ఇండ్లు కూలగొడుతున్న హైడ్రా పెద్దల జోలికి ఎందుకెళ్లడం లేదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్‌‌లోని తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ దుర్గం చెరువు వద్ద ఉన్న నెక్టర్ గార్డెన్స్, ఫాతిమా కాలేజ్ లాంటివి హైడ్రాకు కనిపించడం లేదా?అని అడిగారు. హిమాయత్ సాగర్, గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇండ్ల వద్దకు హైడ్రా ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. పెద్దల భూములను రక్షించుకుంటూ పేదల ఇండ్లు కూలగొడుతూ ఎంతో మందిని రోడ్డున పడేసిందని అన్నారు. రూ.లక్షల కోట్ల ఆస్తులు కాపాడినట్టు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్ చె‌ప్పడం కేవలం ప్రజలను మభ్యపెట్టడమేనని చెప్పారు. హైడ్రా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్‌ ‌చేశారు. కొందరు కోర్టును తప్పుదోవ పట్టించారని హైడ్రా కమిషనర్ చెప్పడం దారుణమని అన్నారు. రంగనాథ్ వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా కోర్టుధిక్కరణ కింద స్వీకరించాలని కోరారు. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కుదే‌ల్‌ కావడానికి హైడ్రా కూడా ఒక కారణమని అన్నారు. హైడ్రాను వ్యతిరేకించడం లేదనీ, కేవలం బ్లాక్ మెయిలింగ్ కోసం సాధనంగా వాడుకోవాలని చూడడం సరైంది కాదని చెప్పారు. సీఎం, మంత్రులు అబద్ధాలు మాని పరిపాలనపై దృష్టి సారించాలని కోరారు.

​రంగనాథ్‌ను బర్తరఫ్ చేయాలి : బండారి లక్ష్మారెడ్డి
హైడ్రా కమిషనర్‌ ఎవి రంగనాథ్‌‌ను వెంటనే బర్తరఫ్‌ ‌చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. ఆయన వ్యవహారంపై హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని బట్టబయలు చేశాయని తీవ్రంగా విమర్శించారు. కోర్టు ఆదేశాలు, న్యాయపరమైన విధానాలను పట్టించుకోకుండా వ్యవహరించే అధికారులను ప్రభుత్వం వెనుకేసుకురావడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరిట జరిగిన కూల్చివేతలు, ఎంపిక చేసిన చర్యలు, అధికార దుర్వినియోగంపై హైకోర్టు పర్యవేక్షణలో లేదా స్వతంత్ర న్యాయ విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -