Thursday, July 30, 2026
E-PAPER
Homeజాతీయంప్రచారానికి కోట్లు… యువత భవితకు తూట్లు

ప్రచారానికి కోట్లు… యువత భవితకు తూట్లు

- Advertisement -

నీటి మీద రాతల్లా ప్రధాని ఇంటర్న్‌షిప్ పథకం లక్ష్యాలు
ఇంటర్న్‌లపై చేసిన వ్యయంతో సమానంగా ప్రకటనలపై ఖర్చు
ఐదేండ్లలో కోటి మందికి అవకాశమంటూ హామీ.. రెండేండ్లలో 2.97 లక్షల మందికే పరిమితం
రూ.63 వేల కోట్లలో రూ.123.7 కోట్లే ఖర్చు
తక్కువ స్టైపెండ్, ఉద్యోగ హామీ లేకపోవడం, దూర ప్రాంతాల్లో పోస్టింగులతో భారీ డ్రాపౌట్లు
‘ఆర్టీఐ’ ద్వారా వెలుగులోకి అనేక వాస్తవాలు
న్యూఢిల్లీ :

2024 లోక్‌సభ ఎన్నికల అనంతరం యువతలో పెరిగిన నిరుద్యోగ ఆందోళనను తగ్గించేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం (పీఎంఐఎస్) అమలులో తీవ్ర వైఫల్యాన్ని చవిచూస్తోంది. ఐదేండ్లలో కోటి మంది యువతకు, తొలి రెండేండ్లలోనే 30 లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌లు కల్పిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. రెండేండ్లు పూర్తికాకముందే లక్ష్యాలకు చాలా దూరంలో నిలిచిపోయింది. ఆశించిన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో పాటు ఇంటర్న్‌లకు చెల్లించిన మొత్తానికి దాదాపు సమానంగా ప్రకటనలపైనే ప్రభుత్వం ఖర్చు చేయడం ఈ పథకం అసలు ప్రాధాన్యాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

యువతకు ఉద్యోగ అవకాశాలే లక్ష్యం
మోడీ ప్రభుత్వ మూడో విడత పాలనలో తొలి బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకాన్ని ప్రకటించారు. దేశంలోని టాప్ 500 కంపెనీల్లో ఐదేండ్లలో కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్‌లు కల్పిస్తామనీ, తొలి రెండేండ్లలోనే 30 లక్షల మందిని చేర్చుకుంటామని హామీ ఇచ్చారు. యువతకు పరిశ్రమల అనుభవం కల్పించి ఉద్యోగ అవకాశాలు పెంచడమే లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. అయితే సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) ద్వారా వెలుగులోకి వచ్చిన గణాంకాలు ఈ భారీ ప్రకటనలకు, వాస్తవ అమలుకు మధ్య ఉన్న విపరీతమైన అంతరాన్ని బయటపెట్టాయి.

2.97 లక్షల మందికి అవకాశాలు.. 
పూర్తి చేసింది ఐదువేల మందే!
ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి కంపెనీలు ప్రకటించిన ఇంటర్న్‌షిప్ అవకాశాలు 2.97 లక్షలు మాత్రమే. వాటిలో ఉద్యోగ ఆఫర్లు పొందినవారు 1.73 లక్షలు. కానీ నిజంగా విధు ల్లో చేరిన వారు కేవలం 18 వేల మంది. చివరి వరకు ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారు సుమారు 5,200 మందే. అంటే రెండేండ్ల లక్ష్యం 30 లక్షలతో పోలిస్తే పూర్తి చేసిన వారి సంఖ్య అర శాతానికి కూడా చేరకపోవడం గమనార్హం. మొత్తం 12 లక్షల దరఖాస్తులు వచ్చినా చివరకు పూర్తి చేసిన వారి సంఖ్య అత్యంత స్వల్పంగా ఉండటం పథకంపై యువత ఆసక్తి ఎంతగా తగ్గిందో తెలియజేస్తోంది.

బడ్జెట్ రూ.63వేల కోట్లు.. 
ఖర్చు రూ.123 కోట్లే!
ఈ పథకానికి ఐదేండ్లలో రూ.63 వేల కోట్ల బడ్జెట్‌ను ప్రకటించిన ప్రభుత్వం.. ఈ ఏడాది మార్చి మధ్యనాటికి ఖర్చుచేసింది రూ.123.7 కోట్లు మాత్రమే. ఇది మొత్తం కేటాయింపులో 0.2శాతం కూడా కాదు. ఇందులో ఇంటర్న్‌లకు స్టైపెండ్‌ల రూపంలో ఖర్చు చేసింది రూ.54.3 కోట్లు కాగా, ప్రచారం, ప్రకటనలకే రూ.46.7 కోట్లు వెచ్చించింది. అంటే యువతకు ప్రయోజనం చేకూర్చేందుకు ఖర్చుచేసిన మొత్తాని కి సమానంగా ప్రచారానికే నిధులు వినియోగిం చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం అధికం
దేశంలోని యువతలో నిరుద్యోగం తీవ్రమవుతున్న సమయంలో ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అజీమ్ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం… 25 ఏండ్లలోపు వయస్సున్న గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం దాదాపు 40 శాతానికి చేరింది. 2023లో నిరుద్యోగ యువతలో 70 శాతం మంది గ్రాడ్యుయేట్లే కావడం గమనార్హం. కాగా ఈ ఏడాది మేలో 29 ఏండ్లలోపు వయస్సు వారిలో నిరుద్యోగ రేటు 15.9 శాతంగా నమోదైంది. ఈ నేపథ్యంలో దేశంలో ఉపాధి కల్పనపై భారీ హామీలు ఇచ్చిన మోడీ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైందనే విమర్శలు మరింత బలపడుతున్నాయి.

మార్పులు చేసినా మారని పథకం
కాగా మొదటి రెండు దశల్లో ఎదురైన విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది. ఇంటర్న్‌షిప్ కాల వ్యవధిని 12 నెలల నుంచి 6 లేదా 9 నెలలకు తగ్గించే అవకాశం కల్పించింది. నెలవారీ భత్యాన్ని రూ.5 వేల నుంచి రూ.9 వేలకు పెంచింది. అర్హత వయస్సును 21-24 ఏండ్ల నుంచి 18-25 ఏండ్లకు విస్తరించింది. అర్హత గల కంపెనీల సంఖ్యను 500 నుంచి 2,000 కు పెంచింది. అయినప్పటికీ ఉద్యోగ హామీ లేకపోవడం, శిక్షణ నాణ్యతపై సందేహాలు, పరిశ్రమల ఆసక్తి లోపించడం వంటి ప్రధాన సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

తక్కువ స్టైపెండ్.. అదీ ఆలస్యంగా..
ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. నెలకు కేవలం రూ.5 వేల స్టైపెండ్‌తో ఇతర నగరాల్లో జీవించడం అసాధ్యమనీ, ప్రయాణం, అద్దె, ఆహార ఖర్చులు భరించలేక చాలామంది మధ్యలోనే ఇంటర్న్‌షిప్‌ను వదిలిపెట్టారని వెల్లడైంది. చాలామందికి తమ విద్యార్హతలకు సంబంధం లేని విభాగాల్లో పోస్టింగ్‌లు రావడం కూడా వారిలో చాలా నిరుత్సాహానికి దారితీసింది. ప్రభుత్వం అందించే స్టైపెండ్ ఆలస్యంగా జమ కావడం వల్ల ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగినట్టు ఇంటర్న్‌లు తెలిపారు.

కంపెనీల అనాసక్తి
ఇటు దేశంలోని కంపెనీలకు కూడా ఈ పథకంపై పెద్దగా ఆసక్తి కనిపించలేదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. శిక్షణ ఇచ్చిన తర్వాత అభ్యర్థులు సంస్థలో చేరకపోవడం, చేరినా త్వరగా వేరే కంపెనీలకు వెళ్లిపోవడం వల్ల పెట్టుబడి తిరిగి రాదనే అభిప్రాయం సంస్థల్లో ఉందని నిపుణులు చెప్పారు. ఉద్యోగ హామీ లేకుండా కేవలం ఇంటర్న్‌షిప్‌తోనే యువతను ఆకర్షించడం కష్టమని వారు స్పష్టం చేస్తున్నారు.

కేంద్రం విరుద్ధ ప్రకటనలు.. యువతలో ఆగ్రహం
యువతలో ఉద్యోగ అవకాశాలు పెంచడమే లక్ష్యమని ప్రకటించిన మోడీ సర్కారు.. ఆ తర్వాత మాట మార్చింది. పథకం కింద ఉద్యోగం ఇవ్వడం తమ లక్ష్యం కాదని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌లో స్పష్టం చేసింది. సంస్థల అవసరాలను బట్టి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపింది. అయితే నిరుద్యోగ యువతకు ఉద్యోగ భరోసా లేని ఇంటర్న్‌షిప్‌లపై పెద్దగా ఆసక్తి ఉండదని, అందువల్లే పథకం ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రచారంలో భారీ హామీలు ఇచ్చిన మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం.. అమలులో మాత్రం లక్ష్యాలకు దూరంగా ఉండటం యువతలో మరింత నిరాశను మిగిల్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మోడీ ప్రభుత్వ అస్పష్ట, విరుద్ధ ప్రకటనలపై దేశ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -