నవతెలంగాణ-ఆలేరు టౌన్
ఆలేరు అండర్పాస్ దగ్గర కుంగిపోయిన రోడ్డును మరమ్మత్తులు చేపట్టాలని, ఆలేరు పట్టణ వాసులు బందెల సుభాష్, లక్కాకులు ఉప్పలయ్య, పాశికంటి కృష్ణ గురువారం సంబంధిత అధికారులను కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అండర్పాస్ నిర్మాణ పనుల్లో భాగంగా కొలనపాక రోడ్డు నుంచి పోచమ్మ గుడి వైపు వెళ్లే రోడ్డు నాణ్యత లోపించి కుంగిపోయి భారీ గుంత ఏర్పడిందని తెలిపారు. దీనివలన వర్షాకాలంలో నీళ్లు నిలిచి భారీ వాహనాలు వెళ్లడం వలన అండర్ పాస్ సైడ్ వాల్ గోడకు పగుళ్లు ఏర్పడి బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉందని చెప్పారు.
ఇటువైపుగా వచ్చే వాహనాలు భారీ గుంతను గమనించకపోవడంతో అధిక లోడుతో వచ్చే భారీ వాహనాలు అదుపుతప్పి అండర్పాస్ లో పడి పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరో మారు జిల్లా ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్ సంయుక్తంగా అండర్ పాస్ ప్రాంతాన్ని పరిశీలించి అండర్పాస్ లోపల కూడా మూల మలుపుల వద్ద తగు ప్రమాద నివారణ సూచికలు ఏర్పాటు చేసి రోడ్డును పటిష్టంగా నిర్మించి త్వరలో ప్రజలకు అందులపాటులోకి తేవాలని కోరారు.



