రెండు జిల్లాల కలెక్టర్లతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శాఖల వారీగా సమీక్ష
నవతెలంగాణ – పరకాల
పరకాల నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారదతో కలిసి వివిధ శాఖల అధికారులతో నియోజకవర్గ అభివృద్ధి పనులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో డీఆర్డీఏ, పరకాల మున్సిపాలిటీ, నీటిపారుదల, వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమ, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు, మిషన్ భగీరథ, వైద్య ఆరోగ్య, విద్య, విద్యుత్, మహిళా శిశు సంక్షేమ, రెవెన్యూ, మత్స్య, పశుసంవర్థక, భూగర్భ జలాలు, డెయిరీ డెవలప్మెంట్ ఫెడరేషన్, హౌసింగ్, ఎస్సీ కార్పొరేషన్ తదితర శాఖల ద్వారా అమలవుతున్న పనుల పురోగతిని శాఖల వారీగా సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు నాణ్యతా ప్రమాణాలతో, నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. శాఖల మధ్య సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, అభివృద్ధి పనుల్లో జాప్యానికి తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వ్యవసాయ రంగంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మొక్కజొన్నకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని పరకాల నియోజకవర్గ రహదారుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు.
గ్రామపంచాయతీ భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, వీవో భవనాలు అవసరమైన గ్రామాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. వీవో భవనాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, నీటి ట్యాంకులను షెడ్యూల్ ప్రకారం శుభ్రపరిచి వాటి నిర్వహణ రికార్డులు తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు నీటి వృథాను అరికట్టాలని అధికారులను ఆదేశించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వందశాతం పూర్తి చేయాలని, టెక్స్టైల్ పార్కు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్సెంటర్ల భవనాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.ప్రతి శాఖ చేపట్టిన పనుల ప్రస్తుత స్థితి, నిధుల వినియోగం, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే పనులకు ప్రాధాన్యం ఇచ్చి పెండింగ్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
కలెక్టర్లు చాహత్ బాజ్పాయ్, డాక్టర్ సత్యశారద మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని, శాఖల మధ్య సమన్వయంతో కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు రవి, సంధ్యారాణి, వై.వి. గణేష్, శేషాద్రి, డీఆర్వోలు శ్రీనివాస్, విజయలక్ష్మి, ఆర్డీవోలు, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


