నవతెలంగాణ-హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితాను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో వివేక్ యాదవ్ విడుదల చేశారు. ఈ ముసాయిదా జాబితాను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) నెట్ యాప్, సీఈవో వెబ్సైట్లలో పరిశీలించ వచ్చునని ఓటర్లకు ఆయన సూచించారు. రాష్ట్రంలో 3.71 కోట్ల మంది ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించారని ఏపీ ఎన్నికల సంఘం సీఈవో వెల్లడించారు. శుక్రవారం రాజధాని అమరావతిలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన మొత్తం 4.16 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని.. వారిలో 89.22% మంది ఫారాలు సమర్పించారని ఆయన తెలిపారు. అయితే 15.22 లక్షల మంది ఓటర్లు మరణించినట్లు గుర్తించామని వివరించారు. 22.30 లక్షల మంది శాశ్వత చిరునామా మారినట్లు లేదా గైర్హాజరైనట్లు కనుగొన్నామని చెప్పారు. 7.37 లక్షల మంది ఓటర్ల పేర్లు రెండు, మూడు చోట్ల నమోదయ్యాయని పేర్కొన్నారు.జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్తోపాటు అభ్యంతరాలు స్వీకరిస్తామని పేర్కొన్నారు. అక్టోబర్ 3వ తేదీన తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని సీఈవో వివేక్ యాదవ్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎస్ఐఆర్ ముసాయిదా ఓటరు జాబితా విడుదల
- Advertisement -
- Advertisement -



