జూలై 20 అర్ధరాత్రి సమయంలో పశ్చిమ బెంగాల్‌లోని పారిశ్రామిక నగరమైన రాణీగంజ్‌లో ప్రధాన కూడలిలో నెలకొల్పిన మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్ పూర్తి ఆకారపు విగ్రహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి తీసుకెళ్లారు. మరుసటి ఉదయం అక్కడ విరిగిపోయిన ఇటుకలు, రాళ్లు మాత్రమే కనిపించాయి. స్థానిక ప్రజలు వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చినా, ఇప్పటివరకు ఒక్క నిందితుడినీ పోలీసులు గుర్తించలేకపోయారు. పశ్చిమ బెంగాల్‌లో కొత్తగా ఏర్పడిన బీజేపీ పాలనలో శాంతిభద్రతల పరిస్థితిపై ఇది ఒక తీవ్రమైన వ్యాఖ్యలా కనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్య మంత్రి గానీ, స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలు గానీ ఈ ఘటనపై ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు,ఖండించలేదు. విగ్రహ పునర్నిర్మా ణానికి హామీ ఇవ్వలేదు. పైగా ఈ విధ్వంసాన్ని ఖండిస్తూ స్థానిక ప్రజలతో కలిసి నిరసన నిర్వహించిన సీపీఐ(ఎం) కార్యకర్తలను బీజేపీకి చెందిన కొందరు గూండాలు బెదిరించినట్లు సమాచారం. ఈ ప్రవర్తన ఆశ్చర్యకరం కాదు. ఎందుకంటే ఈ పాలన ప్రారంభమైనప్పటి నుంచే గాంధీజీ, లెనిన్ విగ్రహాల అవమానీకరణ, బెంగాల్‌లోని నీలి తిరుగుబాటు స్మారక నిర్మాణాల ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకు న్నాయి. బీజేపీ అధికారంలోకి రాకముందే ఏబీవీపీ కార్యకర్తలు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కళాశాలలోని విద్యాసాగర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా స్థలాల్లో ప్రత్యామ్నాయ భావజాలాన్ని సూచించే చిహ్నాలను తొలగించి, వాటి స్థానంలో తమకు అనుకూలమైన చరిత్రను నెలకొల్పాలనే ప్రయత్నం జరుగు తోంది. ఫాసిస్టు శక్తులు ఎక్కడైనా ఇదే చేస్తాయి-చరిత్రను తిరగరాస్తాయి.
రాణీగంజ్ విగ్రహం చరిత్ర
రాణీగంజ్‌లోని రాహుల్ సాంకృత్యా యన్ విగ్రహానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అసాధారణ పండితుడు, స్వాతంత్ర్యోద్యమ కార్యకర్త, తత్వవేత్త అయిన రాహుల్ సాంకృత్యాయన్‌కు భారత చరిత్రలో తగిన స్థానం దక్కలేదనే విమర్శలు ఉన్నాయి.అయితే ఆయన జన్మశతాబ్ది సందర్భంగా 1993లో పశ్చిమ బెంగాల్‌లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా బొగ్గు గనుల ప్రాంతమైన రాణీగంజ్‌లో కార్మిక నాయకులు, అభ్యుదయ రచయితలు, కళాకారులు, ఉపాధ్యాయులు కలిసి ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల లక్ష్యం రాహుల్‌ను కేవలం గొప్ప పండితుడిగా కాకుండా ప్రజల మధ్య తిరుగుతూ వారి దోపిడీ, అణచివేతలను అర్థం చేసుకుని సామాజిక విముక్తి మార్గాన్ని అన్వేషించిన ప్రజా మేధావిగా పరిచయం చేయడం. ఈ అన్వేషణలో ఆయన బౌద్ధ తత్వంలోని భౌతికవాద ధోరణులను అధ్యయనం చేసి, ఆపై చారిత్రక భౌతికవాదం, మార్క్సిస్టు సిద్ధాంతాలను భారతీయ సమాజానికి అన్వయించడానికి ప్రయత్నించారు. రాహుల్ జీవితం, రచనలను కార్మికులు, రైతులకు చేరువ చేయడానికి కార్మికవాడల్లో, గ్రామాల్లో సమావేశాలు, చర్చలు నిర్వహిం చారు. ఈ కార్యక్రమాల ముగింపుగా 1994లో రాణీగంజ్ కూడలిలో విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి వామపక్ష ప్రభుత్వ మంత్రి, రైతు ఉద్యమ సీనియర్ నాయకుడు బెనోయ్‌కృష్ణ చౌధురి దీనిని ఆవిష్కరించారు. రాహుల్ కుటుంబ సభ్యులు, రచయితలు, మేధావులతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు కూడా పాల్గొన్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 9న ఆయన జయంతిని పశ్చిమబంగ గణతాంత్రిక రచయిత-కళాకారుల సంఘం అక్కడే నిర్వహిస్తోంది.
ప్రజల పండితుడు రాహుల్
రాహుల్ సాంకృత్యాయన్ అసలు పేరు కేదార్‌నాథ్ పాండే. ఆయన బీహార్‌లోని పండహా గ్రామంలో ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అయితే స్వాతంత్ర్యోద్యమ ప్రభావం ఆయనలో విమర్శ నాత్మక దృక్పథాన్ని పెంపొం దించింది. ఆధునిక విద్యాసంస్థల్లో చదవకపోయినా సంప్రదాయ విద్య ద్వారా అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. అదే సమయంలో భిన్నాభిప్రాయాలను అధ్య యనం చేస్తూ ఆధునిక భావజాలాన్ని స్వీక రించారు.బౌద్ధ సన్యాసిగా మారిన తరువాత ఆయన ‘‘రాహుల్ సాంకృత్యాయన్’’ అనే పేరును స్వీకరించారు. టిబెట్, శ్రీలంక, సోవియట్ రష్యా వంటి దేశాల్లో విస్తృతంగా పర్యటించి ప్రపంచ వ్యాప్తంగా గౌరవాన్ని సంపాదించారు.1922లో గాంధీ ఉద్యమంలో పాల్గొని తొలిసారి జైలుకు వెళ్లారు. అనంతరం 1938లో కిసాన్ సభలో చేరి అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షుడిగా పనిచేశారు. రైతాంగ పోరా టాల్లో పాల్గొంటూ పలుమార్లు జైలుశిక్ష అనుభవించారు. 1939లో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ముంగేర్ యూనిట్ స్థాపక సభ్యుల్లో కూడా ఒకరిగా ఉన్నారు.ఈ చరిత్ర అంతా విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారికి తెలుసా? లేక ఇది కేవలం వామపక్ష సమావేశాలు జరిగే ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న అర్థరహిత విధ్వంసమా? అనే ప్రశ్న తలెత్తుతుంది.
ఆరెస్సెస్ వైరం
ఆరెస్సెస్ భావజాలానికి వామపక్షం ప్రధాన శత్రువుగా మారిందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అందువల్ల పశ్చిమ బెంగాల్‌లో కూడా వామపక్ష ప్రజా చిహ్నాలు లక్ష్యంగా మారే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ సాంకృత్యా యన్ ఆలోచనలు మరింత ప్రాసంగికంగా మారాయి. ‘‘రామ రాజ్య ఔర్ మార్క్స్వాద్’’ అనే తన రచనలో సనాతనవాదులు చారిత్రక భౌతికవాదంపై చేసిన విమర్శలకు ఆయన ఇచ్చిన సమాధానాలు నేటికీ ప్రాముఖ్యమైనవే. మత విశ్వాసం పేరుతో దోపిడీని ‘‘మాయ’’గా, ధనికులకు లొంగి పోవడాన్ని విధిగా, బ్రాహ్మణాధిపత్యాన్ని ధర్మంగా, సతీసహగమనాన్ని స్త్రీ కర్తవ్యంగా సమర్థించే భావజాలాన్ని ఆయన తీవ్ర వ్యంగ్యంతో ఖండించారు. నేడు మతోన్మాదం, అహేతుకత ద్వారా ప్రజల ఆలోచనా స్వేచ్ఛను బంధించే ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో రాహుల్ సాంకృత్యా యన్ ఆలోచనలు మరింత అవసరమ వుతున్నాయి. అందుకే ఫాసిస్టు శక్తులు మహాపండితుడు రాహుల్ సాంకృత్యాయన్ ప్రతినిధ్యం వహించే స్వేచ్ఛా మానవ మేధస్సును చూసి భయపడు తున్నాయి. (రాణీగంజ్ విగ్రహ చరిత్రకు సంబంధించిన వివరాలు అనుప్ మిత్ర రాసిన బెంగాలీ వ్యాసం ఆధారంగా సేకరించబడ్డాయి. ఆ వ్యాసం 2026 జూలై 17న ‘దేశ్-హితైషీ’లో ప్రచురితమైంది.)
మాలిని భట్టాచార్య



