Saturday, August 1, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రజా జర్నలిజం బాటలో ప్రత్యామ్నాయం కోసం…

ప్రజా జర్నలిజం బాటలో ప్రత్యామ్నాయం కోసం…

- Advertisement -

‘నవతెలంగాణ’ పదకొండవ వార్షికోత్స వం ‘రాజ్యాంగం – ప్రజాస్వామ్యం – పత్రికా స్వేచ్చ’ అనే అంశంపై చర్చకు వేదిక కావడం సంతోషదాయకం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో పాటు ఇక్కడి సమస్యలను, ప్రజల ప్రయోజనాలనూ, ప్రజాస్వామ్య విలువలనూ పరిరక్షించే పత్రికలు ఆవిర్భావించాలన్న ఆకాంక్షకు ప్రతిరూపం నవతెలంగాణ. నాడు వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటవాణిగా నిజాం నిషేధానికి గురైన ప్రజాశక్తి వరవడి నుంచి ఉద్భవించిన నవతెలంగాణ నేటి ప్రపంచీకరణ, కాషాయీకరణ, కార్పొరేటీకరణ సవాళ్ల మధ్య ప్రత్యామ్నాయ జర్నలిజానికి ప్రతీకగా వెలుగొందుతున్నది. రాజకీయంగా కొందరు రేకెత్తించిన సందేహాలను పటాపంచలు చేస్తూ నిజమైన ప్రజాపత్రికగా, విలువలకు కట్టుబడే విలక్షణ పత్రికగా పురోగమిస్తున్నది. ‘బొద్దింకల యుద్ధం’ జయప్రదమైన సమయంలోనే ఈ పదకొండో వార్షికోత్సవం కావడం ఆసక్తికరం. విద్యార్థుల నిరసన తరు ణంలోనే గోడీ మీడియా అనబడుతున్న బడా మీడియాపై కొత్త తరం నిరసన తారాస్థాయికి చేరడం కూడా యాదచ్చికం కాదు. ప్రపంచవ్యాపితంగా యాభై దేశాలలో రెండువందల మీడియా సంస్థలు గత సెప్టెంబర్ మొదటి తేదీన అంతకుముందెన్నడూ లేని రీతిలో నిరసన తెలిపాయి. మొదటి పేజీని నిరసనాత్మకంగా ప్రచురించి గాజాలో జర్నలిస్టులపై హత్యాకాండనూ, అణచివేతను దృష్టికి తెచ్చాయి.

ఇజ్రాయిల్ అమెరికా కూటమి కుట్రలకు బలైన గాజాలోనే కాదు. ప్రపంచమంతటా కూడా మీడియా ఇదే విధమైన దాడులకు డౌర్జన్యాలకూ గురవుతున్నది. మీడియా స్వరూపం అనేక కొత్త రూపాల్లోకి మారిన నేపథ్యంలో అవన్నీ కూడా ఈ దాడికి నలిగిపోతుండడం ఇప్పటి ప్రత్యేక సవాలు. నిజానికి ఇది ప్రజాస్వామ్య సూత్రాలకే సవాలు. భారత దేశంలో సంఘ పరివార్‌తో పాటు మోడీ ప్రభుత్వం ప్రత్యక్షంగానూ భావజాల పరంగానూ విమర్శకులపై దాడికి దిగుతుంటాయి. తెలుగు రాష్ట్రాలలోనూ పాలకులు మీడియాను ఆడిపోసుకోని రోజుండటం లేదు. ఇదిగాక సినీ సాంస్కృతిక రంగాలకు సంబంధించి కూడా కార్పొరేట్ పడగనీడన ప్రగతినిరోధక శక్తులు మీడియాను వేటాడుతున్నాయి.ఈ దాడిని మూడు రకాలుగా చూడొచ్చు. మొదటిది-అధికారంతో రాజకీయ ప్రాబల్యంతో, రెండు-అభివృద్ధి నిరోధక ఫాసిస్టు తరహా భావజాలంతో, మూడు- కార్పొరేట్ యాజమాన్య పద్ధతులతో, ప్రలోభాలతో. అధికారం వున్నవారు అరెస్టులు, కేసులు, ఆంక్షలు,ఆణచివేతలతో అడ్డుకుంటారు. అభివృద్ధి నిరోధక కార్పొరేట్ భావజాలానికి వ్యతిరేకంగా వెళ్లకుండా, బలమైన ప్రత్యామ్నాయ శక్తులకు చోటు కల్పించకుండా దిగ్బంధం చేస్తారు. ఇది నిజానికి భావజాల రంగంలో నిత్యసంగ్రామం వంటిదే. నవతెలంగాణ వంటి పత్రికలే లేకపోతే ఈ శక్తులు నిజాన్ని ఎన్నటికీ ప్రజలకు తెలియనీయవు. చవకబారు సంచలనాలు, సెలబ్రటీ కథనాల మాటున సామాజిక వాస్తవాలను కదలికలనూ తొక్కిపడతాయి, నోరు నొక్కుతాయి.

ట్రంప్ వింత విన్యాసాలు
ప్రపంచంలోనే పత్రికాస్వేచ్ఛకు అమెరికా పెట్టింది పేరని గొప్పలు చెబుతుంటారు. వారి రాజ్యాంగానికి మొదటి సవరణే పత్రికా స్వేచ్ఛ కోసం తీసుకొచ్చామంటారు. కానీ అంతర్జాతీయంగా గతంలో సమాచార సామ్రాజ్యవాదం వర్ధమాన దేశాలకు వ్యతిరేకంగా ఆధిపత్య దేశాల తరపున పనిచేస్తుండేది. అలీన దేశాలు ఆ కాలంలో నా మీడియా పేరిట తమకోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నించాయి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత ప్రపంచీకరణ అనే గ్లోబలైజేషన్ గ్లోబల్ మీడియా ఆవిర్భావానికి దారితీసింది. ఇది నిజానికి మరింత పచ్చిగా ఆధిపత్య వర్గాల తరపున పనిచేస్తున్నది. సాంకేతికంగా సమాచార రంగంలో వచ్చిన మార్పులు ఇప్పుడు ‘ఎఐ’ వంటివి దీన్ని మరింత తీవ్రం చేశాయి. ఈ వారమే అమెరిక అధ్యక్ష భవనం కవర్ చేసే మీడియా ప్రతినిధులిచ్చిన విందుకు అధ్యక్షుడు వస్తాడా లేదా అనేది పెద్ద ప్రపంచవార్తగా నడిచింది. ఎందుకంటే గత పాలనా కాలంలో ట్రంప్ ఒక్కసారి కూడా ఆ విందుకు రాలేదు. మీడియాను తన వ్యతిరేకిగా పరిగణిస్తూ వచ్చారు. రెండోసారి వచ్చాక ఆయన దాడి ఇంకా పెరిగింది. డెమోక్రాట్లను బలపర్చిన న్యూయార్క్‌టైమ్స్‌పై పరువు నష్టం కేసు వేశారు.(కాకపోతే కోర్టు కొట్టివేసింది) మీడియా గోష్టులలో నేరుగా విలేకరులపై వ్యంగ్య వ్యాఖ్యలు, బెదిరింపులు సాగించారు.

అమెరికా సైనిక కేంద్రమైన పెంటగాన్‌నుంచి వార్తలు సమాచారం సేకరించేవారు తాము నిబంధనలు పాటిస్తామని ముందే హామీ పత్రం రాసివ్వాలనీ, ఆ సమా చారాన్ని ఎలా వాడుకోవాలో కూడా ఆంక్షలు అనుసరించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రపంచాధిపత్యం కోసం అమెరికా అందులోనూ ట్రంప్ ఉన్మాదాహంకార పాలనలో కుట్రలూ, కుత్సితాలతో చెలరేగిపోతుంటే ఆ విషయాలు ప్రపంచానికి తెలియకుండా బహిరంగ విధానమే తీసుకున్నారన్నమాట. తాజాగా విందుకు హాజరైన తరుణంలో కూడా ఇష్టం లేని మీడియా సంస్థలూ ప్రతినిధులను పేర్లు తీసి మరీ విమర్శించారు.అమెరికా మీడియా మొత్తంగా మితవాదం గుప్పిట్లోకి పోయిందని ‘గార్డియన్’ ఇటీవల పతాకశీర్షిక ప్రచురించింది. సిబిఎస్ దానికి అనుబంధమైన పారమౌంట్ సంస్థలు నేరుగా ట్రంప్‌కు వంతపాడుతుంటే రూపర్ట్‌మర్డోక్ ఫ్యాక్స్‌న్యూస్ కూడా అటూ ఇటూ తిరిగి ఆ వైపే మొగ్గుతున్నాయి, మొత్తంపైన వేలమంది పాత్రికేయుల తొలగింపు, ఆంక్షలు భారాల పెంపు, హామీల రద్దు వంటివాటితో కూడా కార్పొరేట్ సంస్థలు లొంగదీసు కుంటున్నాయని రిపోర్టర్స్ శాన్స్ బార్డర్డ్(సరిహద్దులు లేని విలేకరులు) అనే సంస్థ సవివరంగా ప్రకటించింది. ట్రంప్ కొత్త ఆంక్షల్లో విదేశీ మూలాలున్నవారు సోషల్‌మీడియా ఖాతాల వివరాలు కూడా ఇవ్వాలని ఆదేశించడం గమనించదగింది.

మోడియా లీలలు..
మోడీ సర్కారు మీడియాపై ఉక్కు పిడికిలి అంతకంతకూ బిగిస్తున్న పరిస్థితి. మీడియా స్వేచ్ఛకు సంబం ధించిన సూచికలో మన దేశం 180 దేశాలలో 157 వ స్థానంలో వుంది. ఈ విషయమై ఆర్జేడీ సభ్యుడు మనోజ్‌కుమార్ పార్లమెంటులో ప్రశ్న వేస్తే సమాచార పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎల్ మురుగన్ సమా ధానమే దాటేశారు. దేశంలో 1,54,000 ప్రచురణలు నడుస్తున్నాయనీ,700 ప్రయివేటు టీవీ ఛానళ్లు వున్నాయనీ, అసంఖ్యాకమైన యూట్యూబ్ ఛానళ్లున్నాయని ఏవేవో లెక్కలతో సరిపెట్టారు.1995 కేబుల్‌ టీవీ నెట్‌వర్క్, 2021 ఐటి చట్టం దేశంలో మీడియాకు వర్తిస్తాయని పైపైనే జవాబిచ్చారు. అంతేగాని మీడియా స్వేచ్చకు సంబంధించి ఎందుకు వెనకబడి పోయామన్నది మాత్రం మాట్లాడలేదు. ఎమర్జన్సీ యాభై ఏండ్ల సందర్భంలో అప్పటి సెన్సార్‌షిప్‌ను అప్రజాస్వామిక పోకడలను ఖండించేప్పుడు ప్రస్తుత పరిస్థితి అంతకన్నా అధ్వాన్నంగా వుందని మీడియా విమర్శకులు సోదాహరణంగా చెబుతున్నారు. వాస్తవానికి భారత ప్రధాన మంత్రిగా మోడీ ఇంతవరకూ ఒక్క మీడియా గోష్టి కూడా జరిపింది లేదు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా వుండగా 2002 జాతి హత్యాకాండ గురించి గట్టిగా అడిగినందుకు టీవీ ఇంటర్య్యూ నుం‌చి లేచిపోయారు. దానినుంచి మీరు నేర్చుకున్న గుణపాఠమేమిటని ఎవరో అడిగితే మీడియా మేనేజ్‌మెంటు బాగా చేసి వుండాల్సిందన్నారు.

అంతేగానీ మత రాజకీయాలు పాలనలో ప్రజాస్వామ్యం వంటివాటి జోలికిపోలేదు. ప్రధాని అయ్యాక మోడీ ఆ పాఠమే అమలు చేసి నిర్ధాక్షిణ్యంగా నిక్కచ్చిగా మీడియా మేనేజిమెంటు మొదలెట్టారు. అస్మదీయ మీడియాకు వేల కోట్ల రూపాయల అడ్వర్టయిజ్‌‌మెంట్లు ఇస్తూ గోడీ మీడియాను సృష్టించుకున్నారు. టీవీ ఛానళ్లు, పత్రికలు మొత్తంగా గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. సోషల్‌మీడియాలో సంఘ పరివార సామ్రాజ్యమే ఏర్పాటు చేసుకున్నారు. మోడీ భజన, ప్రత్యర్థులపై ప్రగతిశక్తులపై విష విద్వేష ప్రచారానికి అవి పనిముట్టుగా మార్చుకున్నారు. ఈ నియంత్రణలు, ప్రలోభాల మధ్య మీడియా మోడియాగా మార్చివేయబడింది. తమాషా ఏమంటే ఇదే మోడీ తను విడుదల చేసిన వీడియోను మెటా ప్రసారం చేయకుండా ఆపినందుకు నోటీసులు జారీ చేశారు. మరోమంత్రి నితిన్ గడ్కరీ తనపై ఆరోపణలను తొలగించాలంటూ సోషల్ మీడియా ప్లాట్‌పాం లన్నిటికీ నోటీసులు జారీచేశారు. మోడీకి సన్నిహితుడుగా పేరొందిన అదానీ మిగిలిన రంగాలను ఆక్రమించ డంతో పాటు మీడియాలోనూ నలభై శాతం కైవశం చేసుకున్నారు. తెలుగులో మరిన్ని ప్రముఖ సంస్థలు స్వాధీనం చేసుకోవడానికి ఒత్తిడి పెడుతున్నారు.

కేసులు.. ఆంక్షలు
అదానీపై అమెరికా మీడియాలో కథనాలు ఆరోపణలు వచ్చినా మన దేశంలో మాత్రం బడా మీడి యాలో ఆపగలిగారు. ఇంతచేసినా కొరకరాని కొయ్యల్లా మారిన న్యూస్‌క్లిక్, వైర్ వంటివాటి విషయంలో ఏం జరిగిందేమిటో దేశమంతా చూసింది. అయితే రెండు మూడేండ్ల పాటు ప్రబీర్ పుర్కాయస్తను వేధించిన తర్వాత ఇటీవలనే కోర్టులో ఆయనకు పూర్తి ఉపశమనం లభించడమే గాక ప్రభుత్వం అభిశంసించబడింది. వైర్‌లో ఆపరేషన్ సిందూర్ కథనాలు తీసివేయించడమే గాక కొంతకాలం అందుబాటులో లేకుండా చేశారు. ఉత్తర ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కనీసం పదిహేను మంది జర్నలిస్టులపై నిర్బంధానికి పాల్పడి నోరు నొక్కేందుకు ప్రయత్నించింది, అరెస్టులు చేసింది. ఆఖరుకు మామూలు యూట్యూబర్లను కూడా ప్రభుత్వాలు వదలిపెట్టడం లేదు.
ఏపీ, తెలంగాణలలోనూ జర్నలిస్టులు అరెస్టులకు గురయ్యారు. దేశంలో ప్రసిద్ధ రచ యితలుగా స్టార్టప్ కమెడియన్లుగా వున్నవారు కూడా ఈ ఉచ్చులో చిక్కిపోయి కోర్టుల చుట్టూ తిరుగుతూ వుండాల్సి వస్తున్నది. ప్రయివేటు కేసులకు పోలీసులు ఎక్కడ లేని విలువనిచ్చి ఆగమేఘాల మీద వారి నోరు నొక్కేందుకు దిగిపోతున్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవలనే ఒక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది.

సనా తనంపై కాస్త విమర్శ చేసినా, కార్పొరేట్ సంస్థల నిర్వాకాలపై లోతైన కథనాలు ప్రసారం ప్రచురణ చేసినా దాడులు, కేసులు చుట్టుముడుతున్నాయి. ఈ స్థాయిలో నిలబడలేక ఒత్తిళ్లకు తలొగ్గేవారు. ప్రలోభాలకు లోబడి పోయేవారు చాలామంది..బూతులు, మతపరమైన దుర్భాషలు ఏవి ఎప్పుడు ఎవరు చేసినా సమర్థనీయం కాదు. ఎవరు అధికారంలో వున్నా వ్యక్తిగతంగా నాయకులను మహిళలను దళిత వర్గాలను కించపర్చడం తప్పు, అలాంటి వాటిపై చర్యతీసుకోవడానికి వున్న చట్టాలు సరిపోతాయి తప్ప ‘ఉపా’ వంటి నిరంకుశ చట్టా లను తవ్వితీయనవసరం లేదు. రాజకీయ కక్షసాధింపులు ఎప్పుడూ అనుమతించరానివి. ఈ విషయాలలో ఒకే విధమైన ప్రమాణాలు పాటించాలి గానీ మతాన్ని బట్టి, మనుషులను బట్టి, పార్టీలను బట్టి మార్చకూడదు.

విలువలతో ముందుకు..
భారత దేశంలో భిన్నమతాలు విశ్వాసాలు వున్నాయి. కనుక పరస్పర గౌరవం సామరస్యం కీలకం. అలాగే ఇంత పెద్ద దేశంలో ప్రజావరణాన్ని కుదించే ప్రయత్నాలు, ప్రజాఉద్యమాలపై నిర్భంధాలు కూడా ఏ విధం గానూ అనుమతించరానివి. మీడియా కూడా సామాజిక బాధ్యత గుర్తించి ప్రజా సమస్యలపైనా, ప్రజా వనరుల పరిరక్షణపైన దృష్టి కేంద్రీకరించాలంటే ప్రత్యామ్నాయ శక్తుల వల్లనే సాధ్యమవుతుంది. ఆ శక్తులనూ అలాంటి ప్రయత్నాలను సదా బలపరుస్తున్నందునే ‘నవతెలంగాణ’ అందరి గౌరవం పొందగలిగింది. ప్రజల గొంతు కాగలిగింది. దాన్ని రెండుచేతులా ఆహ్వానించిన శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులూ పదకొండేండ్ల అనుభవాలతో ఈ కృషిలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నారు.

తెలకపల్లి రవి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -