రంగాయిపల్లి, చెట్ల గౌరవరంలో పోస్టుకార్డు ఉద్యమం
కలెక్టర్‌కు వెయ్యికి పైగా ఉత్తరాలు
మా ప్రాణాలు, పిల్లల భవిష్యత్ కాపాడాలంటూ విజ్ఞప్తి
నవతెలంగాణ-తూప్రాన్/మనోహరాబాద్
తీవ్ర కాలుష్యకారక ఎం.ఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమను మా ప్రాంతం నుంచి తొలగించి, మా ప్రాణాలు, పిల్లల భవిష్యత్‌ను కాపాడాలని కోరుతూ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయి పల్లి, చెట్ల గౌరారం గ్రామ ప్రజలు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని చేపట్టారు. శుక్రవారం వెయ్యికి పైగా పోస్ట్‌కార్డులను కలెక్టర్‌కు రాసి పంపారు. తీవ్ర కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమను అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు అనేక రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. ఈ ఉద్యమానికి బీఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి వంటేరు ప్రతాపరెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ వాయు, జల, శబ్ద కాలుష్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. కాలుష్య ప్రమాదంతో అనారోగ్యా నికి గురవుతున్న ప్రజలను కాపాడాలని, ప్రజాభిప్రాయం మేరకు పరిశ్రమను అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో విషపూరిత కాలుష్యంతో 20 ఏండ్లుగా పంటలు పండించుకోలేని పరిస్థితి ఏర్పడిందని, దీంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు. పొలాల్లోకి కాలుష్య జలాలు చేరడంతో రైతు, కూలీలు ఆ జలాల్లోనే పొలం పనులు చేస్తుండడంతో చేతులు, కాళ్లు చెడిపోయి చర్మవ్యాధుల బారిన పడుతున్నారని తెలిపారు. చెరువుల్లో చేపలు చనిపోతున్నాయని, దీంతో మత్స్య కారులు వృత్తిని కోల్పోయి ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విషపూరితమైన కాలుష్య ప్రభా వంతో మహిళలు గర్భస్రావ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. కంపెనీ కాలుష్యం వల్ల సంతానం కలగని దుస్థితి నెలకొందన్నారు. ఇంత జరుగుతున్నా జిల్లా యంత్రాంగం తమ కష్టాలను పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. కాలుష్య సమస్యలపై మెదక్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చామనీ, వందలాదిమంది గ్రామస్తులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించినా అధికారుల్లో స్పందన లేకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా రెండు గ్రామాల నడిబొడ్డున ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, ఎంఎస్ అగర్వాల్ కంపెనీని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఇమాపురం శేఖర్ గౌడ్, పాలాట సర్పంచ్ నీలం సాయికుమార్ గౌడ్, పరికి బండ మాజీ సర్పంచ్ పూల అర్జున్, జిల్లా ఉప సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు పంచమి రేణు కుమార్, నాయకులు పొట్టోల్ల వెంకట్ గౌడ్, లింగారెడ్డిపేట శ్రీనివాస్ గౌడ్, పంజా బీక్షపతి, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
ఎంఎస్ అగర్వాల్ పరిశ్రమను తొలగించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



