- ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి హామీతో సద్దుమణిగిన ఆందోళన
నవతెలంగాణ-మద్నూర్: మద్నూర్ మండలం హెచ్ కేలూర్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఒకరి షెడ్డు ఎలా తొలగిస్తారని, తొలగిస్తే ప్రతి ఒక్కరీ అక్రమ కబ్జాలు తొలగించాలని డిమాండ్ చేస్తూ వీరేశం కుటుంబానికి మాజీ సర్పంచులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలుపుతూ శనివారం నాడు గ్రామపంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్ షిండేను నిర్బంధం చేశారు. వీరేశం అనే వ్యక్తి షెడ్డును కూల్చివేయాలని గ్రామపంచాయతీ తీర్మానిస్తూ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆ నోటీసులు ఆ గ్రామంలో వివాదానికి దారితీసింది.
ఈ ఆందోళనలో వీరేశం కుటుంబీకులు మాట్లాడుతూ… ఎన్నికల్లో ఓట్లు వేయలేదని కక్షతో గ్రామ సర్పంచ్ తమపై కక్షగట్టి తమ షెడ్డును తొలగించడానికి తీర్మానం చేస్తూ నోటీసులు ఇచ్చారని, తాము ఒక్కరే అక్రమ కబ్జాకు పాల్పడలేదని, తమ గల్లీలో మొత్తం అక్రమ కబ్జాలకు పాల్పడినప్పటికీ, కక్ష సాధింపు తో షెడ్డు తొలగించడానికి పంచాయతీ పాలక వర్గం తీర్మానించిందన్నారు. బాధిత కుటుంబానికి ఆ గ్రామ మాజీ సర్పంచులు మద్దతు తెలుపుతూ గ్రామ కార్యదర్శిని నిర్బంధించారు. ఈ ఆందోళనలో గ్రామ మాజీ సర్పంచులు గ్రామస్తులు మాట్లాడుతూ సర్పంచ్ చేపడుతున్న కక్ష సాధింపు చర్యలకు ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఆందోళన గురించి గ్రామ కార్యదర్శి మండల ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడంతో ఆయన హుటా హుటిన కెలూర్ గ్రామపంచాయతీని సందర్శించారు.
పంచాయతీ ఎదుట ఆందోళన చేపడుతున్న వీరేశం కుటుంబీకులతో అలాగే మాజీ సర్పంచులతో మాట్లాడారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఈ ఆందోళన మరింతగా ఉధృతం అయ్యే దిశగా కనిపించడంతో ఎంపీడీవో గ్రామ కార్యదర్శి విజయ్ కుమార్ షిండేకు ఆదేశిస్తూ ఆందోళన కారుల ఫిర్యాదు మేరకు ప్రతి ఒక్కరికి నోటీసులు జారీ చేయమని ఆదేశించారు. నాలుగు రోజులు సమయం తీసుకోవాలని, వారి వివరాలు వచ్చిన తర్వాత ఎంపీడీవో, తాసిల్దార్, ఎస్సై డి ఎల్ పి ఓ సమావేశంలో ఈ సమస్యను చర్చించి తగిన నిర్ణయం తీసుకునే వరకు ఎలాంటి కూల్చివేత చేపట్ట రాదని ఆదేశించడంతో.. ఎంపీడీవో ఇచ్చిన హామీకి ఆందోళన కారులు గ్రామ కార్యదర్శి నుండి రాతపూర్వకంగా హామీ కావాలని డిమాండ్ చేశారు. దీంతో కార్యదర్శి నుండి రాతపూర్వకంగా హామీ తీసుకున్నారు. ఎంపీడీవో హామీ ఆందోళనకు విరమించారు.



