Sunday, August 2, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘ఫ్ర్యాండ్స్’

‘ఫ్ర్యాండ్స్’

- Advertisement -

రాత్రి గాఢమైన నిద్రలో ఉన్నాడు పుష్ప! హఠాత్తుగా పన్నెండు గంటలకు ఫోన్‌లో నోటిఫికేషన్‌ వచ్చింది! దాంతో దిగ్గున లేచి, ఫోన్‌ చూసుకున్నాడు. పెద్దాయన చేసిన రీల్‌ ఇన్‌స్టాగ్రాంలో వస్తోంది. ఇయర్‌ ఫోన్స్ పెట్టుకుని పదే పదే చూసుకున్నాడు. జెన్‌ జడ్ కుర్రా‌ళ్ల రీల్స్ కన్నా పెద్దాయన రీల్ ఎంతో నచ్చింది. ఒక్కోమాట ఎంత బావస్ఫోరకంగా ఉందో? ఒక పదానికి మరో పదానికి మధ్య పెద్దాయన ఇచ్చిన గ్యాప్‌ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంది! ఫోన్‌ కెమెరాను మొఖానికి మరీ దగ్గరగా పెట్టుకోవడం కండ్లలో పలికిన స్పష్టమైన భావాలు పుష్పను కట్టిపడేశాయి. పెద్దాయన మొట్టమొదటిసారిగా ఇన్‌స్టాలో చేసిన రీల్‌ బుల్లెట్‌లా దిగిందని పుష్ప పొంగిపోయాడు. వ్యూస్‌ లక్ష‍ల్లో వస్తాయని పుష్ప గట్టిగా అంచనా వేశాడు. పెద్దాయన గొంతు, డైలాగు డెలివరీ పుష్పకి పిచ్చి, పిచ్చిగా నచ్చేశాయి. ముఖ్యంగా ‘ఫ్య్రాండ్స్’ అన్న డైలాగ్‌ ఎంతో బాగుందని పుష్ప ఫిక్సయిపోయాడు. కచ్చితంగా ఇది ట్రెండ్ సెట్ చేస్తుందని, గెస్ చేశాడు. ఈ ఒక్క డైలాగ్‌తో జెన్ జెడ్ మొత్తం పెద్దాయన ఫ్యాన్స్ అయిపోతారని అనుకుంటూ తెల్లవారుజామున నాలుగు గంటలకు నిద్దురపోయాడు. పొద్దున ఎనిమిది గంటలకు లేచి ‘‘ఫ్ర్యాండ్స్’’ అంటూ బయటకు వచ్చాడు. వంట చేస్తున్న భార్య వద్దకు వచ్చి ‘‘గుడ్ మార్నింగ్ ఫ్ర్యాండ్స్’’ అన్నాడు.

వందన వంట చేసే హడావుడిలో వచ్చిన పుష్పను సరిగ్గా పట్టించుకోలేదు. పుష్ప వెళ్లి రెడీ అయి వచ్చాడు. అప్పటికే కొడుకు స్కూల్ బ్యాగ్ వేసుకుని బండి వద్ద సిద్ధంగా ఉన్నాడు. ‘‘గుడ్ మార్నింగ్ ఫ్ర్యాండ్స్” అన్నాడు పుష్ప కొడుకుతో. నానిగాడు తండ్రిని గుర్రుగా చూశాడు.

‘‘ఈ రోజు బాగా లేటయ్యింది! ప్రిన్సిపల్ సార్‌ని కలిసిన తర్వాతే క్లాస్‌కి వెళ్ళాలి!’’ అన్నాడు సీరియస్ గా. తండ్రీ కొడుకులు స్కూల్‌కి వెళ్లారు! ప్రిన్సిపల్ రూములోకి వెళ్లారు! ప్రిన్సిపల్‌ను చూడంగానే ‘‘హాయ్ ఫ్ర్యాండ్స్’’ అన్నాడు పుష్ప. ప్రిన్సిపల్ అటూ ఇటూ చూశాడు.

‘‘అటూ ఇటూ చూస్తున్నరేం! మిమ్మల్నే ఫ్ర్యాండ్స్!’’ అన్నాడు పుష్ప. నానిగాడు తలబాదుకున్నాడు. డాడీకి ఏమైంది ఇట్లా మాట్లాడుతున్నాడు. ఈ రోజు ప్రిన్సిపల్ సార్ క్లాస్ పీకుతాడు అనుకుంటున్నాడు. ఇంతలో ఇద్దరు టీచర్లు ప్రిన్సిపల్ గదిలోకి వచ్చారు. దాంతో తండ్రీ కొడుకులను వెళ్లమంటూ సైగ చేశాడు. హమ్మయ్యా అనుకుంటూ నానిగాడు క్లాస్ రూంలోకి వెళ్లిపోయాడు.
పుష్ప కూడా ఆఫీసుకి బయల్దేరాడు. మధ్యలో పెట్రోల్ అయిపోయింది. దాంతో పెట్రోల్ బంక్ వద్ద వెళ్లాడు. ఆక్కడ పెద్ద లైవ్ ఉంది. ‘‘హాయ్ ఫ్ర్యాండ్స్! పెట్రోల్ లైను పెద్దగా ఉందికదా!’’ అన్నాడు పక్క బండిమీదున్న బెన్ జెడ్ కుర్రాడితో. వాడు తన తల మీదున్న క్యాప్ తీసి పుష్పకేసి విసిరికొట్టి వెళ్లిపోయాడు. వీడింకా పెద్దాయన రీల్ చూడలేదన్నమాట!’’ అనుకున్నాడు పుష్ప.మొత్తానికి ఆఫీసుకి వెళ్లాడు. ఆఫీసులో అటెండర్ బుచ్చన్న ఎదురొచ్చాడు.

‘‘హాయ్ ఫ్ర్యాండ్స్’’ అన్నాడు పుష్ప బుచ్చన్నతో.
‘‘హాయ్ ఫ్ర్యాండ్స్’’ అంటూ బుచ్చన్న పుష్ప భుజం మీద చేయి వేశాడు.
‘‘రాత్రి పన్నెండు గంటలకు నీవు కూడా పెద్దాయన రీల్ చూశావా’’ అన్నాడు పుష్పఉత్సాహం ఉరకలేస్తుండగా.
‘‘లేదు సార్! గాటైములో నేను మస్తు నిద్ర పోయిన సార్‌’’ అన్నాడు బుచ్చన్న .
‘‘మరి హాయ్ ఫ్ర్యాండ్స్ అని ఎందుకన్నావు?’’ అడిగాడు పుష్ప తన భుజం మీది నుండి బుచ్చన్న చేయిని తీసేస్తూ.
‘‘మీరు అన్నారని నేను కూడ అన్నా సార్!’’ అన్నాడు బుచ్చన్న.
‘‘అంతేనా!’’ అంటూ నీరసంగా వెళ్లి సీట్లో కూలబడ్డాడు పుష్ప. టేబుల్ మీదున్న ఫైళ్లు తీసుకుని చక చకా పూర్తి చేశాడు. దాదాపు పదిహేను ఫైళ్లను పది నిమిషాల్లో పూర్తి చేశాడు. తర్వాత బెల్ కొట్టాడు. బుచ్చన్న వచ్చి ఫైళ్లన్నీ తీసుకెళ్లాడు. పావు గంట తర్వాత బుచ్చన్న వచ్చి ‘‘బాస్ పిలుస్తున్నాడు సార్ !’’ అన్నాడు. పుష్ప బాస్ ఛాంబర్ కి వెళ్లి మెల్లిగా డోర్ తీశాడు. లోపలికి రమ్మన్నట్లు చూశాడు బాస్. లోపలికి వెళుతూనే ‘‘హేయ్ ఫ్య్రాండ్స్!’’ అన్నాడు పుప్ప. టేబుల్ మీదున్న పేపర్ వేయిట్‌ను పుష్ప కేసి విసిరి కొట్టాడు బాస్. పుష్ప దాన్ని ఒడుపుగా క్యాచ్ పట్టుకున్నాడు.

‘‘చూశారా ప్ర్యాండ్స్’’ అన్నాడు పుష్ప. ఈసారి ఫైల్ విసిరి కొట్టాడు బాస్.ఫైల్ కూడా క్యాచ్ పట్టుకుందామని ట్రై చేసి, ఫేయిలయ్యాడు.
‘‘ఫైల్ క్యాచ్ పకడ్నేకే మామూలీ బాత్ నహీ హై’’ అన్నాడు పుష్ప. పెద్దాయన రీల్‌‌ను బాస్ చూడనట్లు ఉందని మనసులో అనుకుంటూ!
ఇడియట్! ఫైల్లో ఏం రాశావో చదువు! అన్నాడు బాస్.
ఫైల్ తీసి చూశారు! ‘‘హాయ్ ప్యాండ్స్!’’ అని రాసి ఉంది. అది తన చేతిరాతే! బుచ్చన్న మిగిలిన పద్నాలుగు ఫైళ్లు తీసి చూపించాడు! అన్ని ఫైళ్లలో ఒకే ఒక్క వాక్యం రాసి ఉంది! హాయ్ ఫ్ర్యాండ్స్!
సార్! పెద్దాయన రీల్…. అంటూ ఏదో చెప్పబోయాడు పుష్ప.
‘‘గెట్‌ అవుట్!’’ అన్నాడు బాస్ ఆగ్రహంతో.
పుష్ప బయటకు నడిచాడు. పెద్దాయన రీల్‌ను బాస్ ఇంకా చూడలేదని స్పష్టమైపోయింది. పెద్దాయన రీల్ చూడలేదంటే, బాస్ కచ్చితంగా దేశద్రోహే! డౌట్ లేదు! బాస్‌కి కచ్చితంగా పాకిస్తాన్, చైనా నుండి నిధులు వస్తుండవచ్చు. అందుకే ఇటీవలే కొత్త కారు కొన్నాడు. ఆ కారు ఎలక్ట్రిక్ కారు! ఇ20 పెట్రోల్ పోయించు కోవాల్సిన అవసరం కూడా లేదు! బాస్ దేశద్రోహి అనటానికి ఇంతకన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుంది? అనుకున్నాడు.
లంచ్ టైములో బాస్ నుండి మరోసారి పిలుపు వచ్చింది. పుష్ప వెళ్లేసరికి బాస్‌కి స్విగ్గీ నుండి ఏదో ఫుడ్ ఐటం వచ్చింది. దాంతో పుష్ప కన్ఫర్మ్ చేసుకున్నాడు. బాస్ కచ్చితంగా దేశద్రోహే! అందుకే ఎవరో ముస్లీం దేశాల నుండి బాస్ కోసం ఫుడ్ ఆర్డర్ చేశారు. అదే అంటున్నాడన్నమాట.
‘‘ఎందుకు పిలిచానో తెలుసా?’’ అడిగాడు బాస్.
తెలియదన్నట్లు తల అడ్డంగా ఊపాడు పుష్ప.
‘‘ఆ ఫైళ్ల మీద హాయ్ ఫ్ర్యాండ్స్ అని ఎందుకు రాశావు?’’ ప్రశాంతంగా అడిగాడు బాస్.
‘‘మీరింకా పెద్దాయన రీల్ చూడలేదా సార్! ఇన్‌స్టాలో రాత్రి పన్నెండు గంటలకు పెట్టారు! ఇప్పటికే పది మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి! ఫ్ర్యాండ్స్‌’’ అన్నాడు పుష్ప.
బాస్ కోపం కట్టలు తెంచుకున్నది.
‘‘బుచ్చన్నా!’’ అంటూ అరిచాడు. బుచ్చన్న లోపలికి రాగానే దగ్గరికి పిలిచి ఏదో చెప్పాడు.
‘‘ఇలా రండిసార్!’’ అంటూ పుష్పను బయటకు తీసుకుని వచ్చాడు బుచ్చన్న.
‘‘రేపటి నుండి ఆఫీసుకు రావొద్దని చెప్పారు బాస్!’’ అన్నాడు బుచ్చన్న.
‘‘హాయ్ ఫ్ర్యాండ్స్!’’ అంటే ఉద్యోగం తిసేస్తారా? అడిగాడు పుష్ప.
‘‘హాయ్ ఫ్ర్యాండ్స్!’’ అన్నందుకు కాదు, బాధ్యత మరిచినందుకు ఉద్యోగం తీసేసారు సార్!’’ అంటూ వెళ్లి పోయాడు బుచ్చన్న.

– ఉషాకిరణ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -