Saturday, August 1, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిప్రశ్నిస్తున్న ‘జెన్ ఆల్ఫా’

ప్రశ్నిస్తున్న ‘జెన్ ఆల్ఫా’

- Advertisement -

ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన అనేది కేవలం అసంతృప్తి వ్యక్తీకరణ మాత్రమే కాదు, పాలనలో ఉన్న లోపాలను సమాజం దృష్టికి తీసుకువచ్చే రాజ్యాంగబద్ధమైన ప్రజా స్వరం కూడా. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై ‘జెన్ జీ’ యువత చేపట్టిన శాంతియుత ఉద్యమాలు ప్రజా చర్చలకు కొత్త దిశను చూపించాయి. ఇప్పుడు అదే చైతన్యం 2012 తర్వాత జన్మించిన ‘జెన్ ఆల్ఫా’ పాఠశాల విద్యార్థులలోనూ కనిపించడం ఒక ముఖ్యమైన సామాజిక పరిణామంగా మారుతోంది. జంతర్ మంతర్ వంటి వేదికలపై యువత వ్యక్తం చేసిన హక్కుల చైతన్యం, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులు వ్యక్తం చేస్తున్న విద్యా సంబంధిత నిరసనలతో పోల్చదగిన సామాజిక చైతన్య ధోరణిని సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. విద్య, ఉపాధ్యా యుల లభ్యత, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, తరగతి గదుల వంటి ప్రాథమిక అవసరాల కోసం చిన్నారులు స్వరం వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడితే, అది కేవలం ఒక ప్రాంతీయ సమస్యగా కాకుండా దేశ విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక సవాళ్లను గుర్తు చేసే సంకేతంగా చూడాల్సిన అవసరం ఉంది. అక్షర నిలయాల్లో అంధకారం!రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వెలుగులోకి వచ్చిన కొన్ని సంఘటనలు గమనార్హం.

ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత కారణంగా విద్యార్థులు బడికి తాళం వేసి నిరసన వ్యక్తం చేయడం, మరోచోట తాగునీరు, విద్యుత్ పంకాలు, బెంచీలు, శుభ్రమైన మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాల కోసం విద్యార్థులు ధర్నాకు దిగడం వంటి ఘటనలు విస్తృత చర్చకు దారితీశాయి. ఈ సంఘటనల అనంతరం సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి కొన్ని సదుపాయాల కల్పనపై హామీలు ఇవ్వడం, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను పరిపాలనా యంత్రాంగం మరింత దగ్గరగా పరిశీలించాల్సిన అవసరాన్ని సూచిస్తుంది. ఒకవైపు దేశవ్యాప్తంగా విద్యా రంగంలో నమోదు శాతం, డిజిటల్ విద్య, కొత్త విద్యా విధానం వంటి అంశాల్లో పురోగతి గురించి చర్చ జరుగుతుండగా, మరోవైపు కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికీ మౌలిక వసతులు, ఉపాధ్యాయుల లభ్యత వంటి ప్రాథమిక అంశాలే సవాలుగా మిగిలి ఉండటం ఆలోచనీయ విషయం. విద్యా హక్కు కేవలం పాఠశాలలో ప్రవేశంతోనే పూర్తికాదు; నాణ్యమైన బోధన, సురక్షితమైన వాతావరణం, అవసరమైన వసతులు కల్పించినప్పుడే ఆ హక్కు ఆచరణలో సార్థకమవుతుంది.​వివాదాలకంటే… విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం!విద్యార్థుల నిరసనలపై దేశవ్యాప్తంగా రాజకీయ, పరిపాలనా స్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవు తున్నాయి. ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు విద్యార్థుల ఆందోళనలను ప్రజాస్వామ్య హక్కుల వ్యక్తీకరణగా అభివర్ణిస్తూ, విద్యా రంగంలోని సమస్యలపై ప్రభుత్వాలు మరింత బాధ్యతతో స్పందించాలని కోరుతున్నాయి. మరోవైపు అధికార పక్షం శాంతిభద్రతల పరిరక్షణ, చట్టబద్ధ పరిపాలన, ప్రజా ఆస్తుల రక్షణ కూడా ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యతేనని పేర్కొంటోంది.

ప్రజాస్వామ్యంలో ఈ రెండు అంశాలు పరస్పర విరుద్ధాలు కావు. శాంతియుతంగా అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఎంత ముఖ్యమో, చట్టబద్ధమైన శాంతిభద్రతలను కాపాడడం కూడా అంతే ముఖ్యం. అయితే, విద్యార్థులు లేవనెత్తుతున్న అంశాలు ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల లోపం, విద్యా నాణ్యత వంటి ప్రజా ప్రయోజనాలకు సంబంధించినవైతే, వాటిని కేవలం రాజకీయ చర్చలకే పరిమితం చేయ కుండా, ఆధారపూర్వకంగా పరిశీలించి, సంబంధిత అధికారులు సమయానుకూలంగా పరిష్కార చర్యలు చేపట్టడం సుపరిపాలనకు నిదర్శనంగా నిలుస్తుంది. నిరసనలను అణచివేయడం లేదా మహిమాపరచడం అనే రెండు అంచుల కంటే, వాటి మూల కారణాలను పరిష్కరించే దృక్పథమే ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరుస్తుంది.పసిగొంతుల ప్రతిధ్వనితరగతి గదిలో పెన్ను, పుస్తకం పట్టుకోవాల్సిన చిన్నచేతులు తమ విద్యా హక్కుల కోసం స్వరం వినిపించాల్సిన పరిస్థితి ఏర్పడితే, అది సమాజం మొత్తం ఆత్మపరిశీలన చేయాల్సిన అంశం.

ఈ స్వరాలను వ్యవస్థపై ఆగ్రహంగా మాత్రమే కాకుండా, విద్యా సంస్కరణల అవసరాన్ని గుర్తుచేసే ప్రజాస్వామ్య సంకేతాలుగా కూడా చూడవచ్చు. భారత రాజ్యాంగం కల్పించిన విద్యా హక్కు సార్ధకమవ్వాలంటే పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయుల నియామకం, మౌలిక వసతుల కల్పన, సురక్షితమైన విద్యా వాతావరణం, సమర్థవంతమైన పర్యవేక్షణ వ్యవస్థ వంటి అంశాలపై నిరంతర దృష్టి అవసరం. ప్రతి నిరసన వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులను నిష్పాక్షికంగా పరిశీలించి, పిల్లల శ్రేయస్సును కేంద్రబిందువుగా ఉంచిన విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం పాలకులు, విద్యాశాఖ, సమాజం అందరి ఉమ్మడి బాధ్యత. నేడు వినిపిస్తున్న ‘జెన్ ఆల్ఫా’ స్వరాలను కేవలం అసంతృప్తి వ్యక్తీకరణగా మాత్రమే కాకుండా, విద్యావ్యవస్థలోని సవాళ్లపై దృష్టి సారించే ప్రజాస్వామ్య సంకేతాలుగా కూడా చూడవచ్చు.

ఫిరోజ్ ఖాన్, 9640466464

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -