Sunday, August 2, 2026
E-PAPER
Homeసోపతి'అజ్ఞాత'(న) శక్తి ఇంకెంత కాలం?

‘అజ్ఞాత'(న) శక్తి ఇంకెంత కాలం?

- Advertisement -

జుట్టుపోలుగాడు : మన సనాతన ‘అజ్ఞాత శక్తి’ని ప్రశ్నించే దమ్ము, ధైర్యం ఎవడికి ఉన్నది? పిల్లకాకులకు ఏం తెలుసు ఉండేల్‌ దెబ్బ? ఈ జెన్‌ జి గాళ్లెంత? వీళ్ల పోరాటమెంత? మన మధ్య ఉన్న ‘అజ్ఞాత’ శక్తే ఈ ధర్మేంద్ర ప్రధాన్‌ను నడిపిస్తుంది. మీరు నాకు టోపీ పెట్టి, దండలేసి గౌరవిస్తున్నది అందులో భాగమే. జిందాబాద్‌! జిందాబాద్‌! అంటూ పార్లమెంటుకు ఆహ్వానిస్తున్నారు. సంతోషం. నేను కేంద్ర విద్యామంత్రి పదవి నుండి వైదొలగినప్పుడు ఎంత క్షోభ పడ్డానో ఈ ప్రపంచానికి వెల్లడించాను. సమస్య పరిష్కారానికి నా వంతు ప్రయత్నం నే చేశా. నా బాధ్యత నుండి నేనెప్పుడూ పారిపోలేదు. విదేశీ మాఫియా శక్తుల కారణంగా విద్యార్థుల భవిష్యత్‌ నాశనం కాకూడదన్న దృఢ సంకల్పంతోనే పని చేశా. మన ప్రధానమంత్రి శ్రీమాన్‌ నరేంద్రమోడీ మార్గదర్శకత్వం, నాపై ఉంచిన నమ్మకానికి నేను సదా కృతజ్ఞుడ్ని. నా ‘అజ్ఞాత’ మనసును అర్ధం చేసుకున్నారు గనుకనే ఈ జయహో నినాదాలు. నాపై ఈ పూల వర్షం.

కేతిగాడు : చోర్‌.. చోర్‌.. పేపర్‌ చోర్‌, శిక్షా చోర్‌, ఓట్‌ చోర్‌, సీట్‌ చోర్‌, అరె ఆలయ చోర్‌, రోజ్‌గారి చోర్‌, అరె కామ్‌ చోర్‌, దేశ భవిష్య చోర్‌. మీరంతా దొంగలు. దేశాన్ని లూఠీ చేస్తున్న బడా బందిపోటు దొంగలు. మీ దొంగ మాటలతో, దొంగ చేష్టలతో మమ్మల్నింకా మోసగించలేరు. ఎప్పటికప్పుడు మీ నయవంచక కుట్రలను పటాపంచలు చేస్తాం. మీ కపటి నాటకాలకు కాలం చెల్లింది. సోషల్‌ మీడియా వాడటం మాకూ చేతనైంది. ‘జిస్సే ఖేల్తాహై ఉస్సే మార్తాహై. నీవు ఏ ఆట ఆడ్తావో, ఆ ఆటే నిన్ను బలికొంటుంది. ప్రశ్నించడం మా అందరి హక్కు. ఆ హక్కు కోసం ఎక్కడెక్కడి వాళ్లమైనా ఒక్కటిగా వచ్చి నిలబడతాం. మాకు మతాలు లేవు, కులాలు లేవు. ప్రాంతాలు లేవు. భరత్‌ భూషణ్‌ తివారీని గమనించలేదా. బీహార్‌ భోజ్‌పూర్‌ జిల్లాకు చెందిన సామాజిక కార్యకర్త. ఒక చేత్తో సెల్‌ఫోన్‌తో మీ దుర్మార్గాలను లోకానికి చూపుతూనే మీ తుపాకీ కాల్పులకు బలైపోయాడు. ఇది ఈ తరం జెన్‌ జి ధైర్యం. ప్రాణాలకు తెగిస్తూనే గాంధీ చూపిన సత్యం – అహింసా మార్గం మాది. నా దేశ ప్రజలకు, రైతులకు, కష్టజీవులకు న్మాయం దక్కాలనే భగత్‌సింగ్‌ విప్లవ తత్వం మాది. అంబేద్కర్‌ రూపొందించిన రాజ్యాంగం మా ఆయుధం. మమ్మల్ని కొట్టగలరు, తిట్టగలరు, దేశద్రోహులని జైల్లో పెట్టగలరు. మహా అయితే చంపగలరు. పరీక్షా పత్రాలు లీక్‌ అయ్యాయని, ఉద్యోగాలు ఇవ్వలేదని ఆత్మహత్యలు చేసుకుని చచ్చేకంటే ఇలా చావడం మంచిది కదా. ‘అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం’. గుర్తుంచుకో. గుజరాత్‌ నరమేధం హీరోలకు, బల్కిస్‌భానో కుటుంబ హంతకులకు, రేపిస్టులకు హారతులిచ్చి స్వాగతం పలికే దుష్ట సంస్కృతి మీది. అదే మీ ‘అజ్ఞాత’ శక్తి అని పొంగిపోతే ఎవడేం చేయలేడు.

బంగారక్క : బాగుంది. భిన్న మనస్తత్వాలను బయటపెట్టగలిగారు. ప్రస్తుతం మన దేశం ఈ సంధియుగంలో ఉన్నది. ఈ జెన్‌ జి పోరాటం నుండి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. సోషల్‌ మీడియా వాస్తవ చిత్రాలతో వారు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం, న్యాయవ్యవస్థ సక్రమంగా స్పందించి జవాబుదారీగా వ్యవహరించాలి. లేకుంటే ఆ చిత్రాల ద్వారా ప్రజలకు న్యాయం తెలిసిపోతున్నది. అందుకే భరత్‌ భూషణ్‌ తివారీ అంత్యక్రియలకు ప్రజలు వేల సంఖ్యలో హాజరయ్యారు. జులై 20న ఛలో పార్లమెంట్‌కు వెల్లువలా ఉప్పొంగారు. ఇక అబద్దాలతో ఎవరినీ ఏమార్చలేరు. సక్రమంగా స్పందించిన వారిని వీళ్లూ హేళన చేస్తారు. చైతన్యవంతమయ్యే ప్రజాస్వామ్యానికి ఇదో సంకేతం. కాగా మనది యువ భారత్‌. బాగా పనిచేసే శక్తి గలిగిన యువత మన దేశంలో నలభై కోట్లమందికి పైగా ఉన్నారు. ఆ యువశక్తిని సక్రమంగా వినియోగించుకుంటే ఈ దేశానికి తిరిగే ఉండదు. ఉత్పత్తి, పొదుపు, పెట్టుబడి, అభివృద్ధి యువశక్తితోనే ముడిపడి ఉంటుంది. జపాన్‌, చైనా, కొన్ని యూరప్‌ దేశాలు మన భారత్‌ లా కాకుండా వృద్ధ దేశాలుగా మారుతున్నాయి. నేడు యావత్‌ ప్రపంచానికే యువశక్తి అవసరం. ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడేందుకు, వృద్ధులను, బాలలను బాధలనుండి విముక్తి కావించేందుకు, ప్రపంచశాంతిని సాధించేందుకు యువశక్తి అనివార్యం. ఈ ఖాళీని పూరించేందుకు మన భారత యువత అగ్రభాగంలో నిలవాలి. ఆ మహదావకాశం మనకు ఉన్నది. అందుకు తగిన విద్యావ్యవస్థను నెలకొల్పి బాటలు వేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ప్రభుత్వం అలా చేయక, ఉద్యమిస్తున్న యువతపై చట్టవిరుద్ధంగా పెల్లుట్లు పేల్చడం, ఎకె 47 గన్‌తో కాల్చడం ఎంత దుర్మార్గం? ఆ ‘అజ్ఞాత’ శక్తే ఈ దుర్మార్గాలు చేయిస్తుంటే యువత ఎందుకు కళ్లు మూసుకుంటుంది? ఎదురుతిరిగి తనకు కావాల్సిన ప్రభుత్వాన్ని తానే నిర్మించుకుంటుంది.

– కె.శాంతారావు, 9959745723

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -