దేశంలో క్రమంగా హరించబడుతోన్న పత్రికా స్వేచ్ఛ
ప్రజల పక్షాన నిలిచిన అగ్రగామి పత్రిక నవతెలంగాణ : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఢిల్లీలో విద్యార్థులు, యువకులు చేపట్టిన జెన్‌జీ ఉద్యమం ప్రతిపక్షాలకు దారిచూపిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. 2029 ఎన్నికల నాటికి దేశ తలరాతను నిర్ణయించేది జెన్‌జీ అని చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి దేశంలో 50 శాతానికిపైగా ఓట్లు జెన్‌జీ కి ఉంటాయని వివరించారు. వారు ప్రభావవంతమైన శక్తిగా ఉంటారని అన్నారు. జెన్‌జీ దెబ్బకు ప్రధాని మోడీ అర్ధరాత్రి ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఢిల్లీలో వాట్సాప్ యూనివర్సిటీ అంకుల్స్‌కు, ఇన్‌స్టాగ్రామ్ పిల్లలకు మధ్య జరిగిన పోరాటంగా అభివర్ణించారు. విద్యార్థులు కేంద్రం మెడలు వంచారని గుర్తు చేశారు. మోడీ ఎవరితోనైతే పెట్టుకోవద్దో వారితోనే పెట్టుకున్నారని చెప్పారు. సోషల్ మీడియాకు హద్దులు ఎవరు గీస్తారని ప్రశ్నించారు.
పత్రికా స్వేచ్ఛపై ఉక్కుపాదం
పత్రికా స్వేచ్ఛపై పాలకులు ఉక్కుపాదం మోపుతున్నారని కేటీఆర్ విమర్శించారు. నిజాలు చెప్పేవారిని జైల్లో పెడుతున్నారని అన్నారు. దేశంలో పత్రికా స్వేచ్ఛ క్రమంగా హరించబడు తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పత్రికల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రభుత్వాలు మీడియాను నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు పెరుగుతున్నాయని అన్నారు. వార్తను వార్తగా రాసే పరిస్థితి లేకుండా పోయిందనీ, కేంద్రమంత్రి కుమారుడిపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు, లగచర్ల ఘటన, హెచ్‌సీయూ భూముల అంశాలను ప్రధాన మీడియా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు.
పాలకులే విద్వేష ప్రసంగాలు మానాలి
ప్రభుత్వంలో ఉన్నవారే ముందుగా విద్వేష ప్రసంగాలను మానాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆ తర్వాతే విద్వేష ప్రసంగాల నిరోధక బిల్లు తేవాలని సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్‌తోపాటు ప్రధాన మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలపై కూడా నిజనిర్ధారణ జరగాలని అన్నారు.
మీడియా స్వేచ్ఛకు పరిమితులొద్దు
మీడియా స్వేచ్చకు పరిమితులుం డొద్దని కేటీఆర్ అన్నారు. పరిమితులు పెడితే భావప్రకటనా స్వేచ్ఛ ఎలా అవుతుందని ప్రశ్నించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మారకపోతే ముందుకెళ్లలేమని చెప్పారు. పరిశోధనా త్మక కథనాలు రావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వాల తప్పులను ఎత్తిచూపాలని కోరారు.
నవతెలంగాణ అగ్రగామి పత్రిక
నవతెలంగాణ 11వ వార్షికోత్సవం సందర్భంగా యాజమాన్యానికి, సంపా దకీయ విభాగానికి, పాత్రికేయులు, డెస్క్ సిబ్బంది, ఫొటోగ్రాఫర్లు, ఉద్యోగులందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రజాస్వామిక దృక్పథంతో కొత్త పేరుతో ప్రారంభమై 11 వసంతాలు పూర్తి చేసుకున్న నవతెలంగాణ అగ్రగామి పత్రిక అని అన్నారు. అస్తి త్వాన్ని చాటుకుంటూ ప్రజా సమస్యలే పరిష్కారంగా ముందుకుపోతున్నదని చెప్పారు. న్యాయం వైపు, ధర్మంవైపు నిలబడాలని కోరారు.



