Sunday, August 2, 2026
E-PAPER
Homeసోపతిఆనాడు మూడు దిక్కులకు వెళ్లిన తెలుగు కళాకారులు

ఆనాడు మూడు దిక్కులకు వెళ్లిన తెలుగు కళాకారులు

- Advertisement -

1920-30 లలో కళలపై ఆసక్తి వున్న తెలుగు విద్యార్థులకు 3 ప్రదేశాలకు వెళ్లగలిగే పేరెన్నికగన్న జాతీయ కళా విద్యాసంస్థలు వుండేవి. ఒకటి దక్షిణాన మద్రాసు స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌. రెండు తూర్పున బెంగాలులో కలకత్తా కళాశాల వున్నా ఎక్కువగా రవీంద్రనాథ్‌ టాగోర్‌ నిర్మించిన శాంతినికేతన్‌కి వెళ్లటానికి ఇష్టపడ్డారు. మూడు పశ్చిమాన ముంబాయిలో జె.జె.స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌. నిజానికి మద్రాసు ఆర్ట్‌ స్కూల్‌ని ముందుకు నడిపించిన దేవీప్రసాద్‌ రారు చౌదరి బెంగాలు పరంపరలో అబనీంద్రనాథ్‌ టాగోర్‌ వద్ద చిత్రం నేర్చుకున్నవారే. కానీ తను శిల్పం కూడా చేశాడు. కొన్ని స్వతంత్ర ఆలోచనా పద్ధతిలో ఈ కళాశాలను ముందుకు నడిపించాడు. ఈ మూడు జాతీయ కళాసంస్థలలో చదువుకున్న వారు, వారి వారి ప్రాంతాలకు తిరిగి వెళ్లి, ఒక్క తెలుగు వారే కాదు, ప్రాంతీయ కళా స్కూళ్లు నిర్మించారు. కొందరు అక్కడ అప్పటికి తెరచిన కళాసంస్థలలో అధ్యాపకులుగా చేరారు.

రాజమండ్రి నుండి దామెర్ల రామారావు జె.జె.స్కూలు బొంబాయిలో చదువుకున్నా శాంతినికేతన్‌ వెళ్లి అక్కడి పద్ధతితో ప్రభావితం అయ్యారు. రాజమండ్రిలో 1923లో చిత్ర కళాశాల ప్రారంభించారు. జె.జె.స్కూల్‌ వారి యూరప్‌ కళాపద్ధతి పోస్ట్‌ – ఇంప్రెషనిజం పద్ధతిన చిత్రం వేసినా ఆయన చిత్రాలలో బెంగాల్‌ వారి ఆలోచనా పద్ధతి కూడా కనిపిస్తుంది. అలాగే హైదరాబాద్‌ నుండి జె.జె.స్కూల్‌ వెళ్లిన పి.టి.రెడ్డి చిత్రాలలో ఆలోచనా పద్ధతి భారతీయ సిద్ధాంతాలైనా, చిత్ర పద్ధతి యూరప్‌ వైఖరి అవగాహన చేసుకున్న పురోగమన పద్ధతి వుంటుంది.

మరో తెలుగువాడు కొండపల్లి శేషగిరిరావు. 1924లో వరంగల్‌ జిల్లా పెనుగొండలో జన్మించి, ఆంధ్ర యూనివర్సిటీ నుండి మెట్రిక్యులేషన్‌ పూర్తి చేశారు. కళల మీద మక్కువతో వరంగల్‌లో దీనదయాల్‌ నాయుడు అనే కళలు నేర్పే అధ్యాపకుడి వద్ద కొంత శిక్షణ పొందారు. ఆపై అదే సమయాన తెరచిన స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ హైదరాబాద్‌లో 1942లో కళల అధ్యయనం కోసం చేరి 1947 వరకు చదువుకున్నారు. అక్కడ చిత్రకళలో డిప్లొమా పొంది దీనదయాల్‌ నాయుడి గారి ప్రోత్సాహం వల్ల శాంతినికేతన్‌ వెళ్లి 1947 – 48లో ఆచార్య నందలాల్‌ బోస్‌ గారి వద్ద చదువుకుని, తర్వాత రాజస్థాన్‌లోని వనస్థలి విద్యాపీఠ్‌లో ఫ్రెస్కో చిత్రం నేర్చుకున్నారు. అనంతరం తిరిగి వచ్చి 1950లో హైదరాబాద్‌లోని స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కళాశాల, తను చదువుకున్న చోటనే అధ్యాపకుడిగా చేరారు. ఈయనకు కళలపై రాసే అలవాటు వుంది. అలంకరణ అనే వ్యాసాల సంపుటి రాసినా అది ప్రచురింపబడలేదు. లేపాక్షి, తాడిపత్రి, హంపి శిల్పకళలపై డ్రాయింగులు చిత్రించి, ‘సురేఖ’ అనే పుస్తకంగా వేశారు.
ఆయన చిత్రాలు, డ్రాయింగులు చూస్తే పెన్‌, పెన్సిల్‌, ఇంకు, కుంచె, రంగులు, ముఖ్యంగా నీటిరంగులు వాడారు. అతి తక్కువ గీతల్లో కూడా ఆయన అర్థవంతమైన చిత్రం గీయగలరు. ఒక జైన సన్యాసిని చిత్రం వంటివి ఎన్నో చిత్రాలు… అవి స్కెచ్‌లో, డ్రాయింగులో తేల్చలేని నిపుణతతో డ్రాయింగు గీశారు. అలాగే స్నేహితులు కబుర్లు చెపుతున్న డ్రాయింగులో ఒకరు కూర్చుని వుంటే, మరొకరు మోచేతి ఆసరాతో సగం వాలి వుంటాడు. మూడవ అతను పూర్తిగా వాలి నిద్ర పోతుంటాడు. ఈ డ్రాయింగులో ఒక వరసక్రమంతో పాటు విరామానికి 3 మెట్లు అని చెప్పినట్టుంటుంది. ఈయన డ్రాయింగు గీతలు ఎంత నాజూకుగా సన్నటి రేఖలో, అంతే బలమైన శిల్పం వంటి గీతలు. ఆ ముగ్గురి ఆరామ ఆనందం, ఆయన తన డ్రాయింగ్‌ గీతలలో చూపారు.
ఆయన వేసిన ఎన్నో చిత్రాలలో బెంగాలు వారి పద్ధతి క్షుణ్ణంగా కనిపిస్తుంది. ప్రకృతిని అందంగా చూపటం కవితా సాహిత్యంలా, పాటలా సాగుతుందా అన్నట్టు చిత్రం వేయటం వారి పద్ధతి. అలాగే చైనా వారు సంతకం చేసినట్టు చిత్రానికి ఒక పక్కగా సంతకం చేయటం బెంగాలు కళాకారుల పద్ధతి. అలాగే శేషగిరిరావు గారు అలవాటు చేసుకున్నారు.

వీరి చిత్రాలు కొన్ని బంజరు, బీడు భూముల మధ్య దక్కను కొండల మధ్య, పేదరికంలో పల్లె జీవులు మేకలు కాచుకుంటున్నా, అవి కొండలెక్కి పరుగులు పెట్టిన దృశ్యాన్ని, నిస్సహాయంగా వాటి వంక చూసే గొర్రెల కాపరి స్త్రీని, తన పూర్తి చిత్రానికి ఈ దృశ్యం అందమైన రూపంగా దిద్దగలిగారు ఈయన. ఇటువంటి వీరి చిత్రాలు చూసి ఇలాంటి ఎండమావుల్లాంటి పరిస్థితులు కూడా అందంగా వుంటాయా, ఏ బాధ లేకుండా అనే అనుమానం రాక మానదు. నిలుచుని వున్న గేదెను చైనా వారి డ్రాయింగ్‌లా నల్ల ఇంకు పెద్ద కుంచె వెడల్పు గీతల్లో చిత్రించారు. మోడువారిన కొమ్మ వున్న చివరి ఆకులు గాలికి ఊగుతుంటే, వాటిని అందంగా చిత్రించిన చిత్రం చూసి ఇవీ ఇంత అందంగా వుంటాయా అనిపిస్తుంది.
మన పురాణేతిహాసాల చిత్రాలు మరో వివరణతో వుంటాయి ఈయన కుంచెలో. దమయంతి అనే చిత్రంలో రంగుల మేళవింపు, అగ్నిలా లేచి నిలుచుని కదులాడుతున్న చెట్లు, రాళ్లు కొండల మధ్య ఒక చెట్టును ఆసరా చేసుకుని వాలి వున్న దమయంతి చిత్రం, ఆమె వ్యధనీ, నలుడి కోసం వేచి వున్న ఆమె నిస్సహాయత, ఆమె చుట్టూ వున్న నీరు, గాలి, చెట్లలో ప్రతిబింబిస్తోంది అనిపిస్తుంది.
ఆ సమయాన కళాకారులు నిరూప (అబ్‌స్ట్రాక్ట్‌) చిత్రం వేయటమూ, అలాగే క్యూబిజం అనే పద్ధతిన చిత్రం వేయటమూ తరచుగా కనిపించేది. ‘కోరిక, మరణం’ అనే చిత్రం నిరూప చిత్రం ఈయనది. నిజమే కదా. కోరిక, మరణం అనే పదాలకు రూపం ఎవరికి తెలుసు. అవి నిరూప చిత్రంగా భావయుక్తంగా చూపారనిపిస్తుంది. క్యూబిజంలో ఆకారాన్ని త్రికోణం, చతురస్రం, దీర్ఘచతురస్రం వంటి రూపాలుగా చూస్తూ చిత్రం వేస్తారు. ఈయన చిత్రాలలో ఆ క్యూబిజం అంత పట్టు అందుకోలేదేమో మరి. ఈయన ఆలోచనా సరళికి ఆ పద్ధతి అద్దం పట్టలేదు.
ఈయన సాహిత్యం కథనాలు తీసుకుని వేసిన చిత్రాలు వరూధిని- ప్రవరాఖ్య, పాండవుల అరణ్యవాసం, మోహిని వంటి చిత్రాలలో అందాలొలికే చిత్రాలు, నాట్య భంగిమల రూపాలూ అందం అనే పదానికి ఆయన ఇచ్చే నిర్వచనంలా వుంటాయి. ఈ చిత్రకారుడి మరో రకం చిత్రాలు చెప్పుకోవలసిన భావప్రకటనతో చిత్రించారు. పెద్ద వృక్షాల కాండాలు, బయటకు తేలి నేలపై పాకిన బలమైన వేర్లు, కొమ్మలు ఆయన వాటిని ప్రతి అంగుళమూ పరీక్షించి డ్రాయింగులు వేశారు. అవి ఏవో పాత కథలు, జరిగిన పురాతన విషయాలు, అవి జరిగిన కాలానికి సాక్షి కథలు చెపుతున్నాయా అన్నంత భావయుక్తంగా ప్రతి గీతా గీశారు. ఈయన ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. ఎంతో మంది విద్యార్థులను కళాకారులుగా తీర్చి దిద్దారు. ఎన్నో సంస్థలలో, దేశ విదేశాలలో ఆయన చిత్రాలు పొందుపరచి వున్నాయి. 2012లో ఈయన కన్నుమూశారు.

మరో తెలుగు కళాకారుడు, కళలపై ప్రేమతో ముందుకు అడుగేసిన వారు అంత్యాకుల పైడిరాజు. ఈయన బొబ్బిలిలో 1919లో జన్మించారు. 1940 నుండి 44 వరకు మద్రాసులోని కళా పాఠశాల స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌లో చేరి చిత్రకళ అభ్యాసం చేశారు. 1941లో విద్యార్థిగా వున్నప్పుడే ఆంధ్ర మహాసభ మద్రాసు వారు నిర్వహించిన ప్రదర్శనలో బంగారు పతకం గెలుచుకున్నారు.
1944లో ప్రథమ శ్రేణి విద్యార్థిగా చదువు పూర్తి చేశాడు. మద్రాసు కళా పాఠశాలలో దేవి ప్రసాద్‌ రారు చౌదరి వలన, బెంగాలు ప్రభావం చూశారు. శాంతి నికేతన్‌ వంటి ముఖ్య కళాక్షేత్రాలు దర్శించి కళల అవగాహన చేసుకున్నారు. ఈయనా బెంగాలు వారికి మల్లే చైనా వారి కలీగ్రఫీ పద్ధతిన సంతకం చేయటం, వెడల్పు బ్రష్‌ గీతల చిత్రాలు వేశారు.
1949లో విజయనగరంలో ఆర్ట్‌ స్కూల్‌ పెట్టి ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పెట్టినప్పుడు, అందులో చిత్రకళా విభాగానికి అధ్యాపకుడిగా నియామకం అయ్యారు.
మద్రాసు ఆర్ట్‌ స్కూల్లో ఒక్క బెంగాల్‌ వారి పద్ధతినే కాకుండా, స్థానిక జానపద విషయాలనూ చిత్ర పద్ధతిగా తీసుకుని ముందుకు నడిచారు. పైడిరాజు తెలుగు వారి నిత్యజీవన విధానాన్ని జానపద పద్ధతిలో చిత్రించి తనదంటూ ఒక పద్ధతి నెలకొల్పారు.
(నవంబర్‌ 11, 2018 సోపతిలో అంత్యాకుల పైడిరాజుగారి గురించి విపులమైన నా వ్యాసం ప్రచురించబడింది. అందువలన ఇక్కడ ఎక్కువ వివరాలు తీసుకొనబడలేదు).

డా||యం.బాలామణి, 8106713356

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -