Sunday, August 2, 2026
E-PAPER
Homeసమీక్షకొని దాచుకొని చదవదగ్గ కథలు

కొని దాచుకొని చదవదగ్గ కథలు

- Advertisement -

అహాన్ని దాటితే ఏమవుతుంది? ఇతరుల పట్ల ద్వేషం, అసూయ, ఓర్వలేనితనం పోతుంది. అంతరంగంలో ఒక విధమైన ప్రశాంతత, తేలిక భావం, స్వచ్ఛత కలుగుతుంది. జి. ఉమామహేశ్వర్‌ గారి కధా సంపుటి ‘ఆహానికి ఆవల’ లోని విశాలకు జరిగింది ఇదే! అన్నీ మంచంలోనే కానిస్తున్న ఆమె అత్తగారు విజయకు జరిగింది ఇదే!!.
తన కనుసన్నలలో, అదుపాజ్ఞల్లో ఉండాల్సిన కోడలు, విశాల ఆదుపాజ్ఞల్లో తాను ఉండాల్సివస్తే, అత్తగారి ఎత్తిపొడుపులు, సాధింపులు, కక్ష సాధింపు చర్యలు – వీటన్నింటినీ దాటుకుని ఆత్తగారికే స్వయంగా సేవలు చేయాల్సివస్తే- అహం చంపుకోవాల్సి వచ్చిన విశాలకు, ఆత్త విజయకూ – ఇద్దరి ఆహాల్ని పక్కన పెట్టి ఇంటరాక్ట్‌ అవ్వాల్సివస్తే, ఇద్దరి అంతరంగాలు తేలిక పడి స్వచ్ఛత భావం కలుగుతుంది. ఉమా మహేశ్వర్‌ టైటిల్‌ కథ చదివితే, ఇదే తేలిక భావం పాఠకుడూ ఫీలవుతాడు.

స్వార్ధ పరులైన మానవ జాతికి అన్ని ప్రాణులూ దాసోహమవ్వాల్సిందే! కదల్లేని చెట్టూ చేమా, కదలగలిగే జంతువులు అన్నీ మనుషులకు సేవ చేయాల్సిందే!! నోరూ వాయీ లేని చెట్ల సంగతి ఏమిటో కాని నోరున్న జంతువులూ తనకు సేవ చేయాల్సిందే. గొర్రె, మేకా మానవుల ఆహారానికి ఆహుతవాల్సిందే. పొద్దున లేస్తూనే కాఫీ, గొంతులోకి దిగంది లేవబుద్దేయని మనిషికి లేగదూడల మూతులు కట్టేసి మరీ ఆవు, గేదెల పాలు పితకాల్సిందే. పాలు చేపేదాకా లేగలను విడిచి, చేపినాక ఆ ఆవు, గేదెల కళ్ళముందే లేగలను లాక్కెళ్ళి దూరం కట్టేసి పాలు పిదుకుతారు నిర్దయగల మానవులు. మనుషుల స్వార్థానికి ఆ లేగ దూడలు బలికావల్సిందేనా? కాదు. అంటున్నారు రచయిత ‘బిడ్డసం’ కథలో.
తాగుడుకు బానిసై ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకుపోయే భర్తలకు తెలీకుండా బిడ్డల చదుకులకు ఎంతో కొంత తల్లులు దాచి పెడతారు. మనిషైనా పశువైనా కన్నబిడ్డల సంక్షేమానికి భర్తలను మోసగించి అయినా ఎంతో కొంత దాచి పెడతారు అన్న వివరణ పాఠకుడికి, తల్లి మనసు గురించి ఓ కొత్త సందేశం ఇచ్చారు రచయిత. పాలిచ్చే పశువుల్లో ఉమామహేశ్వరరావు ఇచ్చిన ఈ కొత్త వివరణకు శాస్త్రీయత ఉందోలేదో కాని మాతత్వపు గొప్పతనం ఉంది. నిస్సహాయతను గెలిచిన అమ్మతనం వుంది.

‘పిల్లలు’ అనుకుంటాం గాని వాళ్ళు పిడుగులు. ప్రకటించలేరేమో గాని ఆ చిన్నబుర్రలు కూడా ఆలోచిస్తాయి. ‘నాన్నా… పులి’ లాంటి మామూలు సాధారణమైన కథల్ని అసాధారణంగా ఆలోచించగలరు అంటున్నారు ఈ కథలో.
మన మానసికస్థితి, ఆలోచన, ఆందోళనలు మనం చేస్తున్న పనిలో వ్యక్త మవుతాయి. ఈ కథకుఇచ్చిన టైటిల్‌ ‘216’. లింగంపల్లి – కోఠి బస్సు రూటు 216. ఈ రూట్లో బస్సు నడుపుతోన్న డ్రైవర్‌ ఆంజనేయులు బిడ్డను లేబర్‌ రూంకు తీసుకెళ్ళారని భార్య ఫోను చేసి చెప్పింది. వార్త విన్నప్పటి నుండి ఆంజనేయులు మనసు అందోళనగా ఉంది. నడుపుతోన్న బస్సుమీద, ఎక్కేదిగే జనాల మీద, రోడ్డు మీదనడిచే స్కూటర్లు, పాదచారుల మీద విసుక్కుంటాడు. పైకే ప్రకటించుతాడు. హాస్పిటలో బిడ్డకు సుఖ ప్రసవం అవుతుంది. బిడ్డను, మనవడిని తప్తిగా చూసుకుంటాడు. ఈ సంతోషం, ఆనందం తిరుగుప్రమాణంలో వ్యక్తమవుతుంది.
16 కథలున్న ఈ సంచిక ఉమామహేశ్వరావు నాలుగవ కథాసంపుటి. ఈ రచయిత కథలు ఆలోచింప చేస్తాయి. చెప్పే విషయం ఏదైనా ప్రతీ కథలో ప్రత్యేకతను చూపుతారు. పాఠకుడికి ఓ కొత్త కోణాన్ని గోచరింప చేస్తారు. పీచర సునీతారావు కథా పురస్కారం -2025 గెలుచుకున్న ఈ కథా సంపుటి కొని దాచుకుని అప్పుడప్పుడు చదవదగ్గది.

కూర చిదంబరం, 8639338675

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -