ఇంతకు ముందు తరం పిల్లలకు చందమామ, బాలమిత్ర లాంటి పిల్లల పత్రికలు అందుబాటులో ఉండేవి. పిల్లలకు కథలు చెప్పే పెద్దలు ఒకరో, ఇద్దరో ఇంట్లో ఉండేవారు. అందువల్ల ముందుతరం వారు పుస్తకపఠనానికి అలవాటు పడ్డారు. దానివల్ల వీరి వ్యక్తిత్వం ఉన్నతంగా తయారయ్యే దానికి అవకాశం ఏర్పడింది. ఇప్పుడు పిల్లలకు పుస్తకాలు దూరమై పోయాయి. బండెడు ‘బడి’ సిలబస్ వారికి తలకు మించిన భారం అయిపోయింది. ఇక బయట పుస్తకాలు చదివే తీరిక, ఓపిక ఎక్కడివి? దాదాపు పిల్లల పత్రికలు కనుమరుగై పోయిన ఈ రోజుల్లో ‘రాజు’ లాంటి రచయితలు అవిరామంగా పుస్తకాలు రాస్తూ వ్యయ ప్రయాసలకోర్చి వాటిని ముద్రించి బాల పాఠక లోకానికి అందిస్తూ బాలసాహిత్యానికి ఇతోధికంగా సేవలందిస్తున్నారు.
ఆర్సీ కష్ణస్వామి రాజు ఒక పక్క పెద్దల కథలు రాస్తూ, మరొక పక్క తాత్త్విక చింతనతో కూడిన కథలను రాస్తూ, అన్నింటికీ మించి పిల్లల కథలను రాస్తూ బాలల మానసిక వికాసానికి దోహదం చేస్తుండటం ముదావహం. ఇంతకు ముందు 22 పుస్తకాలు తీసుకొచ్చిన రాజు 23వ పుస్తకంగా ‘కటకటా మర్కటా!’ ను ప్రచురించారు. కథల పేర్లు కూడా తమాషాగా పెడుతుంటారు. ఆవిష్కరణ సభలూ ఘనంగా చేస్తుంటారు. ఇందతా ఎందుకు చెబుతున్నానంటే ‘బాలసాహిత్యం’ మీద ఆయనకున్న అంకితభావం అంతటిది.
‘కటకటా మర్కటా!’ అనే ఈ పిల్లల కథల పుస్తకంలో 30 కథలున్నాయి. ప్రతి కథా.. సందేశం, నీతి కలిగి వున్నదే. బాల సాహిత్యానికి రెండు కండ్లు అయిన సంక్షిప్తత, సరళత ఈయన కథల్లో తిష్ఠ వేసుకొని కూర్చుంటాయి. విసుగు కలిగించక వేగంగా చదివింపజేస్తాయి. ఇది ఆయనలోని ప్రత్యేక రచనా శైలికి సంబంధించిన గుణం.
– డా. గంగిశెట్టి శివకుమార్
కటకటా మర్కటా!
- Advertisement -
- Advertisement -



