కవితా ప్రక్రియ రానురాను మధ్యాహ్నపు నీడలా కురచ బడుతుంది. కానీ భావసాంద్రతలో దీర్ఘ కవితకు ఏ మాత్రమూ తీసి పోవటం లేదు. Brevit is the sol of wit (క్లుప్తతే ఆత్మకు ప్రాణాధారం) అని విలియం షేక్‌స్పియర్ అన్నట్లు, కథలు కవితల్లో క్లుప్తత వచ్చింది. నేటి పాఠకులు కూడా క్లుప్తత వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకనాటి దీర్ఘ కవిత రూపాంతరం చందుతూ ఒకటి లేక రెండు పేజీలయింది. హైకూలు, నానో, నానీ, తాతీ, దాదీ, మొగ్గలు, ఏక పద కవితలు.. ఇలా చాలానే వచ్చాయి ఈ మధ్య. అప్పటికప్పుడు మెరిసిన కొన్ని భావాల సూక్ష్మ రూప వ్యక్తీకరణే ‘తటిల్లతలు’ అంటున్నారు మార్క్సిజం సిద్ధాంత బుద్ధిజీవి, కవి కె. ఆనందాచారి.
తన కవిత్వానికి, కవిత్వ ప్రక్రియకు ‘తటిల్లతలు’ అని నామకరణం చేసి ప్రస్తుత సంచికలో 105 తటిల్లతలను అందిస్తున్నారు. ఈ పుస్తకానికి మరో ప్రత్యేకత తన తెలుగు తటిల్లతలకు (Flash Poetry) మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ ఆంగ్లానువాదం కూడా ఇచ్చారు. ఇవి శబ్దం చేయని (ఉరుములు లేని) మెరుపులు అనవచ్చు. క్షణకాలమే అయినా, ఇవి పాఠకుని మనసులో నిలిచి కదిలిస్తాయి. ఒక్కోచోట కలవర పెడతాయి. జీవిన తాత్త్వకతను బోధిస్తాయి. స్థాలీపులాక న్యాయంగా కొన్ని తటిల్లతలను పరిశీలిద్దాం.
‘‘ఆచరణ, ఆలోచనల మధ్య అంతరాన్ని కవి ఇలా చెబుతారు. అందరూ ఆచరణలో/ నిమగ్నమయ్యే వుంటారు/ కానీ/ ఆలోచనలూ మాటలే/ వారిననుసరించవు’’ (పేజీ 31).
జీవితంలో ఎన్నో వచ్చి చేరుతుంటారు. ఎన్నింటినో పోగొట్టుకుంటాం. గుణకార భాగాహారాలకు లెక్కేలేదు. వీటినే కవితాత్మకంగా కవి ఇలా అంటారు. ‘‘కూడికలూ తీసివేతలూ/లెక్కకు సంబంధించినవే/ అనుకుంటారు/ కానీ/ ప్రతిదీ జీవితంలోనిదే!’’ (పేజీ. 32).
కవిత్వాన్ని ఎన్నో విధాలుగా రాయగలం. చెరిపివేసి మరో విధంగా మార్చగలం. కానీ జీవితం అట్లా కాదు. గడియారంలోని లోలకం ముందుకు నెడుతున్న ప్రతిక్షణమూ, చోటు చేసుకుంటున్న సంఘటనా శిలాక్షరాలవుతాయి. ఆనందాచారి ఇలా అంటారు.. ‘‘జీవితం/కవిత్వంలా/ ఎడిటింగ్‌కు/ వీలవటం లేదు!’’ (పేజీ 36).
నిజాలను కప్పెట్టటం, అబద్దాలను అందలమెక్కించటం రివాజు. లోకరీతి. దీన్నే కవి ఇలా అంటున్నారు.. ‘‘నిజాలు మరుగున/అబద్ధాలు వెలుగున…’’ (పేజీ 144).
జీవితానికి, అక్షరానికి మధ్య తాతరం, కవి మనసులో ఇలా వెలిగింది. ‘‘రావటం/ ఎదగటం, పోవటం (జీవితానిది).
రావటం/ వెలగటం, శాశ్వతం/ కావటం అక్షరానిది!’’ (పేజీ 200) ప్రత్యక్షర సత్యం.
పి. శ్రీనివాస్ గౌడ్ ఇంగ్లీషు అనువాదం కాదు.. అనునాదం. ‘‘కాలం/ భలే బోధకురాలు’’ అన్న తటిల్లతలను ఇలా హృద్యంగా.. ‘Time is/an amazing teacher/ without the need of words’ అన్న అనువాదం చక్కగా సరిపోయింది (పేజీ78). చిరుచిరు పదాల్లోనే చిరంతరమైన తాత్త్వికతను పొదగలగటం, అందమైన అనువాదం ఇవ్వటం కొత్త ‘ట్రెడిషన్’. ఇద్దరికీ అభినందనలు.
కూర చిదంబరం, 8639338675
‘తటిల్లతల’తో ‘ఆనంద’ నర్తనం
- Advertisement -
- Advertisement -



