Monday, August 3, 2026
E-PAPER
Homeజాతీయంఅసోం ఆదివాసీ హక్కుల నేత ప్రణబ్‌ డోలీపై నిర్బంధం

అసోం ఆదివాసీ హక్కుల నేత ప్రణబ్‌ డోలీపై నిర్బంధం

- Advertisement -

బెయిల్‌ వచ్చిన మరుసటిరోజే ఎన్‌ఎస్‌ఎ అమలు
కేంద్రం, అసోం ప్రభుత్వాల తీరుపై సర్వత్రా ఆగ్రహం


గువహతి, న్యూఢిల్లీ : అసోం ఆదివాసీ హక్కుల కార్యకర్త ప్రణబ్‌ డోలీకి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే ఆయనపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) ప్రయోగించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కాజిరంగా జాతీయ పార్కు సమీపంలోని హతిఖులి ప్రాంతంలో విలాసవంతమైన ఫైవ్‌స్టార్ రిసార్ట్‌ ఏర్పాటుకు ప్రతిపాదించి, తమ భూములను బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ గోలాఘాట్ జిల్లాలోని ఆదివాసీ గ్రామస్తులు గౌహతి హైకోర్టును ఆశ్రయించారు. వారి ఆందోళనకు మద్దతిస్తున్న డోలీని జులై 12న బొకాఖత్ పోలీసులు అరెస్టు చేసి, క్రిమినల్ కేసు నమోదు చేశారు. సెషన్స్‌ కోర్టు జులై 29న బెయిల్‌ మంజూరు చేసినా విడుదల చేయకుండా ఆ మరుసటి రోజే ఆగమేఘాలపై ఎఎస్‌ఎ కింద కేసు నమోదు చేసింది.

ఎవరీ డోలీ….
ప్రణబ్ డోలీ అసోంకు చెందిన ఆదివాసీ హక్కుల ఉద్యమకారుడు. మిస్సింగ్ సంఘం సభ్యుడు. టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్‌ఎస్‌) నుంచి ఎంఎస్‌డబ్ల్యూలో పట్టభద్రుడు. దశాబ్దాలుగా ఆదివాసీల భూ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, స్థానికుల హక్కుల కోసం పోరాడుతున్నారు. ‘గ్రేటర్ కాజిరంగా భూ, మానవ హక్కుల పరిరక్షణ కమిటీ’ (జీకేఎల్‌హెచ్‌ఆర్‌సీ), ‘జీపాల్ కృషక్ శ్రమిక్ సంఘ’ (జేకేఎస్‌ఎస్‌) వంటి సంస్థలకు కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారు. కాజిరంగా జాతీయ ఉద్యానవనం సమీపంలో నిర్వాసితులైన ఆదివాసీ, రైతు కుటుంబాల తరపున ఆయన న్యాయస్థానాల్లో చేసిన పోరాటం అంతర్జాతీయ గుర్తింపు పొందింది. కర్బీ ఆంగ్లాంగ్ సోలార్ పవర్ ప్రాజెక్టు ప్రభావిత ప్రజల హక్కుల కమిటీ (కెఎఎస్‌పీఎపీపీసీ) కన్వీనర్‌గా పోరాడిన ఆయన వెయ్యి మెగావాట్ల సోలార్‌ పార్కు కోసం 434.25 మిలియన్‌ డాలర్ల రుణాన్ని గత ఏడాది మేలో రద్దు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. 20 మంది ఆదివాసీ కుటుంబాల పిటిషన్ నేపథ్యంలో అసోం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏటీడీసీ)కి ఈ ఏడాది జూన్‌లో గౌహతి హైకోర్టు, నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణలో ఉండగానే జులై 12న గౌహతిలోని సుందర్పూర్ లో డోలీని పోలీసులు అరెస్టు చేశారు. జూన్‌ 28న చేపట్టిన నిరసనకు సంబంధించి బోకాఖత్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. డోలీ, మరో 50 మందికి పైగా వ్యక్తులు ప్రాజెక్టు సైట్లోకి చొరబడి, కత్తులు, పదునైన కర్రలు వంటి ఆయుధాలతో దాడి చేసి, సిమెంట్ మిక్సర్ కు నిప్పంటించే ప్రయత్నం చేశారని, పోలీసు సిబ్బందిపై దాడి చేశారని పోలీసులు ఆరోపించారు.

జులై 13న ఆయనను బోకాఖత్ కోర్టులో హాజరుపరచగా, 7 రోజుల పోలీస్ కస్టడీ విధించారు. తరువాత ఆయనను గోలాఘాట్ జిల్లా జైలుకు తరలించారు. జులై 29న గోలాఘాట్ సెషన్స్ కోర్టు డోలీకి బెయిల్‌ మంజూరు చేసింది, పోలీసులు చేసిన ఆరోపణలకు మద్దతుగా వీడియో ఆధారాలు లేవని, ప్రాణాంతక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. పర్యావరణ పరిరక్షణ ఆదివాసీల మనుగడ కోసం పోరాడుతున్న వారిని, స్థానికుల ఆందోళనలను అణచివేయడానికి క్రిమినల్‌ చట్టాన్ని ఉపయోగించకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఒకరోజు తరువాత జులై 30న అసోం ప్రభుత్వం డోలీపై జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసి, నిర్బంధంలో ఉంచింది. డోలీ కార్యకలాపాలు ప్రజా శాంతి, రాష్ట్ర భద్రతకు హానికరమని, 2017 నుంచి ఆయనపై 13 క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. “అనుమానాస్పద విదేశీ లావాదేవీలు”, ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్‌ఎ) ఉల్లంఘనకు పాల్పడ్డారని, స్పెయిన్, ఇటలీ, థాయిలాండ్, యుఎఇ, నేపాల్, నార్వే, ఫిలిప్పీన్స్, స్విట్జర్లాండ్, మలేషియా వంటి దేశాలకు ప్రయాణించారని ఆరోపిస్తూ ఈ కేసు నమోదు చేసింది.

వెంటనే విడుదల చేయాలి
డోలీ అరెస్టును ఖండిస్తూ, ఆయనను వెంటనే విడుదల చేయాలని పలు అంతర్జాతీయ సంస్థలు డిమాండ్‌ చేశాయి. ఆయనను ఎటువంటి షరతులు లేకుండా తక్ష‍ణమే విడుదల చేయాలని ఆసియా పసిఫిక్ నెట్వర్క్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డిఫెండర్స్ (ఎపిఎన్‌ఇడి), ఇంటర్నేషనల్ వర్క్ గ్రూప్ ఫర్ ఇండిజెనస్ అఫైర్స్ (ఐడబ్య్లుజిఐఎ) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరాయి. అమెరికాలోని అరిజోనా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యావేత్తలు కూడా డోలీని విడుదల చేయాలని కోరారు.

అధికార దుర్వినియోగమే : కాంగ్రెస్‌
అసోంలో భూ హక్కుల కార్యకర్త ప్రణబ్ డోలీకి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసిన మరుసటి రోజే ఆయనపై జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ) ప్రయోగించడం ప్రభుత్వ అధికార దుర్వినియోగమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసమ్మతిని అణచివేయడానికి బీజేపీ ప్రభుత్వాలు కఠిన చట్టాలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నాయని జైరామ్ రమేష్ విమర్శించారు. ఉత్తరప్రదేశ్‌లోనూ కార్మిక ఉద్యమాలపై ఇలాంటి చర్యలు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా నిర్బంధాన్ని కొనసాగించేందుకు నివారణ నిర్బంధ చట్టాలను వినియోగించవద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు, పలు హైకోర్టులు హెచ్చరించాయని గుర్తు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -