– టిజిబీ రీజినల్ హెడ్ రాజయ్య..
నవతెలంగాణ – తొగుట
ప్రమాదాలలో మృతి చెందిన కుటుంబాలకు భీమ తో దీమా ఉంటుందని తెలంగాణ గ్రామీణ బ్యాంకు రీజినల్ హెడ్ రాజయ్య అన్నారు. మంగళవారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో రెండు కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున రూ. 40 లక్షల విలువ భీమా చెక్కులు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. తొగుట గ్రామానికి చెంది న సిలివెరి మల్లేశం వృత్తి రీత్యా గీత కార్మికుడు ఈత చెట్టు మీది నుండి పడి మృతి చెందాడు. నామినిగా మృతుని భార్య సిలివెరి లలితకు రూ. 20 లక్షలు, మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన చంద నర్సయ్య వ్యవసాయం చేసుకుం టూ జీవనం సాగించాడు.
గత సంవత్సరం వ్యవసాయ పనులు చేస్తున్న క్రమంలో ప్రమాద వశాత్తూ విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. నామిని గా తన కుమారుడు చంద కృష్ణకు రూ. 20 లక్షల చెక్కును పంపిణీ చేశారు. అనంతరం టిజిబీ బ్యాంకు హెడ్ మాట్లాడుతూ.. ప్రమాదం అనేది ఎప్పుడు ఎక్కడ సంభవిస్తుందో ఎవరికి తెలియదన్నారు. అలాంటి ప్రమాదాలలో కుటుంబ యజమాని మరణిస్తే ఆ కుటుంబం ఇబ్బందుల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి కుటుంబాలకు సంవత్సరానికి రూ. 1000 బీమా చేస్తే ప్రమాదవశాత్తు మృతి చెందితే వారికీ రూ. 20 లక్షలు బీమా డబ్బులు వస్తాయని తెలిపారు.
ప్రతి ఒక్కరు ఇలా సంవత్సరానికి ఒకసారి బీమా చేసుకోవాలని వారి కుటుంబానికి దీమా ఇవ్వాలని సూచించారు. ఇలాంటి వాటి వల్ల అ కుటుంబాలు వీధిన పడకుండా ఆర్థిక సహకారం అందుతుందని చెప్పారు. ప్రమాదాలు చెప్పి రావని, మనకు తెలిసి ప్రమాదం బారిన పడబోము.. కావున వేరుగా ఊహించుకోకుండ ఇలాంటి ప్రమాద బీమాను ప్రతి ఒక్కరు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తొగుట టిజిబీ మేనేజర్ జలంధర్, ఫీల్డ్ ఆఫీసర్ ప్రణీత్, క్యాషియర్ రవికుమార్, చందాపూర్ సర్పంచ్ చంద లావణ్య స్వామి, ఎస్బిఐ జనరల్ ఇన్సూ రెన్స్ కంపెనీ శ్రీకాంత్, కృష్ణ, తొగుట సిఎఫ్ఎల్ కౌన్సిలర్ ఏ. శ్రీనివాస్, బి. స్వామి, సిహెచ్. రాజు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.



