నవతెలంగాణ-చేర్యాల
బోరు బావులు, ఆవుల షెడ్డు, వ్యవసాయ పనుల నిమిత్తం చేసిన అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర ఘటన సిద్దిపేట జిల్లా చేర్యాల మండల పరిధిలో జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల మండలం కొత్త దొమ్మాట గ్రామానికి చెందిన రైతు శెట్టె రామస్వామి(38) వ్యవసాయం కోసం, ఆవుల షెడ్డు నిర్మాణం, బోర్లు వేయడం వంటి పనులకు అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై.. సోమవారం సాయంత్రం ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. అనంతరం తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరి మండల కేంద్రానికి వెళ్లి పెద్ద చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మంగళవారం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుని భార్య శెట్టె లలిత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుని తండ్రి కనకయ్య చాలా ఏండ్ల కింద అనారోగ్యంతో మృతిచెందాడు. సోదరుడు కూడా కొన్నాళ్ల కిందటే మృతి చెందాడు. ఆ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్న రామస్వామి ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



