రజస్వల కావడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియే అయినప్పటికీ… ఆడపిల్లలున్న ప్రతి తల్లికీ అది కలవరమే! ఒకవేళ ఆ సమయం కంటే మూడు, నాలుగేండ్ల ముందే వస్తే… ఆ ఆందోళన మాటల్లో చెప్పలేం. ఈ పరిస్థితి బాలికలను శారీరకంగానే కాకుండా, మానసికంగానూ తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది. అలాంటప్పుడు మరి ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం…
బొద్దుగా ముద్దుగా ఉండే ఆరేండ్ల చిన్నారికి అప్పుడే నెలసరి మొదలైపోయింది. ఆ వయసులో ఆ పాపకు ఏం చెప్పాలో తెలియక ఆ తల్లి పడిన బాధ వర్ణనాతీతం. వీళ్లే కాదు… బాల్యం దాటకముందే, కౌమారంలోకి అడుగుపెట్టక ముందే జరుగుతోన్న ఈ శారీరక పరిణామాలు ప్రస్తుతం చాలామంది తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
నాలుగైదేండ్లు ముందే
శారీరకంగా ఎదిగే క్రమంలో బాలికల్లో కనిపించే సహజమైన, కీలకమైన మార్పుల్లో రుతుక్రమం మొదలు కావడం ఒకటి. అయితే, మునుపటి తరాలతో పోలిస్తే ఈ తరం ఆడపిల్లల్లో నాలుగైదేండ్లు ముందుగానే ఈ మార్పు కనిపిస్తోందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. అమెరికా ఈ విషయంలో ముందుండగా… భారత్ కూడా దాంతో పోటీపడుతోందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
ప్రికోషియస్ ప్యూబర్టీ
సాధారణంగా 10-16 ఏండ్ల మధ్య అమ్మాయిలు రజస్వల అవుతుంటారు. కానీ, ఇప్పుడు ఎంతో మంది ఆడపిల్లలు పదేండ్లకు ముందే నెలసరిని చూస్తున్నారట. దీన్నే ‘ప్రికోషియస్ ప్యూబర్టీ’ అని పిలుస్తారు. ఈ పరిస్థితికి ముఖ్యంగా జీవనశైలి మార్పులు… జంక్, ప్యాకేజ్డ్ ఫుడ్ తీసుకోవడం, ఆహారవేళలు పాటించకపోవడం, శారీరక వ్యాయామం లేకపోవడం, అధిక బరువు, హార్మోనల్ సమస్యలు లాంటివి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాకుండా జన్యు లోపాలు, మెదడు-వెన్నెముకలో కణతులు, గాయాలు, రేడియేషన్ ప్రభావం వంటివీ ఇందుకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి అడ్రినల్, పిట్యూటరీ గ్రంథులూ, అండాశయాల్లో లోపాల వల్లా నెలసరి మొదలవుతుందని తెలియజేస్తున్నారు. అందుకే ఇలాంటి పరిస్థితి వస్తే కంగారు పడకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.
రాబోయే ప్రమాదాలు
నెలసరి ముందే ఆరంభమైతే సరైన మానసిక పరిపక్వత రాకపోయినా శారీరకంగా పెద్దగా కనిపించడంతో ఆత్మన్యూనతకు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. పెద్దవాళ్లయ్యాక గర్భస్రావాలు, నెలసరి సమస్యలు, ఆందోళన, డిప్రెషన్, పీఎంఓఎస్ వంటివీ ఇబ్బంది పెడతాయని చెబుతున్నారు. అంతేకాదు ప్యూబర్టీ ముందే మొదలవ్వడం వల్ల భవిష్యత్తులో ఒబెసిటీ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అమెరికన్ జనరల్ ఆఫ్ ఎపిడిమియోలజీ పేర్కొంది. ఇందుకోసం పదమూడు వేల మంది టీనేజీ పిల్లలపై భిన్న దశల్లో ఈ పరిశోధన చేశారట. అలాగే తొలి రుతుస్రావం త్వరగా ఆరంభమైతే.. రొమ్ము, ఎండోమెట్రియల్, ఒవేరియన్ క్యాన్సర్ల బారిన పడే ముప్పు ఎక్కువని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
జాగ్రత్తపడడం ఎలా..?
రజస్వల వయసుకి చేరువవుతోన్న అమ్మాయిల్లో శారీరకంగా, మానసికంగా పలు మార్పులు చోటు చేసుకోవడం సర్వసాధారణం. అయితే 8-10 ఏండ్ల మధ్య పిల్లల్లో మొటిమలు రావడం, ఛాతీ పెరుగుదల, బాహుమూలల్లో వెంట్రుకలు రావడం వంటి శారీరక మార్పుల్ని ముందే గుర్తిస్తే డాక్టర్‌ను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. అవసరమైతే ఆ లక్షణాలను గుర్తించడానికి పరీక్షలు చేస్తారని తెలియజేస్తున్నారు. అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తారు. రుతుక్రమం మొదలయ్యే వేళ ఆడపిల్లలకు తల్లి తోడు అవసరమని నిపుణులు అంటున్నారు. అందుకే ముందే మీరు కంగారు పడిపోకుండా ఆ సమయంలో పరిశుభ్రత, పోషకాహారం వంటివాటి ప్రాధాన్యం వివరించాలని పేర్కొంటున్నారు. ఆత్మన్యూనతకు గురి కావాల్సిన అవసరం లేదనీ, ప్రతి ఆడపిల్లకూ అనుభవమవుతుందని అర్థమయ్యేలా చెప్పాలని వివరిస్తున్నారు.
పోషకాహారం తప్పనిసరి
మనకి తెలియకుండానే రకరకాల రసాయనాలు శరీరంలోకి చేరుతున్నాయి. ఆహారం, వాతావరణం, రేడియేషన్ ఇలా దేని నుంచి సమస్య వస్తుందో సృష్టంగా తెలియదని నిపుణులు చెబుతున్నారు. జెనెటిక్స్.. తరాలు మారే కొద్దీ మార్పు చెందుతాయట. అయితే ఇదే ప్రికోషియస్ ప్యూబర్టీకి కారణమా అన్నదీ తెలియదని అంటున్నారు. కారణం ఏదైనా అమ్మాయి ప్రభావితమవుతుందట. అందుకే, తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. ముఖ్యంగా జంక్‌ఫుడ్ తీసుకుంటే పోషకాల లోపంతో పాటు ఒబెసిటీ వస్తుందని చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారపానీయాలను ఎంచుకోవడం, చురుకుగా ఉండటం, తగినంత నిద్రపోవడం, శారీరక, మానసిక ఆరోగ్యానికి కీలకమని నిపుణులు చెబుతున్నారు.
కొన్ని మార్పులు…
శారీరక శ్రమలేకపోవడం, తగిన నిద్రవేళలు పాటించకపోవడం వంటి జీవనశైలి మార్పులు కూడా త్వరగా రజస్వల కావడానికి కారణమంటున్నారు నిపుణులు. ఈ పరిస్థితి తీవ్ర ప్రభావాన్ని చూపించకూడదంటే… ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని చెబుతున్నారు. ప్రొటీన్లు ఎక్కువగా లభించే చేపలు, మాంసం, పప్పులు, గింజలు, కోడిగుడ్లను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. రక్తహీనత నివారణ, హార్మోన్ల సమతౌల్యతలో ఐరన్‌ది కీలకపాత్ర పోషిస్తుందట. అందుకే ఆకుకూరలు, అంజీర, దానిమ్మ, నువ్వులు, బెల్లం వంటివి తీసుకోవాలని సలహా ఇస్తున్నారు. ఈ మార్పులతో పాటు రోజూ అరగంట పాటు వ్యాయామం చేయడం వల్ల హార్మోన్లు సమతులంగా ఉంటాయని వివరిస్తున్నారు. దీనివల్ల మానసిక సమస్యలూ దరిచేరవని పేర్కొంటున్నారు. బరువు అదుపులో ఉండి భవిష్యత్తులో పీఎంఓఎస్, థైరాయిడ్ వంటి సమస్యలు రాకుండా జాగ్రత్తపడొచ్చని సూచిస్తున్నారు.



