లక్షల్లో నిర్వహణ ఖర్చులు..
నర్సరీల్లో ఖాళీ బ్యాగులు
ఏటా ఒకే చోట నాటుతూ ‘రికార్డుల’ మాయాజాలం
సంరక్షణ లేక
ఎండిపోతున్న మొక్కలు
వృథా అవుతున్న ప్రజాధనం
నవతెలంగాణ-వేంసూరు
గ్రామ పంచాయతీల్లో పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టే ‘వన మహోత్సవం’ పథకం ఆశించిన ఫలితాలివ్వట్లేదు. నిధులు స్వాహా అవుతున్నాయి తప్ప మొక్కలు పెరగట్లేదు. ఏటా నిర్వాహణ పేరిట లక్షలు ఖర్చు చేస్తున్నా…నర్సరీల్లో ఖాళీ బ్యాగులే దర్శనమిస్తున్నాయి. నాటిన చోటే మొక్కలు నాటుతూ రికార్డుల మాయాజాలం చేస్తున్నారనే విమర్శలున్నాయి. నర్సరీల్లో మొక్కలు పెంచి వాటిని నాటే కార్యక్రమానికి ఇస్తున్న ప్రాధాన్యత సంరక్షణ కోసం ఇవ్వట్లేదు. దీంతో వన మహోత్సవం పేరిట ప్రజాధనం వృథా అవుతుందే తప్ప చెట్లు పెరిగి పర్యావరణానికి దోహదపడుతున్న పరిస్థితి లేదు.
రూ.లక్షన్నర ఖర్చు..ఫలితం సున్నా!
ఖమ్మం జిల్లా వేంసూరు మండలంలో వనమహోత్సవ కార్యక్రమం ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేకపోతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, పంచాయతీ పాలకవర్గాల నిర్లక్ష్యం కారణంగా లక్షల రూపాయల ప్రజాధనం వృథా అవుతుందనే విమర్శలు ఉన్నాయి. మండల వ్యాప్తంగా 26 గ్రామ పంచాయతీల్లో ఒక్కో నర్సరీ నిర్వహణకు సరాసరిగా రూ.1,50,000 పైగా ఖర్చు చేస్తున్నారు. ఇందులో ఉపాధి హామీ ద్వారా రూ.1,15,000 వరకు ఖర్చు చూపిస్తుండగా, మిగిలిన నిధులను గ్రామ పంచాయతీ నుంచి వెచ్చిస్తున్నారు. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 3,000 మొక్కలు నాటాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం నర్సరీలు ఖాళీ ప్లాస్టిక్ బ్యాగులతో దర్శనమిస్తున్నాయి. మొక్కల పెంపకం పేరిట నిధులు ఖర్చు అవుతున్నాయి తప్ప నర్సరీల్లో పెంచట్లేదు.
నాటిన చోటే నాటుతూ రికార్డుల మాయ!
కాగితాల్లో లక్షల మొక్కలు నాటినట్టు లెక్కలు చూపిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మొక్కల సంరక్షణ పట్టించుకునేవారే కరువయ్యారు. గతేడాది నాటిన మొక్కల్లో కనీసం 10 శాతం కూడా బతకలేదు. ప్రతి ఏటా ఒకే ప్రదేశంలో మొక్కలు నాటినట్టు చూపిస్తూ రికార్డులు మారుస్తున్నారు తప్ప, కొత్తగా పెరిగిన చెట్లేవీ కనిపించడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అన్ని పంచాయతీల్లో మొక్కలు నాటే కార్యక్రమం ముమ్మరంగా సాగాల్సి ఉండగా, కేవలం రెండు, మూడు పంచాయతీలలో మాత్రమే మొక్కుబడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మమ అనిపించారు. ఏటా ఒక్కో గ్రామంలో వేలాది మొక్కలు నాటుతున్నట్టు రికార్డులు కనిపిస్తున్నా. అలా చూస్తే ఏటా వెయ్యి మొక్కలు నాటినా ఈ మూడేండ్ల కాలంలో ఒక్కో గ్రామ పంచాయతీ పరిధిలో మూడు వేల మొక్కలు పెరగాలి. కానీ ఎక్కడ చూసినా వనమహోత్సవంలో నాటిన మొక్కలు బతికిన దాఖలాల్లేవు.
ప్రజాధనం వృథా కాకుండా చూడాలి
ఉపాధి హామీ నిధులు, పంచాయతీ నిధుల ఖర్చులు కేవలం రికార్డుల నమోదుకే పరిమితం కాకుండా.. ఆ డబ్బులు వెచ్చించి నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా చూడాలి. ఉన్నతాధికారులు తక్షణమే పర్యవేక్షణ పెంచి, నర్సరీల పనితీరుపై సమగ్ర విచారణ జరిపించాలి. నాటిన మొక్క వృక్షంగా పెరిగే బాధ్యత తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ఎల్‌నినో ప్రభావంతో ఆలస్యమైంది
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులే ర్పడ్డాయి. ఈ ఏడాది వర్షాలు అనుకూలించ కపోవడం వల్లే మొక్కలు నాటే కార్యక్రమం కాస్త ఆలస్యమైంది. పెంపకం, పంపిణీ ఇప్పటికే రామన్నపాలెంతో పాటు మరో రెండు పంచాయతీలలో పూర్తయింది. నిర్వహణ లోపం వాస్తవమే. కొన్ని గ్రామ పంచాయతీలలో నర్సరీల నిర్వహణ లోపం వల్ల ఖాళీ బ్యాగులు ఉన్న మాట వాస్తవమే. త్వరితగతిన లోపాలను సరిదిద్ది లక్ష్యాన్ని పూర్తి చేస్తాం.
ఈజీఎస్ ఏపీఓ విజయ్



