Monday, August 10, 2026
E-PAPER
Homeఆటలురాణించిన జైస్వాల్‌, గిల్‌

రాణించిన జైస్వాల్‌, గిల్‌

- Advertisement -

207 లక్ష్యం 45 ఓవర్లలో ఉఫ్‌ వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ విజయం

మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌లో టీమ్‌ ఇండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరు రోజు ఆటలో వికెట్ల జాతరతో పాటు పరుగుల వరద పారగా.. ఆతిథ్య శ్రీలంక ఎలెవన్‌పై టీమ్‌ ఇండియా పైచేయి సాధించింది. 207 పరుగుల ఊరించే లక్ష్యాన్ని భారత 45 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (61), శుభ్‌మన్‌ గిల్‌ (44) ఛేదనలో రాణించారు. భారత్‌, శ్రీలంక తొలి టెస్టు 15 నుంచి గాలెలో ఆరంభం కానుంది.

కొలంబో (శ్రీలంక)
టీమ్‌ ఇండియా వార్మప్‌ అదిరింది. 135 ఓవర్లు బౌలింగ్‌ సాధన చేసిన శుభ్‌మన్‌సేన.. మరో 135 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేసింది. గాయం బారిన పడిన కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాట్‌ పట్టగా… యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఫామ్‌లోకి రావటం భారత్‌కు అతిపెద్ద ఊరట. యశస్వి జైస్వాల్‌ (61, 46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్థ సెంచరీతో చెలరేగాడు. ధనాధన్ అర్థ సెంచరీతో మెరిసిన యశస్వి జైస్వాల్‌కు కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ (44, 54 బంతుల్లో 7 ఫోర్లు) ఆకట్టుకునే ఇన్నింగ్స్‌తో మద్దతుగా నిలిచాడు. 207 పరుగుల ఛేదనలో ఓపెనర్లు 105 పరుగుల భాగస్వామ్యంతో రాణించగా.. రిషబ్ పంత్‌ (28, 68 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (22, 32 బంతుల్లో 3 ఫోర్లు), మహ్మద్‌ సిరాజ్‌ (32 నాటౌట్‌, 15 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) లాంఛనం ముగించారు. తొలి ఇన్నింగ్స్‌లో కదం తొక్కిన దేవదత్‌ పడిక్కల్, కెఎల్‌ రాహుల్‌లు ఛేదనలో బ్యాటింగ్‌కు రాలేదు. 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన భారత్‌ 6 వికెట్ల తేడాతో వార్మప్‌ మ్యాచ్‌లో విజయం సాధించింది.

బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ అదిరింది
తొలి టెస్టు ముంగిట టీమ్‌ ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌ ఫామ్‌లోకి వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో దేవదత్‌ పడిక్కల్‌, రవీంద్ర జడేజా, కెఎల్‌ రాహుల్‌ మెరువగా.. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌, శుభ్‌మన్‌ గిల్‌ రాణించారు. యశస్వి జైస్వాల్‌ తనదైన శైలిలో దూకుడుగా ఆడాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో చెలరేగాడు. శుభ్‌మన్‌ గిల్‌ కాస్త నెమ్మదిగా ఆడినా.. బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ (28) క్రీజులో సౌకర్యవంతంగా కనిపించలేదు. మూడు సిక్స్‌లు, ఓ ఫోర్‌ కొట్టినా.. సహజశైలికి భిన్నంగా ఆడాడు. 68 బంతులు ఆడినా, 28 పరుగులే చేశాడు. మరో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ధ్రువ్‌ జురెల్‌ (17) ఓ ఫోర్‌, సిక్సర్‌తో మెరిసినా ఎంతోసేపు వికెట్‌ నిలుపుకోలేదు. రవీంద్ర జడేజా (22) మూడు ఫోర్లు బాది రిటైర్డ్‌ హర్ట్‌గా నిష్క్రమించాడు. మహ్మద్‌ సిరాజ్‌ (32 నాటౌట్‌) ఆఖర్లో నాలుగు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో దంచికొట్టాడు. దీంతో భారత్‌ లక్ష్యాన్ని ఛేదించగలిగింది.

రాణించిన బౌలర్లు
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ ఓవర్‌నైట్‌ స్కోరు 357/6 వద్ద డిక్లరేషన్‌ ప్రకటించింది. 6 పరుగుల ఆధిక్యంతో రెండోసారి బ్యాట్‌ పట్టిన శ్రీలంక ఎలెవన్‌.. 45 ఓవర్లలో 200 పరుగులు చేసింది. ఓపెనర్‌ నిశాన్‌ ఫెర్నాండో (63, 73 బంతుల్లో 10 ఫోర్లు) అర్థ సెంచరీతో నిలబడ్డాడు. రసంత (8), పసిందు (4), పవన్‌ (16)లు స్వల్ప స్కోర్లకు అవుటయ్యారు. మిడిల్‌ ఆర్డర్‌లో బండార (35), ధనంజయ (46) రాణించారు. భారత పేసర్లలో మహ్మద్‌ సిరాజ్‌ (1/25), ప్రసిద్‌ కృష్ణ (1/35) చెరో వికెట్‌ పడగొట్టగా.. గుర్నూర్‌ బరార్‌ (2/37) రెండు వికెట్లతో మెరిశాడు. స్పిన్నర్‌ రవీంద్ర జడేజా (2/33) రెండు వికెట్లతో మాయ చేశాడు. కుల్‌దీప్‌ యాదవ్‌ బౌలింగ్‌కు రాలేదు. సరాంశు జైన్‌, మానవ్‌ సుతార్‌లకు వికెట్లు దక్కలేదు.

సంక్షిప్త స్కోరు వివరాలు
శ్రీలంక ఎలెవన్‌ తొలి ఇన్నింగ్స్‌ : 363/8 డిక్లేర్డ్‌
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 357/6 డిక్లేర్డ్‌
శ్రీలంక ఎలెవన్‌ రెండో ఇన్నింగ్స్‌ : 200/6
డిక్లేర్డ్‌ (45 ఓవర్లు)
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ : 214/4 (45 ఓవర్లు)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -